Heart Failure: యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించండిలా..

మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అన్ని భాగాలను ఇది రక్తాన్ని (Blood) సరఫరా చేస్తుంది.

మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అన్ని భాగాలను ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది. జీవన శైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో హార్ట్ ఫెయిల్యూర్ (Heart Failure) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. యువకుల్లో సైతం ఈ సమస్య వేధిస్తోంది. అసలు హార్ట్ ఫెయిల్యూర్ (Heart Failure) అంటే ఏంటి? లక్షణాలు, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే అంశాలతోపాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను బెంగళూరులోని కావేరి హాస్పటల్ కన్సల్టెంట్ కార్డియోథెరసిస్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజేష్ టీఆర్ మాటల్లో తెలుసుకుందాం..

పంపింగ్ సామర్థ్యం తగ్గడం

గుండె రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గిపోతే చివరకు అది హార్డ్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఇటీవల కాలంలో యువకుల్లో ఈ సమస్య ఏర్పడుతోంది. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి త్వరగా అలసిపోతాడు. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడతాడు.

లక్షణాలు

హార్ట్ ఫెయిల్యూర్‌తో శరీరంలో నీరు పేరుకుపోతుంది. దీంతో వ్యక్తి ఉబ్బినట్లుగా కనిస్తాడు. పాదాల వాపు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికి ఛాతీలో నీరు చేరుతుంది. దీంతో ఫ్లాట్‌గా పడుకున్న ఊపీరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. సాధారణ పనులు చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. మంచం మీద నుంచి లేచి బాత్రూమ్‌కి సైతం వెళ్లలేడు. మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంటుంది.

కారణాలు

గుండె జబ్బులు గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చివరికి ఇది గుండె వైఫల్యానికి దారితీస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్‌కు సాధారణ కారణాల్లో కొరోనరీ ఆర్టరీ వ్యాధి ఒకటి. దీని కారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో బ్లాక్స్ డెవలప్ అవుతాయి. దీంతో గుండె కండరాలు దెబ్బతిని, గుండెపోటుకు కారణమవుతుంది. మధుమేహం, బీపీ వంటి సమస్యలు కూడా గుండె కండరాలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఈ పరిస్థితి కూడా కొరోనరీ ఆర్టరీ వ్యాధికి దారితీయవచ్చు. కొరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా గుండె కవాటాలు(వాల్వస్) దెబ్బతింటాయి.

దీంతో ఇది హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణమవుతుంది. గుండె కండరాలు బలహీనపడే పరిస్థితిని కార్డియోమయోపతి అంటారు. ఈ పరిస్థితికి స్పష్టమైన కారణాలు తెలియవు. కారణాలు తెలియని పరిస్థితిని ఇడియోపతిక్ అంటారు. ఆల్కహాల్, వైరల్ మయోకార్డిటిస్ వంటి ఇన్‌స్పెక్షన్, క్యాన్సర్-ట్రీట్‌మెంట్ మెడిసిన్, కొకైన్ వాడకం వంటి కారణల వల్ల కూడా గుండె కండరాలు బలహీనపడవచ్చు.

కొన్నిసార్లు తీవ్రమైన ఎమోషన్స్, శారీరక ఒత్తిడితో కూడా గుండె కండరం బలహీనపడతాయి. దీంతో గుండె సంకోచ, వ్యాకోచాలకు లోనై హార్ట్ ఫెయిల్యూర్‌ అవుతుంది. దీన్ని ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ లేదా టకోట్సుబో కార్డియోమయోపతి అంటారు. కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటాయి. దీంతో వారిలో గుండె నిర్మాణం సరిగా ఉండదు. ఈ పరిస్థితి కూడా హార్ట్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది.

