Mallanna Sagar: తెలంగాణ మణిహారం ‘మల్లన్నసాగర్’

తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవంతో పూరిపూర్ణమవుతున్నది.

  • Written By:
  • Updated On - February 23, 2022 / 02:13 PM IST

తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవంతో పూరిపూర్ణమవుతున్నది. ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుదిదశకు చేరుకొంటున్నది. ముఖ్యంగా మల్లన్నసాగర్‌ తెలంగాణకు గుండెకాయ. మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళదశల ఎత్తిపోతల ప్రాజెక్టుగా రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్‌ మ్యాన్‌ మేడ్‌ రివర్‌లో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు మాత్రమే అతి పెద్దవిగా రికార్డులు నమోదుచేయగా, వాటిని తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. 13 జిల్లాల్లో సాగునీటితోపాటు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు, దక్షిణ తెలంగాణకు గోదావరి నీటిని అందిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్‌ను ఇక్కడే నిర్మించారు.

రెండు పంటలకు భరోసా

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగానికి రెండు పంటలకు భరోసా కలిగింది. ఆయా ప్రాజెక్టుల ఉన్న చివరి మడి వరకు సాగునీరు అందుతున్నది. ఒకవైపు కాళేశ్వరం పనులను రికార్డు సమయంలో పూర్తిచేయడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులను సైతం తెలంగాణ ప్రభుత్వం పునఃప్రారంభించి పూర్తిచేసింది. అందుకు ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ వరద కాలువ, శ్రీరాంసాగర్‌ రెండోదశ పనులే నిదర్శనాలు. గోదావరి వరద ఆధారంగా రూపకల్పన చేసిన ఆయా ప్రాజెక్టులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి వాటి కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించింది. సీఎం కేసీఆర్‌ అద్భుత సృష్టి ఫలితంగానే నేడు ఎస్సారెస్పీ వరద కాలువ 122 కిలోమీటర్ల మేర సజీవ ధారగా మారింది. ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ రెండో దశ చివరి మడి వరకూ సాగు నీరు అందుతున్నది.

మూడేండ్లలోనే పూర్తి

ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. 2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. 2019 జూన్‌ 21న అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఉమ్మడి రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితంచేశారు సీఎం కేసీఆర్‌.
ఈ మహాద్భుత ప్రాజెక్టు నిర్మాణానికి మూడేండ్లు మాత్రమే పట్టిందంటే.. కాళేశ్వరం నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఏ స్థాయి పట్టుదల కనబర్చారో కండ్లముందు కనిపిస్తుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిలాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నది. యావత్తు తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి, పూర్తయ్యేదాకా రికార్డులే, పూర్తయ్యాక కూడా రికార్డులు సాధిస్తున్నది. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు నిర్మాణాలలో వినియోగించని అత్యద్భుతమైన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు దీని నిర్మాణంలో వాడారు.

7 లింకులు.. 28 ప్యాకేజీలు

కాళేశ్వరం పనులను ప్రభుత్వం 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి 11 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోసి సరస్వతి బరాజ్‌కు, ఇక్కడి నుంచి 8 మోటర్లతో పార్వతి బరాజ్‌కు తరలిస్తా రు. ఇక్కడి నుంచి 11 మోటర్లతో లింక్‌-2లోని శ్రీపాద ఎల్లంపల్లికి, అక్కడి నుంచి సొరంగమార్గాల ద్వారా భూగర్భంలోని నందిమేడారంలోని నంది జలాశయానికి, ఇక్కడి నుంచి రామడుగులోని లక్ష్మీపూర్‌ (గాయత్రీ) పంప్‌హౌజ్‌కు బాహుబలి మోటర్ల ద్వారా నీటిని తరలిస్తారు. ఇక్కడ బాహుబలి మోటర్ల ద్వారా నీటిని శ్రీరాంసాగర్‌ వరద కాలువలో ఎత్తిపోస్తారు. వరద కాలువ ఎగువన మూడు లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి ఎస్సారెస్పీకి నీటిని తరలిస్తారు. వరద కాలువ దిగువ నుంచి జలాలను లింక్‌-3లోని శ్రీరాజరాజేశ్వర డ్యామ్‌కు, అక్కడి నుంచి అప్పర్‌ మానేర్‌కు తరలిస్తారు. లింక్‌-4లో మిడ్‌ మానేరు నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు, లింక్‌-5 లో మల్లన్నసాగర్‌ నుంచి గంధమల్ల రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి చిట్యాల మండలానికి, లింక్‌-6 లో మల్లన్నసాగర్‌ నుంచి సింగూర్‌ రిజర్వాయర్‌కు, లింక్‌-7 లో శ్రీరాంసాగర్‌ నుంచి నిజాంసాగర్‌ పరిధిలోని నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌కు నీటిని తరలిస్తారు.

