Julian Assange : ‘వికీలీక్స్’ అసాంజేకు విముక్తి.. 1901 రోజుల తర్వాత జైలు నుంచి స్వేచ్ఛ

యూకేలో 62 నెలల జైలుశిక్షను అనుభవించిన తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు 52 ఏళ్ల జూలియన్ అసాంజే‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. 

  • Written By:
  • Updated On - June 25, 2024 / 09:00 AM IST

Julian Assange : యూకేలో 62 నెలల జైలుశిక్షను అనుభవించిన తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు 52 ఏళ్ల జూలియన్ అసాంజే‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.  బ్రిటన్‌లోని హై సెక్యూరిటీ జైలు ‘బెల్మార్ష్’ నుంచి అసాంజేను విడుదల చేశారు. అదనపు జైలు శిక్ష విధించకూడదన్న తన షరతుకు అమెరికా న్యాయశాఖ సమ్మతి తెలపడంతో.. ఆ దేశ రహస్య పత్రాలను లీక్ చేసి గూఢచర్య చట్టాలను ఉల్లంఘించినట్లుగా అసాంజే అంగీకరించాడు. బ్రిటన్‌లోని హై సెక్యూరిటీ జైలు ‘బెల్మార్ష్’  వేదికగా ఆయన తన నేరాన్ని ఒప్పుకున్నారు. అమెరికా ప్రభుత్వ గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించానని అసాంజే చెప్పాడు. ఆ వెంటనే లండన్‌లోని హైకోర్టు  ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎట్టకేలకు 1901 రోజుల నిర్బంధం తర్వాత  బ్రిటన్ సర్కారు జూలియన్ అసాంజేను జైలు నుంచి రిలీజ్ చేసింది. జైలు నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన ఆయన.. కారులో నేరుగా స్టాన్‌స్టెడ్ విమానాశ్రయానికి బయలుదేరారు.  బ్రిటన్ నుంచి అసాంజే నేరుగా అమెరికాకు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆయన  అమెరికాలోని సైపాన్‌లో ఉన్న ఓ కోర్టు ఎదుట విచారణకు హాజరై, తాను నేరాలను అంగీకరించిన విషయాన్ని చెప్పనున్నారు. తదుపరిగా కోర్టు అనుమతితో అక్కడి నుంచి తన స్వదేశం ఆస్ట్రేలియాకు అసాంజే చేరుకుంటారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

జూలియన్ అసాంజే జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో వికీలీక్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆయనకు ఎట్టకేలకు జైలు నుంచి విముక్తి లభించింది అని ఆ పోస్టులో రాసుకొచ్చింది. అసాంజే భార్య స్టెల్లా కూడా ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.  అసాంజే విడుదలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. 2006లో వికీలీక్స్‌ను అసాంజే ప్రారంభించారు. ప్రజలు వాళ్ల సమాచారం చెప్పకుండానే కీలక డాక్యుమెంట్‌లు, వీడియోలను సమర్పించే ఆన్‌లైన్ వేదికగా వికీలీక్ మారడం అప్పట్లో పెనుసంచలనం క్రియేట్ చేసింది. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ నుంచి జరిపిన  దాడిలో ఇద్దరు జర్నలిస్టులతో సహా డజను మంది చనిపోయిన ఫొటోలు లీక్ కావడంతో అప్పట్లో వికీలీక్ పేరు అంతటా మార్మోగింది. 2010లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లలో జరిగిన యుద్ధాలకు సంబంధించిన వందలాది అమెరికా ప్రభుత్వ రహస్య  డాక్యుమెంట్‌లను కూడా వికీలీక్స్ బయటపెట్టింది.

Also Read :Hyderabad: రాత్రి 11 గంటల తర్వాత బయటకు వెళ్తున్నారా..!

అసలు ఏమిటీ వ్యవహారం ?

  • లైంగిక వేధింపుల కేసులో స్వీడన్ ప్రభుత్వం జారీ చేసిన వారెంట్‌పై అసాంజే‌ను 2010 నవంబరులో తొలిసారిగా లండన్‌లో అరెస్టు చేశారు. అయితే ఆయనకు వెంటనే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. బ్రిటన్‌లోనే ఉండాలని కోర్టు నిర్దేశించింది.
  • ఈక్రమంలో 2011 ఫిబ్రవరిలో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  అసాంజేను స్వీడన్ ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
  • దీంతో ఏం చేయాలో అర్థంకాక అసాంజే 2012 సంవత్సరంలో లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందారు.
  • 2019 సంవత్సరంలో స్వీడన్ దేశం లండన్ కోర్టు నుంచి తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఈక్వెడార్ ఎంబసీలో ఉండగా అసాంజేపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
  • 2012 నుంచి 2019 సంవత్సరం వరకు లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలోనే అసాంజే గడిపారు.
  • 2019 ఏప్రిల్‌లో అసాంజేను వెళ్లిపోవాలని  ఈక్వెడార్ ఎంబసీ ఆదేశించింది. దీంతో ఆయన బయటికి వెళ్లగానే లండన్ పోలీసులు అరెస్టు చేశారు.  బెయిల్ షరతులు ఉల్లంఘించినందుకు కోర్టు అసాంజేకు 50 వారాల జైలుశిక్ష విధించింది.  నాటి నుంచి బ్రిటన్ జైలులోనే ఆయన ఉంటూ వచ్చారు.
  • మరోవైపు తమ దేశ రహస్యాలను లీక్ చేసిన అసాంజేను అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వం కూడా బ్రిటన్ కోర్టుల్లో సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది.
  • 2020 నుంచి 2024 వరకు జరిగిన అమెరికా న్యాయపోరాటం ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 26న ఫలించింది. అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అంగీకారం తెలిపింది. మరణశిక్ష విధించబోం అనే షరతుపై అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు న్యాయస్థానం ఓకే చెప్పింది.
  • ప్రభుత్వ గూఢచర్య చట్టాలను ఉల్లంఘించినట్లు అంగీకరించిన అసాంజే..  బ్రిటన్‌లో తాను అనుభవించిన జైలుశిక్షను పరిగణనలోకి తీసుకొని మళ్లీ జైలు శిక్ష విధించరాదని అమెరికాను కోరారు. ఈ అంశంపై బ్రిటన్ కోర్టు ద్వారా అమెరికా న్యాయశాఖ సమ్మతి తెలిపింది. అందువల్లే ఇప్పుడు అసాంజే.. అమెరికా కోర్టు ఎదుట హాజరయ్యేందుకు బయలుదేరారు. కోర్టు ఎదుట హాజరై నేరాన్ని ఒప్పుకొని.. అక్కడి నుంచి తన స్వదేశం ఆస్ట్రేలియాకు అసాంజే వెళ్లిపోతారు.

Also Read : T20 World Cup: ఇదేం ఖర్మరా నాయనా బంగ్లా చేతిలో ఆసీస్ సెమీస్ బెర్త్