Council : “నాడు ఎన్టీఆర్‌..నేడు జ‌గ‌న్‌”..మండ‌లి ర‌ద్దు..పున‌రుద్ధ‌ర‌ణ చ‌రిత్ర‌

రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థను వ్య‌తిరేకిస్తూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆనాడు దేశ వ్యాప్తం చ‌ర్చ‌కు తెర‌లేపాడు. అంతేకాదు, మండ‌లి వ్య‌వ‌స్థ‌ను వ్య‌తిరేకించాడు.

  • Written By:
  • Updated On - November 25, 2021 / 12:34 PM IST

రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థను వ్య‌తిరేకిస్తూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆనాడు దేశ వ్యాప్తం చ‌ర్చ‌కు తెర‌లేపాడు. అంతేకాదు, మండ‌లి వ్య‌వ‌స్థ‌ను వ్య‌తిరేకించాడు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. దుబారా ఖ‌ర్చును త‌గ్గించుకునే క్ర‌మంలో ఆ నిర్ణయాన్ని ఆనాడు ఆయ‌న తీసుకున్నాడు. పెద్ద‌ల స‌భ వ‌ల‌న క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవ‌ని ఆయ‌న భావ‌న‌. తెల్ల ఏనుగుల‌ను ప్ర‌జా సొమ్ముతో మేపాల్సిన అవ‌స‌రంలేద‌నే అభిప్రాయం ఎన్టీఆర్ కు ఉండేద‌ట‌.

 Also Read : అమరావతికి సమాధి ఇలా.?

1958వ ఏడాది రాజ్యాంగంలోని 168వ ఆర్టికల్‌ కింద మండలిని ఏర్పాటు చేశారు. ఆనాడు ఉమ్మ‌డి ఆంధ‌ప్ర‌దేశ్ ఉండ‌గా సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగింది. ప‌లు కోణాల నుంచి ఆలోచించిన ఆనాటి సీఎం ఎన్టీఆర్ 1986లో మండ‌లి ని ర‌ద్దు చేసి సంచ‌ల‌నం రేపాడు. దాన్ని పున‌రుద్ధ‌రించ‌డానికి చంద్ర‌బాబు మీద ఒత్తిడి వ‌చ్చింది. పార్టీ సంస్థాగ‌త నిర్ణ‌యాల్లో అధికారంలోకి వ‌స్తే మండ‌లిని పునరుద్దరించాలని తీర్మానించాడు. అయితే, 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆయ‌న కూడా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు మండ‌లిని పున‌రుద్ధ‌రించాడు.ఆనాటి నుంచి మండ‌లి కొన‌సాగుతోంది. 2019లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత మండ‌లిని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఆ మేర‌కు అనుమ‌తి కోసం కేంద్రానికి పంపాడు. మూడు రాజ‌ధానులు, సీఆర్డీయే బిల్లుల‌ను మండ‌లిలో అడ్డుకున్నార‌ని జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేశాడు. ఆనాడు తెలుగుదేశం పార్టీ స‌భ్యులు ఎక్కువ‌గా ఉండ‌డంలో అసెంబ్లీ ఆమోదించిన ఆ బిల్లుల‌ను మండ‌లిలో టీడీపీ అడ్డుకుంది. ఆగ్ర‌హించిన జ‌గ‌న్ ఏకంగా మండ‌లిని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాడు.

Also Read: రియాల్ట‌ర్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఏపీ ప్ర‌భుత్వం…?

ఇప్పుడు మండ‌లిలో స‌భ్యుల సంఖ్య అనూహ్యంగా వైసీపీకి పెరిగింది. అసెంబ్లీలో ఆమోదించిన ప్ర‌తి బిల్లుకూ అక్క‌డ గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తుంది. అందుకే, మండ‌లిని ర‌ద్దు చేస్తూ చేసిన బిల్లును కాద‌ని, కొన‌సాగించాల‌నే తీర్మానం అసెంబ్లీలో ఆమోదించేలా చేశాడు. కేవ‌లం ఏడాదిన్న కాలంలో మండ‌లి ర‌ద్దు, ఆ ర‌ద్దును తొల‌గిస్తూ బిల్లును పెట్టిన ఏకైక సీఎం జ‌గ‌న్‌. మూడు రాజ‌ధానులు, సీఆర్డీయే బిల్లుల విష‌యంలోనూ జ‌గ‌న్ యూట‌ర్న్ తీసుకున్నాడు. అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, తొంద‌ర‌పాటు కార‌ణంగా ఇలాంటి యూట‌ర్న్‌లు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న మండ‌లిని య‌థాత‌దంగా ఉండేలా జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి తొలుత జులై 1, 1958న ఏర్పాటయ్యింది. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌డంతో 1983 వరకూ తిరుగులేకుండా కొన‌సాగింది. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు పెద్ద‌ల సభ నుంచి వెన‌క్క వ‌చ్చేవి. దీంతో ఎన్టీఆర్ మండ‌లి ర‌ద్దును నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు.

మండలిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 30, 1985న ఎన్టీఆర్ హ‌యాంలో అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ఆమోదించింది. జూన్‌1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది. ఇదంతా కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగి పోయింది. మ‌ళ్లీ 1990 నుండి మండలి పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాల‌ను చేసింది.
మండ‌లి పున‌రుద్ధ‌ర‌ణ‌కు శాసనసభలో ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం జనవరి 22, 1990న తీర్మానం చేసింది. ఆ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, అదే స‌మ‌యంలో లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ప‌డిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును గురించి ప‌ట్టించుకోలేదు. 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి .జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో పెట్టి ఆమోదించాడు. డిసెంబర్‌ 15, 2005న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆనాటి నుంచి డిసెంబర్‌ 20, 2005న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది.
జనవరి 10, 2006న ఏపీ శాసన మండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేయ‌డంతో రాజ‌కీయ నిరుద్యోగులు సంబ‌రం చేసుకున్నాడు. మొత్తం మీద ఎన్టీఆర్ 1985లో ర‌ద్దు చేసిన మండలి కార్య‌క‌లాపాలు తిరిగి మార్చి 30, 2007న ప్రారంభం అయ్యాయి. దాన్ని 2019లో ర‌ద్దు చేస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకుంది. మ‌ళ్లీ ర‌ద్దు వ‌ద్దంటూ ఇదే జ‌గ‌న్ స‌ర్కార్ బుధ‌వారంనాడు ఆమోదం తెలిపింది. స్థూలంగా రాజ‌కీయ అనుకూల‌త‌ల ఆధారంగా మండ‌లి భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంద‌ని అర్థం అవుతోంది.