Tainted Officers : ‘అయ్యా..ఎస్’ల‌ జైలు బాస్ లు!

స్వ‌ర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు మంత్రులు, ఐఏఎస్ లు జైలు పాల‌య్యారు. వివిధ కేసుల్లో శిక్ష‌ను అనుభ‌వించారు.

  • Written By:
  • Publish Date - March 31, 2022 / 02:57 PM IST

స్వ‌ర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు మంత్రులు, ఐఏఎస్ లు జైలు పాల‌య్యారు. వివిధ కేసుల్లో శిక్ష‌ను అనుభ‌వించారు. ఓబులాపురం మైనింగ్ , హిందూ ప్రాజెక్టు త‌దిత‌రాల్లో ఇచ్చిన‌ అనుమతుల్లో జ‌రిగిన‌ అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా సీనియ‌ర్ ఐఏఎస్ లు జైలు జీవితం గ‌డిపారు. నిందితులుగా సీబీఐ ఎదుట ఇప్ప‌టికే ర‌త్న‌ప్ర‌భ‌, శ్యామ్యూల్ త‌దిత‌ర సీనియ‌ర్ ఐఏఎస్ లు ఇప్ప‌టికే చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డుతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో ఐఏఎస్ , ఐపీఎస్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాదు, జైలు శిక్ష‌లు వేయించుకుంటున్నారు. భేష‌ర‌తుగా హైకోర్టును క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు.
ఫైల్ మూమెంట్ అంతా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల సంత‌కాల‌తో ఉంటుంది. కేవ‌లం మౌఖిక ఆదేశాల వ‌ర‌కు మంత్రులు చాలా ఇష్యూల్లో ప‌రిమితం అవుతారు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ ఇద్ద‌రూ వాళ్లు అనుకున్న విధంగా ఫైల్ ను న‌డ‌పాల‌ని ఆదేశిస్తారని టాక్‌. ఆ మేర‌కు ఫైళ్ల‌ను న‌డిపే సివిల్ స‌ర్వెంట్లకు మాత్ర‌మే ప్రాధాన్య‌తా క్ర‌మంలోని పోస్ట్ ల్లో ఉంటారు. లేదంటే, వెంట‌నే బ‌దిలీ చేస్తార‌ని స‌చివాల‌య వ‌ర్గాల్లో వినికిడి. ఆ కోణంలోనే డీజీపీగా ఉన్న గౌత‌మ్ స‌వాంగ్ కు ఆక‌స్మాత్తుగా బ‌దిలీ బ‌హుమ‌తి ల‌భించింది. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం విష‌యంలోనూ అదే జ‌రిగింది. మ‌రో మాజీ సీఎస్ నీలంసాహ్ని కూడా లాంగ్ లీవ్ పై వెళ్ల‌డానికి ఒకానొక స‌మ‌యంలో ప్ర‌య‌త్నించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక అత్యంత స‌న్నిహితంగా ఉండే సీఎంవో రాజ‌కీయ విభాగం ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ ప్ర‌కాష్ బ‌దిలీ కూడా అదే కోవ‌లోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఫ‌లితంగా ఐఏఎస్, ఐపీఎస్ లకు జైలు శిక్ష‌లు ప‌డ‌డం అనివార్యంగా మారింది.

తాజాగా ఎనిమిది మంది ఐఏఎస్ ల‌కు జైలు శిక్షను విధిస్తూ ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్వ‌హించ‌డాని లేద‌ని హైకోర్టు ఇచ్చిన ఉత్వ‌ర్వుల‌ను ధిక్క‌రించ‌డ‌మే ఆ సంచ‌ట‌న తీర్పుకు కార‌ణం. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌చివాల‌యాల‌ను తొలగించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. సంబంధిత ఐఏఎస్ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సదరు ఐఏఎస్ అధికారులు ఆ ఉత్త‌ర్వుల‌ను అమలు చేయ‌లేదు. దీంతో ఏపీ హైకోర్టు ఆగ్రహించింది. హైకోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం చేసిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల‌కు జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలు శిక్ష విధించింది. వెంట‌నే వాళ్లు హైకోర్టును వీరు క్షమాపణలు కోరారు.
క్ష‌మాప‌ణల‌తో శాంతించిన హైకోర్టు జైలు శిక్ష నుంచి విముక్తిని కలిగించింది. ప్ర‌త్యామ్నాయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఉత్త‌ర్వులు జారీ చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు నెలలో ఒకరోజు సేవ చేయాలని ఆర్డ‌ర్ చేసింది. జైలు శిక్ష ప‌డిన ఐఏఎస్ అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మి ఉన్నారు.

