CM Jagan: కొత్త మంత్రివర్గం కోసం జగన్ ఆ హిట్ ఫార్ములా ప్రయోగించబోతున్నారా?

ఏపీ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రుల మార్పు ఉంటుందని ప్రమాణ స్వీకారం సందర్భంగానే జగన్ స్పష్టం చేశారు. కానీ రెండున్నర ఏళ్లు గడిచిపోవడంతో విస్తరణ ఉంటుందా? ఉండదా అంటూ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

  • Written By:
  • Updated On - March 27, 2022 / 11:45 AM IST

ఏపీ మంత్రివర్గ విస్తరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రుల మార్పు ఉంటుందని ప్రమాణ స్వీకారం సందర్భంగానే జగన్ స్పష్టం చేశారు. కానీ రెండున్నర ఏళ్లు గడిచిపోవడంతో విస్తరణ ఉంటుందా? ఉండదా అంటూ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. దీనికి ప్రధాన కారణం కరోనానే అనే వాదన ఉంది. అయితే ఎట్టకేలకు వారి టెన్షన్ ను దూరం చేస్తూ మంత్రి వర్గ విస్తరణకు జగన్ ఓకే చెప్పారట. అన్నీ కుదిరితే వచ్చే నెల 11నే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణ అనగానే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో గుబులు మొదలైంది. పూర్తిగా తొలగించి కొత్తవారిని నియమిస్తారా? లేక కొందరిని కొనసాగించి మిగతా పదవులను కొత్తవారితో భర్తీ చేస్తారా? కొనసాగిస్తే ఆ అవకాశం ఎవరికి దక్కుతుంది? అంటూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇంతకీ జగన్ కొత్త క్యాబినెట్ ఎలా ఉండబోతుంది? ఏయే వర్గాలకు పెద్ద పీట వేస్తారు? ఇలాంటి ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈసారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దీని వెనుక జగన్ వ్యూహం వేరే ఉందంటారు వారు. వ్యూహకర్తలతో నిర్వహించిన సర్వేల్లో ఈ వర్గాల్లో 8 శాతం ఓటర్లు వైసీపీకి దూరమయ్యారట. ఏం చేసినాసరే వారిని తమవైపునకు తిప్పుకునే ఛాన్స్ లేదని వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని టాక్. ఇది ఇలాగే కొనసాగితే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మైనస్ అవుతుంది. అందుకే ఆ వర్గాలను ఆకట్టుకోడానికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ తర్వాత సీఎం జగన్ జిల్లాల పర్యటన చేపడతారని తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పే అవకాశం ఉంది. దీనివల్ల ఆయా వర్గాలను తమ పార్టీవైపునకు తిప్పుకోవాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం నుంచి 90 శాతం మంత్రులనే తొలగిస్తారని సమాచారం. మిగతా 10 శాతం పాత మంత్రులనే కొనసాగించక తప్పని పరిస్థితి. మరి కొత్తవారికి 90 శాతం పదవులిస్తే… పాతవారు ఎవరు కొనసాగుతారు? కొనసాగిస్తారనుకునే మంత్రుల్లో కొందరు సీనియర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి వారిని కొనసాగించే అవకాశం ఉంది. సీనియర్ అయిన బొత్సాను కొనసాగించాల్సిన పరిస్థితి ఉందట. ఎందుకంటే పాలనా పరమైన వ్యవహారాలు, ఇతరత్రా అంశాల్లో బొత్సాకు మంచి పట్టు ఉండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు బొత్సాకు ప్రాంతీయ మండళ్ల బాధ్యతను అప్పగిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది.

మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తొలగించడం సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆయనను కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక మూడేళ్లుగా ఆర్థిక మంత్రిగా అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నా సరే రాష్ట్రానికి అప్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న బుగ్గనను కూడా తొలగించకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు బంధుత్వం కారణంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, అటు సామాజికవర్గ సమీకరణాలు, సన్నిహితత్వం కారణంగా కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిని కూడా కొనసాగించక తప్పని పరిస్థితి ఎదురుకావచ్చు. మరోవైపు వీరందరినీ కొనసాగించి… మిగతా 90 శాతం మంత్రులను తొలగిస్తే కొత్త తలనొప్పులు రావచ్చనే ప్రచారం జరుగుతోంది. తమను జగన్ చిన్న చూపు చూశారని వారంతా భావిస్తే అది పార్టీకి నష్టం కలిగే ప్రమాదం కూడా లేకపోలేదంటారు విశ్లేషకులు.

మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలు కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత మంత్రి వర్గంలో తమ సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత లభించలేదని రెడ్డి సామాజికవర్గం గుర్రుగా ఉంది. అయితే కొత్త మంత్రివర్గంలోనైనా తమకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని రెడ్డి సామాజికవర్గం బోలేడు ఆశలు పెట్టుకుందట. కానీ ఈ సామాజికవర్గానికి కొత్త మంత్రి మండలిలో జగన్ తగిన ప్రాధాన్యత కల్పించకపోతే ఓసీల నుంచి తీవ్ర ఆగ్రహానికి గురికావల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు. ఇక మిగతా అగ్రకులాలైన కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిణమాలన్నీ సీఎం ఎలా సమన్వయం చేస్తారు అనేదే కీలకం. అసెంబ్లీ స్పీకర్ తోపాటు చీఫ్ విప్, విప్ లను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. అయితే మార్పులో భాగంగా ఎస్టీ సామాజికవర్గానికి స్పీకర్ పదవి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఓసీ సామాజికవర్గానికి కేటాయించే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత మండలి ఛైర్మన్ పదవి ఎస్సీ సామాజికవర్గానికి ఇచ్చారు. డిప్యూటీ ఛైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక విప్, చీఫ్ విప్ పదవులను ఓసీ వర్గానికి ఇచ్చి… మిగిలిన మంత్రిపదవుల్లో చాలావరకు బీసీలకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అత్యంత కీలకమైన హోం శాఖను బీసీ వర్గానికి కేటాయించాలనే వ్యూహంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా బీసీ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని జగన్ ప్లాన్ రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హోం శాఖను ఎస్సీ మహిళకు కేటాయించారు. మొత్తంగా మంత్రివర్గ కూర్పునకు సంబంధించిన ప్లాన్ ఇప్పటికే రెడీ అయినట్లు సమాచారం.

వైసీపీకి ప్రస్తుతం 150 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 50 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో బయటపడిందట. వారంతా వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్సేలేదని వ్యూహకర్తలు తేల్చిచెప్పినట్లు సమాచారం. అంతేకాదు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపాలని… అందుకోసం ఇప్పటి నుంచే గెలుపు గుర్రాలపై దృష్టిపెట్టాలని వ్యూహకర్తలు జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత వైసీపీ అధిష్ఠానం గెలుపు గుర్రాల కోసం వేట సాగించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు.