Alluri: ‘అల్లూరి’ ఆనవాళ్లు ఇక్కడ పదిలం!

విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ వస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి గురించి ఎలా చూపిస్తారో పక్కన పెడితే అసలు ఈ ఇద్దరి గురించి జరిగిన వాస్తవ విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది.

విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ వస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి గురించి ఎలా చూపిస్తారో పక్కన పెడితే అసలు ఈ ఇద్దరి గురించి జరిగిన వాస్తవ విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. పలు కారణాల వల్ల కొమరం భీమ్ చరిత్ర కావలసినంత రికార్డు కాలేదు. అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన పలు విషయాలు, ఆధారాలు స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో భద్రపరచి ఉన్నాయి.

సీతారామరాజు అసలు పేరు రామరాజుగా పోలీస్ రికార్డుల్లో ఉంది. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించిన అల్లూరి తన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఆయనకి పంపిన కోర్టు సమన్లకు బదులిస్తూ అల్లూరి తనకి వచ్చిన శ్లోకాలను, పద్యాలను రాసి పంపేవాడు.

1920 నుండి 1924 మధ్యకాలంలోనే అల్లూరి చరిత్ర రికార్డు చేయబడి ఉంది. ఆ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలతో మమేకమై మన్యంలో ఒక దేవుడిలాగా ఆయన కొలవబడ్డాడు. తనని వెతుకుతున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయడానికి అల్లూరి చాలా ఎత్తుగడలు వేసేవాడు. ఆయన పక్కన షార్ప్ గా బాణాలు వేయగలిగేవారు. పోలీస్టేషన్ల నుండి దోచుకున్న తుపాకులతో టార్గెట్ లను ఈజీగా కాల్చేవారు ఉండేవారట. మన్యంలో అల్లూరి చేసే పోరాటాన్ని అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించినా కుదరలేదు. చివరికి అప్పట్లో నిష్ణాతులైన అస్సాం రైఫిల్స్ సహాయంతో రూథర్ ఫర్డ్ నాయకత్వంలో అల్లూరిని చంపగలిగింది. నిజానికి అల్లూరిని పట్టుకొని చంపారు అనేకంటే తనకుతానుగా లొంగిపోయిన అల్లూరిని కాల్చి చంపారనడమే సరైందని చరిత్రకారులు చెబుతారు.

అల్లూరి చనిపోయాక పది సంవత్సరాలకు ఆయనపై వచ్చిన పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిందంటే అల్లూరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎంత భయపెట్టి ఉంటాడో ఊహించవచ్చు. చాలా విషయాల్లో అల్లూరికి, భగత్ సింగ్ కి సారూప్యత ఉంది. ఇద్దరూ చిన్నవయస్సులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఇద్దరూ బ్రిటిష్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేశారు. ఇద్దరూ చిన్నవయసులోనే బ్రిటిష్ ప్రభుత్వంచే హత్య చేయబడ్డారు. అల్లూరి బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడినప్పటికీ మన్యం ప్రాంతానికే పరిమితమై ఆ ప్రాంత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను తిప్పికొట్టాడు.

అల్లూరికి సంబంధించిన ఉత్తరాలు, ఆయన చేతిరాత, ఆయనపై వచ్చిన పుస్తకాలు, ఆయనకి పంపిన కోర్టు సమన్లు దానికి రాసిన ప్రత్యుత్తరాలు చూడాలంటే స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ కి వెళ్లి చూడొచ్చు.