Family Pension : మహిళా ఉద్యోగి పిల్లలను కూడా నామినేట్ చేయొచ్చు

Family Pension :  ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛనుదారులు తమ మరణానంతరం కుటుంబ పింఛన్‌ కోసం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇప్పటిదాకా ఉండేది.

  • Written By:
  • Updated On - January 30, 2024 / 07:31 AM IST

Family Pension :  ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛనుదారులు తమ మరణానంతరం కుటుంబ పింఛన్‌ కోసం భర్తను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఇప్పటిదాకా ఉండేది. ఇకపై భర్తను కాకుండా కుమారుడికో.. కుమార్తెకో.. కుటుంబ పింఛను చెందేలా నామినేట్‌ చేయొచ్చు.  ఈమేరకు 2021నాటి కేంద్ర పౌర సర్వీసుల (కుటుంబ పింఛన్‌) నిబంధనలలో కేంద్ర పింఛన్‌, పింఛనుదారుల సంక్షేమ విభాగం సవరణలు చేసింది.  తన మరణానంతరం భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్‌ను చెల్లించాలంటే, మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది. ఆమె తదనంతరం అది అమలులోకి వస్తుంది. పిల్లలు లేని సందర్భాలలో భర్తకే పింఛన్‌ అందుతుంది. కుమార్తె లేక కుమారుడు మైనర్‌ అయినా, మానసిక వైకల్యంతో బాధపడుతున్నా వారి సంరక్షకుడైన తండ్రి (భర్త)కి పింఛన్‌ చెల్లిస్తారు. సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్‌ అయిన తరవాత వారికే పింఛన్‌ లభిస్తుంది. మహిళా పింఛన్‌దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నా, పిల్లలు మేజర్‌  అయితే వారికే పింఛన్‌(Family Pension) అందుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు మహిళా ఉద్యోగి లేదా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛన్‌ను ఆమె భర్తకు.. భర్త మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించే వారు. మహిళా  ఉద్యోగి నేరుగా తన పిల్లలను కుటుంబ పింఛను కోసం నామినేట్ చేసే అవకాశాన్ని కల్పించే కొత్త నిబంధన అనేది సామాజిక, ఆర్థిక కోణాల్లో పెను మార్పులు తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు. మహిళలకు సమాన హక్కులను కల్పించేందుకు ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహ హింస నిరోధ చట్టం, వరకట్న నిషేధ చట్టం, భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద కేసులు దాఖలైన సందర్భాలలోనూ పింఛను చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని ఆయన చెప్పారు.

Also Read : Mango Leaves: షుగర్ అదుపులోకి రావాలి అంటే మామిడి ఆకులతో ఇలా చేయాల్సిందే?

ఆ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం అమల్లోకి

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులపెన్షన్ విధానం వివాదాస్పదంగా మారింది. పాత పెన్షన్ విధానం తొలగించి కొత్త విధానం ప్రవేశపెట్టడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తిరిగి పాత విధానాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో  పాత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు వారి సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు తాను వారికి హామీ ఇచ్చానని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చానని సోషల్ మీడియాలో స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 13 వేలమంది NPS ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. పాత పెన్షన్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ తరువాత పెన్షన్ లభిస్తుంటుంది. ఆ ఉద్యోగి గతంలో తీసుకున్న జీతంలో సగం పెన్షన్‌గా వస్తుంటుంది. అదే కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగి జీతంలో కొంతమొత్తం పెన్షన్ నిధికి జమ అవుతుంది. రిటైర్మెంట్ తరువాత ఒకేసారి తగిన మొత్తం చేతికి అందుతుంది.