Uber Bill Viral : ఉబెర్‌‌తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్

Uber Bill Viral : అతడి పేరు దీపక్. అందరిలాగే ఉబెర్ యాప్‌లో ఆటోను బుక్ చేసుకున్నాడు. 

  • Written By:
  • Updated On - March 31, 2024 / 01:59 PM IST

Uber Bill Viral : అతడి పేరు దీపక్. అందరిలాగే ఉబెర్ యాప్‌లో ఆటోను బుక్ చేసుకున్నాడు.  అతడు దిగాల్సిన చోటుకు ఆటోలో  ప్రయాణిస్తే రూ.62 ఛార్జీగా కట్టాల్సి ఉంటుందని తొలుత  ఉబెర్ యాప్ చూపించింది.  అయితే శుక్రవారం ఉదయం గమ్యస్థానంలో దిగాక ఉబెర్ యాప్‌లో ఏదో సాంకేతిక గందరగోళం జరిగింది. రూ.62తో అయిపోయే ప్రయాణానికి ఏకంగా రూ.7.66 కోట్ల భారీ బిల్లును ఉబెర్ యాప్ చూపించింది. ఈ బిల్లుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను దీపక్ స్నేహితుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో(Uber Bill Viral) ఈ ఘటన చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం..  దీపక్‌కు రూ.7.66 కోట్ల ఉబెర్ ఆటో బిల్లు రాగా,  ఇందులో రూ.1.67 కోట్లను ట్రిప్ ఫేర్‌గా, వెయిటింగ్ టైమ్ ఖర్చును రూ.5.99 కోట్లుగా చూపించారు. మరో రూ.75 ను ప్రమోషన్ ఖర్చు పేరుతో తగ్గించారు. దీపక్, తన ఆటో డ్రైవర్ కోసం ఎక్కడ వేచి చూడలేదు.  అయినప్పటికీ అతడికి రూ.5.99 కోట్ల వెయిటింగ్ టైం ఖర్చును విధించడం గమనార్హం. ఈ బిల్లుపై ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన దీపక్..  వెయిటింగ్ టైం ఖర్చులపైనే అంతటా చర్చ జరుగుతోందని కామెంట్ చేశాడు. తనపై ఇంత భారీ బిల్లును బాదినా.. జీఎస్టీ పన్నును మాత్రం విధించలేదని దీపక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో డబ్బుల విషయంలో ఎన్నడూ ఇన్ని సున్నాలను ఒకేసారి లెక్కపెట్టాల్సిన అవసరం రాలేదన్నాడు.  ఈసందర్భంగా దీపక్ స్నేహితుడు ఆశిష్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మీరు ఉబెర్‌లో డైరెక్ట్‌గా చంద్రుడిపైకి రైడ్‌ను బుక్ చేసుకున్నా.. దానికి ఇంత ఖర్చు కాదేమో’’ అని సెటైర్ వేశాడు. ‘‘నేను వెంటనే ఉబెర్ ఫ్రాంఛైజీని తీసుకోవాలని ఆలోచిస్తున్నాను.. కొన్ని వందల రూపాయల ఖర్చుతో కోటీశ్వరులుగా మారిపోయే అవకాశం అందులోనే ఉంది మరి’’ అని ఆశిష్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read :Easter Festival : ఇవాళే ఈస్టర్.. ఈ పండుగ ఆదివారమే ఎందుకొస్తుంది ?

దీపక్ స్నేహితుడు ఆశిష్ మిశ్రా ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఎట్టకేలకు ఉబెర్ ఇండియా కస్టమర్ సపోర్ట్ టీం స్పందించింది. ఆటో రైడ్ బిల్లు విషయంలో దీపక్‌కు ఎదురైన చేదు అనుభవానికి  క్షమాపణలు చెప్పింది.  బిల్లు అంతగా వచ్చేందుకు దారితీసిన  సమస్యపై తమ టీమ్ ఫోకస్ చేసిందని వెల్లడించింది. కొంత సమయమిస్తే.. మళ్లీ అప్‌డేట్‌తో దీపక్‌ను సంప్రదిస్తామని తెలిపింది. కాగా, గత ఏడాది నవంబర్‌లో అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఉబెర్ డ్రైవర్ కేవలం ఏడాది వ్యవధిలో తన ట్రిప్‌లలో 30 శాతానికిపైగా రద్దు చేసుకోవడం ద్వారా దాదాపు రూ. 23.3 లక్షలను సంపాదించాడని వెల్లడైంది.