2021 సెప్టెంబర్ లో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష వేసింది. నాలుగు వారాల పాటు జైలు శిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు జరిమానా కూడా విధించిన విష‌యం విదిత‌మే. నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ గా తీసుకుని సదరు మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు అదేశించింది. కానీ, ప‌రిహారం చెల్లింపులు చేయ‌డంలో జ‌రిగిన జాప్యం కార‌ణంగా IAS అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్ కు నెల రోజులపాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు రెండు వారాలపాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా పడింది. ఎస్ఎస్.రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 ఫైన్ విధించారు. ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, రూ.1000 ఫైన్ పడింది. మరొక ఐఏఎస్ కు జైలు శిక్ష విధించింది. అయితే శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట చేతులు క‌ట్టుకుని నిల్చున్నారు. ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న‌ నీలం సాహ్ని హైకోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ అంశానికి తమ వివరణ ఇచ్చారు. నీలం సాహ్నితో పాటు.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ కూడా అప్ప‌ట్లో కోర్టుకు హాజరయ్యారు. తొలిసారిగా ఏపీ సీఎస్ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. కోర్ట్ ఆదేశాలు బేఖాతరు చేశారని భావించిన న్యాయస్థానం… కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీంతో ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజర‌వ్వాల్సి వ‌చ్చింది.

మూడు రంగుల విష‌యంలో ఐఏఎస్ లు హైకోర్టు ఎదుట హాజ‌రై క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ప్ప‌టికీ నీలం, తెలుపు, ఆకుపచ్చకు తోడుగా ఎర్రమట్టి రంగును చేర్చుతూ మ‌రో జీవో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్క‌డ కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏదైనా అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ కేసులో మాజీ సీఎస్ నీలం సాహ్ని హైకోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరిగిందో చూశాం.ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. చేతకాకపోతే తప్పుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమైన కేసులో స‌వాగ్ కు కోర్టు చివాట్లు పెట్టింది.గతంలో మూడుసార్లు జ్యుడీషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పలుసార్లు కోర్టుకి పిలిపించినా మార్పు రాలేదని ఆనాడున్న ఏపీ డీజీపీని హైకోర్టు మంద‌లించింది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని కోర్టు అంది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ పదవికి రాజీనామా చేయాలంది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు చుర‌క‌లు వేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌ సహా ఏ అధికారులైనా.. చట్టం కంటే తాము ఎక్కువని భావించొద్దన్నారు. ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. పలు సందర్భాల్లో కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని.. బాధితులకు న్యాయం చేయడం, వారి ప్రాథమిక హక్కులు కాపాడటం కోసమే కోర్టులున్నాయని వ్యాఖ్యానించిన విష‌యం విదిత‌మే.

కోర్టు ఉత్తర్వుల అమలులో కిందిస్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా డీజీపీని మళ్లీ మళ్లీ కోర్టుకు పిలిచింది. ఎస్సైగా పనిచేస్తున్న ఓ అధికారికి కోర్టు ఆదేశాల మేరకు సీఐగా పదోన్నతి కల్పించినప్పటికీ.. తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేయడంలో ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘన, నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఉత్తర్వుల అమల్లో ఆలస్యానికి కారణాలపై వివరణ ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఐజీ లడ్హా‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావులను అప్ప‌ట్లో ఆదేశించిన విష‌యం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వర్సెస్ న్యాయస్థానాలు అన్నట్టు పరిస్థితి మారింది. చాలా తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఎక్కువ తీర్పుల్లో రాష్ట్రంలో ఉన్నతాధికారుల తీరుపైనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇటీవల ఏపీ రాజధాని అమరావతే అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ సంబంధింత అధికారులు జారీ చేసిన జీవోల‌ను త‌ప్పుబ‌ట్టింది.స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో జైలు జీవితం గ‌డిపిన ఐఏఎస్ లు ఇప్పుడు ఆచితూచి అడుగు వేస్తున్నారు. ప్ర‌స్తుతం స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా ఉన్న శ్రీల‌క్ష్మి మిన‌హా మిగిలిన వాళ్లు చాలా మంది జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ జైలు శిక్ష‌లు ప‌డుతున్నాయి. కానీ, జైలు వ‌ర‌కు వెళ్ల‌కుండా క్ష‌మాప‌ణ‌ల‌తో నెట్టుకొస్తున్నారు. కానీ, మ‌రింత దూకుడుగా న్యాయ‌స్థానాలు వెళితే, ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి టైంలో జైలుకు వెళ్లిన మాదిరిగా జ‌గ‌న్ హ‌యాంలోనూ జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని సివిల్ స‌ర్వెంట్ల‌లోని టాక్‌. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ స‌ర్కార్ పున‌రాలోచ‌న చేస్తుందా? లేక న్యాయ‌స్థానాల తీర్పుల‌పై దూకుడుగా వెళుతుందా? అనేది హాట్ టాపిక్‌. ప్ర‌భుత్వ విధానాల‌కు, న్యాయ‌స్థానాల తీర్పుల మ‌ధ్య సివిల్ స‌ర్వెంట్లు న‌లిగిపోతున్నారు. ఫైల్ మూమెంట్ విష‌యంలో ఎప్ప‌టికైనా న్యాయ‌స్థానాల‌కు దొరిగేది ఐఏఎస్, ఐపీఎస్ లు మాత్ర‌మే. అధికారం ఉన్నా లేక‌పోయిన‌ప్ప‌టికీ రాజ‌కీయ నాయ‌కులు న్యాయ‌స్థానాల‌కు రాత‌పూర్వ‌కంగా చాలా వ‌ర‌కు దొర‌క‌రు. సో..బీ కేర్ ఫుల్ `అయ్యా..ఎస్ లు`.!