నిర్ధారణ టెస్ట్‌లు

గుండె వైఫల్యాన్ని ఈజీగా డయగ్నోస్ చేయవచ్చు. ఫిజికల్ ఎగ్జామ్, కొన్ని రక్త పరీక్షలు, ఎక్స్-రే, ECG, ఎకోకార్డియోగ్రామ్ వంటి టెస్ట్‌ల ద్వారా గుండె జబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్‌ను నిర్ధారిస్తారు. కొన్నిసార్లు CT స్కాన్, MRI అవసరం కావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అయిన రోగులకు ఓరల్ మెడిసిన్ ద్వారా సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, ఇంజెక్షన్ల అవసరం కావచ్చు.

టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్ (Heart Failure) అంటే?

ఆసుపత్రిలో చేరిన హార్ట్ ఫెయిల్యూర్ రోగికి వీలైతే ప్రాథమిక కారణాన్ని సరిదిద్దాలి. ఈ సందర్భంలో ఇంటర్వెన్షన్ లేదా కార్డియాక్ సర్జరీ అవసరం కావచ్చు. కొంతమంది రోగులకు ఇచ్చే మెడిసిన్ సరిగ్గా పనిచేయక రోగం మరింత ముదిరే అవకాశం ఉంది. దీన్ని టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి రోగులకు కూడా ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి గుండె మార్పిడి.

గుండె మార్పిడితో సాధారణ జీవనం

బ్రెయిన్-డెడ్ రోగి హెల్తీ గుండెను టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. గుండె మార్పిడి తర్వాత డాక్టర్ల సూచన మేరకు అవసరమైన జాగ్రత్తలతో సాధారణ జీవితాన్ని గడపవచ్చు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌తో శరీరం కొత్త గుండెను తిరస్కరించకుండా నిరోధించడానికి ఇమ్యునోసప్రెసెంట్స్ అనే మెడికేషన్ ఉంటుంది.

అందుబాటులో కృత్రిమ గుండెలు

హార్ట్‌ట్రాన్స్ ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఇటీవల బాగా పెరిగింది. టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్‌‌కు సంబంధించి కొంతమంది రోగులకు సరిగ్గా సూట్ అయ్యే గుండె దొరకడం లేదు. ఇలాంటి వారికి కృత్రిమ గుండెలు అందుబాటులో ఉన్నాయి. ఇవి చిన్న సైజ్‌లో ఉంటాయి. ఈ పంపింగ్ డివైజ్‌లను గుండె కింద ఛాతీలో అమర్చి, వాటి పనితీరును తెలుసుకుంటారు. రీఛార్జబుల్ బ్యాటరీస్ సెట్, ఒక కంట్రోల్‌ను శరీరం వెలుపల ఉన్న ఒక చిన్న కేస్‌లో సెట్ చేస్తారు.

ఇవి శరీరం లోపల ఉన్న పంప్‌కు కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్‌కావడంతో ఈ డివైజ్‌లు మరింత చిన్నవిగా వస్తున్నాయి. వాటి పనితీరు కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు బ్యాటరీలను ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ట్రీట్ మెంట్ వ్యవస్థ ఇప్పుడు దేశమంతా అందుబాటులో ఉంది. ఇతర దేశాలకు చెందిన హార్ట్ ఫెయిల్యూర్ రోగులు సైతం మన దేశానికి వచ్చి చికిత్స పొందుతున్నారు.

నివారణ మార్గాలు

హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వచ్చిన తరువాత ట్రీట్‌మెంట్ తీసుకోవడం కన్నా ఈ సమస్య రాకుండా నివారించడం ఉత్తమమైన మార్గం. హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం రోజు వ్యాయామం చేయడం, ధూమపానం అలవాటు మానుకోవడం, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి సమతుల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

వెయిట్ మేనేజ్‌మెంట్ పాటించండి. మద్యం వాడకం పరిమితం చేయండి. మధుమేహం, బీపీ, ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే తగిన చికిత్స తీసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఇందుకు యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేయండి. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడపండి. కాగా, ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే స్లోగన్‌ (యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్)ను డాక్టర్ రాజేష్ టీఆర్ ఈ సందర్భంగా కోట్ చేశారు.

Also Read:  Hormones Imbalance: వీటితో హార్మోన్ల అసమతుల్యతకు చెక్‌ పెట్టేయండి