Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

సూర్యుడు అంటేనే ఒక మిస్టరీ. ఆ నిప్పు గుండం లో ఏం జరుగుతోంది ? ఎలా జరుగుతోంది ? ఎందుకు జరుగుతోంది ? అనే దానికి నేటికీ సంపూర్ణ సమాధానాలను శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 04:12 PM IST

సూర్యుడు అంటేనే ఒక మిస్టరీ. ఆ నిప్పు గుండం లో ఏం జరుగుతోంది ? ఎలా జరుగుతోంది ? ఎందుకు జరుగుతోంది ? అనే దానికి నేటికీ సంపూర్ణ సమాధానాలను శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. అయితే సూర్యుడి పై ఓ కన్నేసి ఉంచేటందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) 2020 ఫిబ్రవరిలో ”సోలార్ ఆర్బిటర్” అనే ఉపగ్రహాన్ని పంపించింది. ఈఏడాది మార్చి 26న అది సూర్యుడిలోని ఒక ధ్రువ ప్రాంతానికి అత్యంత చేరువగా వెళ్లి కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి భూమికి పంపింది. ఈ దృశ్యాలను సోలార్ ఆర్బిటర్ లోని ‘ ఎక్స్ ట్రీమ్ అల్ట్రా వైలట్ ఇమేజర్’ (ఈయూఐ) అనే పరికరం చిత్రీకరించింది. సూర్యుడి వాతావరణంలోని దిగువ పొరల్లో ఉండే ” సోలార్ కరోనా” అనే ప్రాంతంలో సంభవించిన భారీ సౌర విస్ఫోటనాలు, ఉధృతితో వీచే సౌర పవనాలను ఆ ఫోటోలు, వీడియోల్లో స్పష్టంగా చూడొచ్చు.

సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం కక్ష్యలో ఉండగా.. ఈ దృశ్యాలను సోలార్ ఆర్బిటర్ తన ఈయూఐ లో ఒడిసిపట్టింది. ఫోటోలు, వీడియోలలో కనిపించిన దృశ్యాలకు శాస్త్రవేత్తలు ‘ హెడ్జ్ హాగ్’ అని పేరు పెట్టారు. సూర్యుడిపై దాదాపు 25,000 కిలోమీటర్ల మేర నలువైపులా సౌర పవనాలు, సౌర విస్ఫోటనాలు, వాయువులు వ్యాపించి ఉన్నాయని పేర్కొన్నారు. సోలార్ ఆర్బిటర్ వీడియోలు, ఫోటోల్లో దృశ్యాలు చిత్రీకరించిన సూర్యుడి ఉపరితల ప్రాంతం వ్యాసం (డయామీటర్) భూమి కంటే రెట్టింపు పరిమాణంలో ఉందని తెలిపారు. అయితే ఆ భాగం విస్తీర్ణం సూర్యుడి 14 లక్షల కిలోమీటర్ల వ్యాసపు సైజులో ఒక చిన్న భాగం మాత్రమేనని వివరించారు. సూర్యుడి పై ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మారే సోలార్ సైకిల్ కు సంబంధించిన కొంగొత్త విషయాలను అర్ధం చేసుకోవడానికి ఈ అధ్యయనం దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.