Bone Cancer Symptoms: బోన్ క్యాన్సర్ గండం.. ఈ లక్షణాలు ఉంటే పారా హుషార్!!

ఎముకల క్యాన్సర్లు దడ పుట్టిస్తున్నాయి. మాలిగ్నెంట్ కణాలలో ఎముకల మధ్య నియంత్రణ రహితంగా కణాల సంఖ్య పెరగటం వలన బోన్ క్యాన్సర్ వస్తుంది.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 08:48 AM IST

ఎముకల క్యాన్సర్లు దడ పుట్టిస్తున్నాయి. మాలిగ్నెంట్ కణాలలో ఎముకల మధ్య నియంత్రణ రహితంగా కణాల సంఖ్య పెరగటం వలన బోన్ క్యాన్సర్ వస్తుంది. బోన్ క్యాన్సర్ ఎముకలలో ఏర్పడి వివిధ రకాల సమస్యలకు గురి చేస్తుంది. ఎముకల క్యాన్సర్ (బోన్‌మ్యారో) ను తొలిదశలో గుర్తించడం ద్వారా రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు.బోన్ క్యాన్సర్ ఉండే వారిలో శరీరంలో లంప్స్, బరువు తగ్గడం, జ్వరం, రాత్రుల్లో చెమటలు పట్టడం, చలి వంటి లక్షణాలు కనబడుతాయి. వీటిని ప్రారంభంలోనే గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందించవచ్చు.
బోన్ క్యాన్సర్ వలన ఎముకలలో క్యావిటీలు ఏర్పడి, పెలుసుదనంగా మారి, సులువుగా విరుగుతాయి. అంతేకాదు ఆ ఎముకల్లో అసాధారణ పెరుగుదలకు ఛాన్స్ ఉంటుంది. బోన్ క్యాన్సర్ శరీరం మొత్తం విస్తరిస్తే మాత్రం రోగి త్వరగా మరణించే అవకాశం ఉంటుంది.

ప్రధాన లక్షణాలు

* ఎముకలు, కీళ్లలో నొప్పి: ఎముకలోని ఏదైనా భాగంలో క్యాన్సర్ కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి.

* వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు.

*ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది.

*శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి.

ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి

చికిత్స ఇలా..

ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు… శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా… శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించినప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు.

అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ…

ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ… కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు.
ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్‌నోడ్స్‌కు చేరితే… (లింఫ్‌నోడ్స్… అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక… ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే… అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్‌స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్‌మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే… చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు

గడ్డ తొలిదశలో..

బోన్ క్యాన్సర్ గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించటం వలన ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారించ లేకపోవచ్చు. అందుకే లక్షణాలు కనిపించినప్పుడు నిర్ధారణ కోసం CT, MRI స్కాన్‌ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్‌ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్‌ కణితి అయితే కచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలలో, చిన్నగా ఉంటే MRI, CT స్కాన్‌లలో బయటపడుతుంది. గడ్డ ఏ రకానికి చెందిందో నిర్ధారించడానికి బయాప్సీ పరీక్ష చేస్తారు.
బోన్‌ క్యాన్సర్‌ గడ్డలలో ఆస్టియో సార్‌కోమా, ఈవింగ్స్‌ సార్‌కోమా, కాండ్రో సార్‌కోమా, ఫైబ్రోసా సార్‌కోమా, కార్టోమా అనే రకాలుంటాయి. ఆస్టియో సార్‌కోమా, ఈవింగ్స్‌ సార్‌కోమా చిన్నవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్‌కోమా మధ్యవయసు వారిలో ఎక్కువ.

కణితి పెద్దగా ఉంటే..

క్యాన్సర్‌ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి వెళ్తారు. ఈ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్లకు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహ్యాలిటేషన్‌ చేయించుకోవాలి