Cancer cells: రోగులు నిద్రపోగానే యాక్టివ్ అవుతున్న క్యాన్సర్ కణాలు.. ఇతర శరీర భాగాల్లోకి చొరబాటు!

డేంజరస్ వ్యాధి క్యాన్సర్. దీనికి చికిత్స చేసే పద్ధతులు కొత్తకొత్తవి వస్తున్నప్పటికీ.. నివారణ మార్గాలు మాత్రం దొరకడం లేదు.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 08:00 AM IST

డేంజరస్ వ్యాధి క్యాన్సర్. దీనికి చికిత్స చేసే పద్ధతులు కొత్తకొత్తవి వస్తున్నప్పటికీ.. నివారణ మార్గాలు మాత్రం దొరకడం లేదు. ఈనేపథ్యంలో స్విస్ ఫెడరల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ పరిశోధకులు రొమ్ము క్యాన్సర్ కణాలపై జరిపిన అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. రొమ్ము క్యాన్సర్ తో ఆస్పత్రుల్లో చేరిన 30 మంది మహిళల నుంచి క్యాన్సర్ కణాల శాంపిళ్లను సేకరించి జరిపిన రీసెర్చ్ లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఉదయంతో పోల్చుకుంటే రాత్రివేళ రొమ్ము క్యాన్సర్ కణాలు చాలా యాక్టివ్ గా ఉంటున్నట్లు తేలింది. ఇదే అంశాన్ని శాస్త్రీయంగా నిర్ధారించుకోవడానికి రొమ్ము క్యాన్సర్ కణాలను ల్యాబ్ లో ఎలుకల్లోకి చొప్పించారు. ఆ ఎలుకల్లోనూ రాత్రి నిద్రపోయిన తర్వాత.. ఉదయం కునుకు తీసిన సందర్భాల్లో క్యాన్సర్ కణాలు యాక్టివ్ గా మారినట్లు గుర్తించారు. ఉదయం వేళ క్యాన్సర్ కణాల యాక్టివిటీ తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఎలుకలు నిద్ర, విరామం తీసుకునే సమయాల్లో యాక్టివ్ గా మారుతున్న క్యాన్సర్ కణాలు.. శరీరంలోని ఇతర భాగాలకు కూడా క్యాన్సర్ ను వ్యాపింపజేసేంత ప్రమాదకరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. కేవలం నిద్ర వల్లే ఇలా జరుగుతోందని భావించలేమని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.

ఎందుకు.. ఎలా ?

ఉదయాన్నే లేవడానికి.. చీకటి పడగానే నిద్రపోవడానికి అవసరమైన సందేశాలను మెదడుకు పంపే వ్యవస్థ పేరు “సిర్సాడియన్ రిథం”. ఈ వ్యవస్థ లో మెలా టోనిన్, టెస్టో స్టిరాన్, గ్లూకో కార్ట్ కాయిడ్స్ అనే హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. బహుశా.. కొందరు క్యాన్సర్ రోగుల్లో ఈ హార్మోన్ల గతి తప్పిన పనితీరు కారణంగా క్యాన్సర్ కణాలు ఒక శరీర భాగం నుంచి మరో శరీర భాగానికి వ్యాపించే వీలు కలుగుతోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇందువల్లే రాత్రి వేళల్లో క్యాన్సర్ కణాలు యాక్టివ్ గా మారి, దగ్గరలోని ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందుతుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక జర్నల్ నేచర్ లో ప్రచురితం అయింది.