జీవవైవిధ్యం

కాళేశ్వరం ప్రాజెక్టు సాగు, తాగు నీటి వసతినే కాదు రాష్ట్ర సహజ జీవావరణ వ్యవస్థలోనూ గణనీయమైన మార్పును తీసుకువస్తున్నది. పచ్చదనానికి ఊపిరి పోస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి పరోక్షంగా ఆయువునిస్తున్నది. జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తున్నది. తత్ఫలితంగా దశాబ్దాల కింద వలస పోయిన పక్షులు సొంతగూటికి చేరుతున్నాయి. జంతువులు తమ తావులను వెతుక్కొంటూ వస్తున్నాయి. గోదావరి బేసిన్‌లోని కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్టుకు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వరం రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి పులులు వలస వస్తుండటమే అందుకు నిదర్శనం. పోచారం అభయారణ్యంలో కృష్ణ జింకలు ఏండ్ల తర్వాత దర్శనమిచ్చాయి. దాదాపు 17 ఏండ్ల తర్వాత భూపాలపల్లి ప్రాంతంలో పెద్ద పిల్లులు సందడి చేస్తున్నాయి. జింకలు, పాములు, కప్పలు, కీటకాలు, తాబేళ్లు ఇతర జంతుజాలం గణనీయంగా పెరుగుతున్నది.

కరుగుతున్న కాఠిన్యత

కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రభుత్వం 3 బరాజ్‌లను నిర్మించింది. 15 రిజర్వాయర్లను నిర్మిస్తున్నది. వాటి స్టోరేజీ కెపాసిటీ 141 టీఎంసీలు కాగా, ఇప్పటికే పనులన్నీ తుది దశకు చేరుకొన్నాయి. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు నిర్మాణం పూర్తయిన రిజర్వాయర్లన్నింటినీ గోదావరి జలాలతో నింపారు. ఫలితంగా భూగర్భ జలమట్టాలు గతంతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో జలాల స్వచ్ఛత కూడా పెరుగుతున్నది. నీటిలో ఫ్లోరైడ్‌, ఆర్సెనిక్‌ తదితర హానికర మూలకాల గాఢత తగ్గిపోతున్నది.

తారక మంత్రం మల్లన్నసాగర్‌

మల్లన్నసాగర్‌… ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఓ వరప్రదాయిని. ఇది కేవలం మాటల్లో కాదు… కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలిస్తే ఇది అక్షర సత్యమని స్పష్టమవుతుంది. భారీ ఎత్తున గోదావరి జలాల్ని ఒడిసి పట్టడమే కాదు.. ఆయకట్టుకు సమానంగా సాగునీటి పంపిణీ జరగాలన్నా, డిమాండు-సరఫరాకు మధ్య వ్యత్యాసాన్ని భారీగా తగ్గించాలన్నా, చివరకు ప్రాజెక్టులో ఎక్కడ కొరత, సమస్య ఏర్పడినా వ్యవస్థ కుప్పకూలకుండా ఆదుకోవాలన్నా… అన్నింటికీ ఒకే తారక మంత్రం మల్లన్నసాగర్‌. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో మల్లన్నసాగర్‌ను మదర్‌ రిజర్వాయర్‌గా అభివర్ణించారు.

