NGT : ఏపీ స‌ర్కార్‌కు ఎన్జీటీ భారీ జ‌రిమానా. కార‌ణం ఇదే..

విజయవాడ: ఎఏపీ ప్ర‌భుత్వానికి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ భారీ జ‌రిమానా విధించింది.

  • Written By:
  • Publish Date - December 3, 2021 / 10:59 AM IST

విజయవాడ: ఎఏపీ ప్ర‌భుత్వానికి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ భారీ జ‌రిమానా విధించింది. రాష్ట్రంలోని నాలుగు నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌కు సంబంధిచి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌కు సంబంధించి నిబంధ‌న‌లను ఉల్లంఘించినందుకు రూ.243 కోట్ల రూపాయ‌ల‌ను జ‌రిమానా విధించింది. మూడు నెలల్లోగా పరిహారం మొత్తాన్ని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. ఆగస్టు 9న విచారణను పూర్తి చేసి ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్జీటీ గురువారం తీర్పుని వెల్ల‌డించింది..

పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదకులు రూ.120 కోట్లు (రూ. 16,010 కోట్లలో 0.75%) పర్యావరణ పరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వుల్లో ఎన్‌జిటి పేర్కొంది. 2010-2011 ధర స్థాయి ప్రకారం రూ.16,010 కోట్ల ప్రాజెక్టు వ్యయం చూపబడింది. పురుషోత్తపట్నం ఎల్‌ఐఎస్‌కు ఈసీ రూ.24.56 కోట్లు చెల్లించాలని ఎన్‌జీటీ ఆదేశించగా… పట్టిసీమ ఎల్‌ఐఎస్‌కు ఈసీ రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎల్‌ఐఎస్‌కు ఈసీ రూ.73.6 కోట్లుగా నిర్ణయించింది.పర్యావరణ పరిహారం మొత్తాన్ని సంబంధిత PPలు మూడు నెలల్లోగా APPCBకి చెల్లించాలి. పర్యావరణం,అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర, ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డ్‌ల అధికారులతో కూడిన పర్యవేక్షణ కమిటీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిధులు వినియోగించ‌బ‌డ‌నున్నాయి.

దీనికి కమిటీని ఒక నెలలోపు ఏర్పాటు చేసి, రెమిడియేషన్ ప్లాన్‌ను APPCB రెండు నెలల్లో అటవీ శాఖతో సంప్రదించి సిద్ధం చేయాల‌ని తెలిపింది. దీనిని ఆరు నెలల్లో అమలు చేయాల‌ని ఎన్జీటీ పేర్కొంది. రాజ‌కీయ విశ్లేష‌కులు పెంట‌పాటి పుల్లారావు, ఏపీకి చెందిన రైతులు,తదితరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ట్రైబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఏకే గోయల్‌, న్యాయ సభ్యులు జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, జస్టిస్‌ బ్రిజేష్‌ సేథీ, సభ్య నిపుణుడు నాగిన్‌ నందాతో కూడిన నలుగురు సభ్యుల ధర్మాసనం 426 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది.

రాజు తప్పు చేయకూడదు అంటే ట్రైబ్యునల్‌ తన తీర్పును ప్రారంభించింది. పురుషోత్తమపట్నం, పట్టిసీమ, చింతలపూడి, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం వేర్వేరు ప్రాజెక్టులని.. వేర్వేరుగా పర్యావరణ అనుమతులు పొందాల్సిందేనని స్పష్టంచేసింది. పర్యావరణ అనుమతులు అక్కర్లేదన్న ప్రభుత్వ వాదనలను ట్రిబ్యున‌ల్‌ తిరస్కరించింది. చట్టబద్ధమైన నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా ధిక్కరించిందని…ఇది తీవ్ర ఆందోళనకరమ‌ని పేర్కొంది. అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు చేపట్టి పర్యావరణ పరిరక్షణ చట్టం(1986), జల చట్టం(1974), 1981నాటి వాయు చట్టాన్ని ఉల్లంఘించిందని.. 10 వేల హెక్టార్లకుపైగా సాగునీరు అందిస్తూ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించడం బాధాకరమ‌ని ట్రిబ్యున‌ల్ పేర్కొంది.