Pakistan Floods : “మొహంజోదారో” వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితా నుంచి ఔట్ అవుతుందా? ఎందుకు?

భారీ వర్షాలకు పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న మొహంజోదారో ప్రాంతానికి జలగండం ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 10:08 PM IST

భారీ వర్షాలకు పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న మొహంజోదారో ప్రాంతానికి జలగండం ఏర్పడింది. అక్కడ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మరోమారు ఈ ప్రాచీన చరిత్ర నీట కొట్టుకుపొయే ప్రమాదం ఏర్పడిందని ఇక్కడి యునెస్కో అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి. ఇటువంటి తరుణంలో వరదల రూపంలో మొహంజోదారో ఉనికిని తుడిచిపెట్టే గండం చుట్టుముట్టడం ఆందోళనకరం.

ఈనేపథ్యంలో ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్) జాబితా నుంచి మొహంజోదారో పేరును తొలగించే ముప్పు ఉందని తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్కియాలజీ విభాగం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొహంజోదారో రక్షణ, పునరుద్ధరణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే దాని ఉనికి గల్లంతయ్యే ముప్పు ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటికే మొహంజోదారో సందర్శనకు పర్యాటకులను అనుమతించడం లేదు. మరోవైపు ఈనెల 11న ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ యంటోనియో గుతెరెస్ పాక్ లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన మొహంజోదారో ను విజిట్ చేసే ఛాన్స్ ఉంది. వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపును నిలుపుకునేందుకు మొహంజోదారోను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని యంటోనియో గుతెరెస్ గుర్తు చేయనున్నారు.

167 దేశాల్లో 1100 సైట్స్..

ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో 1100 యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అయితే గతేడాది “లివర్ పూర్ మ్యారీ టైం మెర్కన్టైల్ సిటీ”ని ఈ లిస్ట్ నుంచి తొలగించారు. అంతకుముందు 2009 సంవత్సరం లో జర్మనీలోని డ్రెస్ డెన్ నగరంలో ఉన్న ఎల్బే వ్యాలీని హెరిటేజ్ సైట్ లిస్ట్ నుంచి తప్పించారు. 2007 సంవత్సరం లో ఒమన్ దేశానికి చెందిన అరేబియన్ ఓరిక్స్ శాంక్చువరీని కూడా హెరిటేజ్ సైట్ లిస్ట్ నుంచి తీసేశారు.

చనిపోయిన వారి గుట్ట..

మొహంజోదారో అంటే  “చనిపోయిన వారి గుట్ట” అని అర్ధం. క్రీ.పూ 2500 లో ఈ నగరం నిర్మితమైంది.సింధు లోయ నాగరికత ..పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా, నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. మొహంజో దారో నాగరికత ఉచ్ఛదశలో ఉన్నపుడు పశ్చిమ పాకిస్థాన్,  ఉత్తర భారతదేశాల వరకు విస్తరించి ఉండేది. పశ్చిమాన ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన బాక్ట్రియా, దక్షిణాన గుజరాత్ వరకు కూడా దాని సరిహద్దులు ఉండేవి. ఈ నాగరికతకు చెందిన ప్రధానమైన నగరాలు హరప్పా, మొహంజోదారో, లోథల్, కాలీబంగా, ధోలావీరా, రాఖీగఢీలు. మొహంజో దారో ఆ కాలంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు.. మొహంజోదారో నగరం శిథిలావస్థకు చేరింది.ఆ తర్వాత 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.