8 లక్షల ఎకరాల ఆయకట్టు

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 535 మీటర్లు. అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించనున్నది. మల్లన్నసాగర్‌ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-13 కింద మల్లన్నసాగర్‌ నుంచి 8.733 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ-17, 18, 19 కింద 11.670 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 11.525 కిలోమీటర్ల టన్నెల్‌ ఆపై మరో 2.505 గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది. ఆపై 34 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్‌ సమీపంలోని ముదిమానిక్‌ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు. ప్యాకేజీ-18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ-19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్‌ నుంచి 8.175 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్‌ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి జలాల్ని తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్‌కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ-16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో పోస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ-14 కింద 4.850 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 8.950 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్‌ సమీపంలో మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. పాములపర్తి దగ్గర కూడా కేవలం 89 మీటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.

అతిపెద్ద రిజర్వాయర్‌

రాష్ట్రంలోనే ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌. దీని కెపాసీటీ 50 టీఎంసీలు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ జలాశయంతో ఉమ్మడి మెదక్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్‌, నిజాంసాగర్‌, సింగూరు, తపాస్‌పల్లి, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే గోదావరి జలాలను తరలిస్తారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా అందిస్తారు. శ్రీరాజరాజేశ్వర జాలశయం నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌కు అక్కడి నుంచి ఓపెన్‌ కెనాల్‌, సొరంగం ద్వారా మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలు వస్తాయి.

అపూర్వఘట్టమూ నేడే!
18,82,970 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమేకాకుండా.. కొత్తగా 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుతో మొత్తంగా 37,08,670 ఎకరాలకు సాగునీరిచ్చే కల్పవల్లి కాళేశ్వరం ప్రాజెక్టు. మూడు మహా బరాజ్‌ల నుంచి 22 ప్రాంతాల్లో లిఫ్టులు ఎత్తిపోసిన జలాలు.. 15 రిజర్వాయర్లు నింపుతూ తెలంగాణలో మొత్తం 1,832 కిలోమీటర్ల ప్రయాణంలో ప్రతి జలవనరుకూ నీటిని అందిస్తూ పోయే కాళేశ్వర గంగ.. రెండు పంటలకు భరోసానివ్వటమే కాకుండా.. భూగర్భంలో జలాల కాఠిన్యాన్ని తగ్గించి.. పాతాళాన్ని సైతం జలబాంఢాగారంగా మార్చుతూ.. పుడమిపై జీవవైవిధ్యానికి
కొత్త ఊపిరిలూదుతున్నది!

కీలక ఘట్టాలు
– 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన
– 2019 జూన్‌ 21న కాళేశ్వరం ప్రారంభం
– మేడిగడ్డ నుంచి సరస్వతి బరాజ్‌కు 2019 జూన్‌ 22
– పార్వతి బరాజ్‌ 2019 జూలై 21న ప్రారంభం
– ఎల్లంపల్లి నుంచి నంది మేడారం జలాశయానికి ఎత్తిపోతలు 5 ఆగస్టు 2019
– శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఎగువ మానేరుకు నీటి మళ్లింపు 11 ఆగస్టు 2019
– శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి 16 మార్చి 2020న అనంతసాగర్‌కు ఎత్తిపోతలు ప్రారంభం
– అనంతగిరి నుంచి రంగనాయకసాగర్‌కు చేరిన జలాలు 11 మార్చి 2020
– రంగనాయక సాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌కు జలాల తరలింపు 24 ఏప్రిల్‌ 2020న తరలింపు
– మల్లన్నసాగర్‌ ఫీడర్‌ చానల్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు 21 మే 2020
– కొండపోచమ్మసాగర్‌ నుంచి నిజాంసాగర్‌కు 6 ఏప్రిల్‌ 2021