Fast Tag : హైవేల్లో `ఫాస్టాగ్‌` టోల్ గేట్ల క్లోజ్

హైవేల‌పై ప్ర‌స్తుతం అమ‌లు చేస్తోన్న ఫాస్టాగ్ కు త్వ‌ర‌లోనే కేంద్రం స్వ‌స్తి ప‌ల‌క‌నుంది. ఆధునిక సాంకేతిక‌త‌ను జోడించ‌డం ద్వారా ప్ర‌యాణించిన దూరానికి మాత్ర‌మే టోల్ టాక్స్ వ‌సూలు చేయ‌నుంది.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 04:19 PM IST

హైవేల‌పై ప్ర‌స్తుతం అమ‌లు చేస్తోన్న ఫాస్టాగ్ కు త్వ‌ర‌లోనే కేంద్రం స్వ‌స్తి ప‌ల‌క‌నుంది. ఆధునిక సాంకేతిక‌త‌ను జోడించ‌డం ద్వారా ప్ర‌యాణించిన దూరానికి మాత్ర‌మే టోల్ టాక్స్ వ‌సూలు చేయ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టోల్ గేట్ కేంద్రంలో నిర్ణ‌యించిన ధ‌ర ప్ర‌కారం టాక్స్ క‌డుతున్నారు. రాబోవు రోజుల్లో ప్ర‌యాణించే దూరాన్ని లెక్కించి, అందుకు అనుగుణంగా టోల్ టాక్స్ ను వ‌సూలు చేయ‌నున్నారు. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో జీఎన్ఎస్ఎస్ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా ట్రాకింగ్ చేసి పన్ను చెల్లించే పద్ధతి అమల్లో ఉంది. జర్మనీలో 98.8 శాతం వాహనాలు ఈ వ్యవస్థ పరిధిలోనే ఉన్నాయి. దీని ప్రకారం టోల్ రోడ్డు పైకి వాహనం రాగానే ప్రయాణ టైమ్ లైన్ ప్రారంభమవుతుంది. ఆ వాహనం టోల్ రోడ్డు నుంచి దిగాక టైమ్ లైన్ పూర్తవుతుంది. వాహ‌నం ప్రయాణించిన కి.మీల లెక్కన బ్యాంకు ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఈ విధానం ద్వారా అటు ప్రయాణికుడికి భారం తగ్గి ఇటు ప్రభుత్వానికి డబ్బులు నేరుగా జమ కావడం జ‌రుగుతుంది.

నేష‌న‌ల్ హైవేల‌పై ట్రాఫిక్ ను నివారించ‌డానికి టోల్ గేట్ ల వద్ద కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్ ను విధిగా అమ‌లు చేస్తోంది. టోల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా చేయ‌డానికి ఫాస్టాగ్ ను బ‌ల‌వంతంగా వాహ‌నదారుల‌పై రుద్దింది.ఫాస్టాగ్ కోసం ప్రతీ వాహనంపై ఒక కోడ్ ను ముద్రించిన స్టిక్కర్ అంటిస్తారు. డిజిట‌ల్ కోడ్ ఆధారంగా వాహనం ఎక్కడికి వెళ్లినా నిఘా ఉంచడానికి వీలుంది. ఫాస్టాగ్ వల్ల స్మగ్లర్ల కదలికలను సులభంగా ట్రాక్ చేయ‌డానికి అవ‌కాశం ఉంది. అలాగే అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయవచ్చు. వాహనాల నంబర్ ప్లేట్ , కార్ల రంగును మార్చినా కూడా ఫాస్టాగ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ వాహనాన్ని గుర్తించ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. వాహనాలను ట్రాక్ చేయడానికి, నేరస్థులను పట్టుకోవడానికి పోలీసుల‌కు ఈ కోడ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. నకిలీ బీమా క్లెయిమ్లు కూడా తొలగించబడతాయి. ఫాస్టాగ్ రికార్డింగ్ల ఆధారంగా వాహనం వెళ్ళిన ప్రదేశాలను గుర్తించవచ్చు. దాన్ని ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

ఫాస్టాగ్ తో ట్రాఫిక్ సమస్యలకే కాదు, నేరస్థులు-స్మగ్లర్ల ఆటకట్టించడం, బీమా కట్టించుకోవడం ఇత‌ర‌త్రా మోసాలు అరికట్టడం కోసం కేంద్రం ఫాస్టాగ్ ను బ్రహ్మాస్త్రంగా ఉప‌యోగించింది. ఫ‌లితంగా ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రబలంగా ఉన్న తమిళనాడులో ఫాస్టాగ్ వల్ల చాలా మేలు జ‌రిగింది. తమిళనాడులోని శివగంగలో పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడిన అనుమానాస్పద వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను టోల్ నిర్వ‌హ‌కుల‌కు ఇచ్చారు. ఆ వాహనాలను గుర్తించడానికి జాతీయ రహదారి అధికారుల సహాయం తీసుకున్నారు. బీమా చెల్లింపుల ఎగవేత కూడా ఫాస్టాగ్ తో పట్టుకోవచ్చని అధికారులు అంటున్నారు. అయితే, దీనికి మ‌రింత మెరుగైన సాంకేతిక‌త‌ను జోడించాల‌ని కేంద్రం భావిస్తోంది.

జీపీఎస్ ఆధారంగా పనిచేసే జీఎన్ఎస్ఎస్ లో వాహనదారుడు టోల్ రోడ్ పై ప్రయాణించే దూరానికే టోల్ ట్యాక్స్ చెల్లించేలా నిబంధంనలు మారుస్తోంది. ఉగ్రహాగాల ద్వారా జీపీఎస్ ను అంచనావేసి ప్రయాణించిన దూరం వరకే పన్ను చెల్లించేలా కొత్త సవరణ రాబోతుంది. ప్ర‌యాణించే దూరాన్ని జీపీఎస్ లెక్కించిన ఆధారంగా(ప్ర‌స్తుతం ఓలా, ఊబ‌ర్ వాహ‌నాల చార్జిల మాదిరిగా) ట్యాక్స్ ను క‌ట్టేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. గతనెల 18న కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని పార్లమెంట్ లో వెల్ల‌డించారు. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద సంబంధిత నిర్వహణ సంస్థ టోల్ రోడ్ ప్రారంభం నుంచి ముగింపు దాకా కిలోమీటర్లను లెక్కగట్టి ట్యాక్స్ ను వసూలు చేస్తోంది. అంటే వాహనదారుడు టోల్ రోడ్ ను 10 కి.మీలు వాడుకున్నా మొత్తం ట్యాక్స్ ను చెల్లిస్తున్నారు. ఈ పద్ధతితో వినియోగదారుడు నష్టపోతున్నాడు. అందుకే కేంద్రం జీపీఎస్ ఆధారంగా ప‌నిచేసే జీఎన్ఎస్ఎస్ ప‌ద్ద‌తిని అమ‌లులోకి తీసుకురావ‌డానికి కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆ ప్ర‌క్రియ పూర్తయితే, ఇక నేష‌న‌ల్ హైవేల‌పై టోల్ ప్లాజాలు ఉండ‌వ‌న్న‌మాట‌.