GPS ,OPS in AP : ఏపీలో ప్రభుత్వం ఇస్తామన్న జీపీఎస్.. ఉద్యోగులు కోరుతున్న ఓపీఎస్ లో ఏముంది? ఏది ఎవరికి లాభం?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సీపీఎస్ విషయంలో సమస్యలు తప్పట్లేదు. ఉద్యోగులేమో సీపీఎస్ వద్దంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వెంటనే సీపీఎస్ ను రద్దు చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అది సాధ్యం కాదు అంటోంది.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 10:59 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సీపీఎస్ విషయంలో సమస్యలు తప్పట్లేదు. ఉద్యోగులేమో సీపీఎస్ వద్దంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వెంటనే సీపీఎస్ ను రద్దు చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అది సాధ్యం కాదు అంటోంది. నిజానికి సీపీఎస్ ను అమలు చేస్తే.. తాము నష్టపోతామంటున్నారు ఉద్యోగులు. పాత పింఛను పథకాన్ని అమలు చేస్తే.. తమ నష్టం కదా అంటోంది ప్రభుత్వం. అసలు ఏ పథకంలో ఏముంది? ఎందుకీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఇంత వార్ నడుస్తోంది?

ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ లో ఏముందంటే..
సీపీఎస్ కు బదులుగా జీపీఎస్.. అంటే గ్యారంటీడ్ పింఛను పథకాన్ని అమలు చేస్తామంటోంది ప్రభుత్వం. అందులో ఏముందంటే.. సీపీఎస్ ఉద్యోగి రిటైర్ అయిన తరువాత సుమారు 20.3 శాతం పింఛను వస్తున్నట్టు లెక్కవేసి.. దాన్ని 33 శాతానికి పెంచి ఇస్తామంటోంది ప్రభుత్వం. ఇందులో ఉద్యోగి కూడా తన వాటా చందాను చెల్లించాలి. ఇంకా డీఏను పెంచుతారా, పీఆర్సీని వర్తింపజేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఆరోగ్య కార్డులపైన, అదనపు క్వాంటం పింఛనుపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గ్రాట్యుటీపైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. కమ్యుటేషన్ ఉండదని, పీఎఫ్ ఖాతా ఉండదని కూడా తేల్చేశారు. అందుకే జీపీఎస్ విషయంలో ఉద్యోగుల్లో అంసతృప్తి ఉంది.

ఉద్యోగులు కోరుతున్న పాత పింఛను పథకం ఓపీఎస్ లో ఏముందంటే…
ఏ ఉద్యోగి అయినా సర్వీసులో ఉన్నంతకాలం ఏ సమస్యా ఉండదు. కానీ రిటైర్ అయిన తరువాత వృద్దాప్యంలో ఆర్థిక భద్రతను కోరుకుంటాడు. అందుకే రిటైర్ అయిన తరువాత ఓపీఎస్ లో పింఛను ఉంటుంది. ఆ పెన్షన్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. పైగా ఈ పెన్షన్ కోసం ఉద్యోగి తను ఉద్యోగం చేస్తున్నంత కాలం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఉద్యోగులు దీన్ని కోరుకుంటున్నారు.
పైగా ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరిగితే అప్పుడు దానికి అనుగుణంగా ప్రభుత్వం డీఏను పెంచుతుంది. పీఆర్సీని బట్టి పెన్షన్ కూడా పెరుగుతుంది. దీంతోపాటు 70 ఏళ్లు దాటిన వారికి అదనపు క్వాంటం పెన్షన్ ను ఇస్తుంది. హెల్త్ కార్డులను మంజూరు చేసి దాని ద్వారా వైద్యాన్నీ అందిస్తుంది. ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా కూడా ఉంటుంది. గ్రాట్యుటీని కూడా అమలు చేస్తారు. కమ్యుటేషన్ కూడా ఉంటుంది.

సీపీఎస్ లో ఇలాంటివి ఏవీ ఉండవు. అందుకే ప్రభుత్వం దీనిని అమలు చేస్తామంటోంది. అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేసరికీ జీపీఎస్ ను ప్రతిపాదించింది. కానీ ఉద్యోగులు మాత్రం తమకు ఓపీఎస్ మాత్రమే కావాలంటున్నారు. దీనికి పరిష్కారం ఎప్పటికి లభిస్తుందో చూడాలి.