Khajaguda Rocks: రాతి నిర్మాణాలను రక్షించండి మహప్రభో!

అది హైదరాబాద్ లోని శివారు ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం.. ప్రతినిత్యం పక్షులు, జంతువులు సందడి చేస్తుంటాయి. అలాంటిది ఓ ఉదయం 7.40 గంటలకే ఓ గుట్టపై నుంచి పెద్ద శబ్దాలు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 05:32 PM IST

అది హైదరాబాద్ లోని శివారు ప్రాంతం.. ప్రశాంతమైన వాతావరణం.. ప్రతినిత్యం పక్షులు, జంతువులు సందడి చేస్తుంటాయి. అలాంటిది ఓ ఉదయం 7.40 గంటలకే ఓ గుట్టపై నుంచి పెద్ద శబ్దాలు, చప్పుళ్లు వినిపిస్తున్నాయి. ఈ గుట్టపేరే ఖాజాగూడ. అక్కడ దట్టమైన చెట్లు, జంతువులు ఆవాసం చేసుకొని అక్కడ నివసిస్తుంటాయి. అందుకే ఆ ప్రాంతం హెరిటేజ్ ‘ప్రాంగణాలు’గా గుర్తింపు పొందింది. అయినప్పటికీ రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ఐటీ, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ఆ ప్రాంతమంతా ధ్వంసంగా మారుతోంది. అయితే కరోనా కారణంగా అటువైపు జనాలు వెళ్లకపోవడంతో, ఇదే అవకాశంగా భావించిన గుర్తు తెలియనివాళ్లు బండరాళ్లను, గుట్టలను తొలిచారు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కనీసం 15 ప్రత్యేకమైన రాతి నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి వీకెండ్ టూరిస్టులు ఆ ప్రాంతాలను సందర్శిస్తూ రాక్ క్లైంబింగ్ చేస్తుంటారు. జనవరి నెలలో పర్యాటకులు ఎవరూ విజిట్ చేయకపోవడంతో అక్కడి ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయి. అరుదైన రాళ్లను, భూమిని చదును చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని ధ్వంసం చేశారు. 20 రోజుల్లోనే కొండపై అక్రమంగా రోడ్డు వేసేందుకు 100 చెట్లను నరికేశారు.

“విధ్వంసం కారణంగా చాలా పక్షులు ఇప్పుడు కనిపించవు” అని గత 10 సంవత్సరాలుగా రాక్ ఫార్మేషన్ డాక్యుమెంట్ చేస్తున్న పర్యావరణ శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “సుమారు 18-20 అడుగుల ఎత్తు ఉన్న ఆలూ రాక్, ఎక్కడానికి కష్టతరమైన రాళ్లలో ఒకటి. ఒక విదేశీ జాతీయుడు దానిని అధిరోహించాడు అని ”అరుణ్ బంగాళాదుంప ఆకారంలో ఉన్న రాయిని చూపిస్తూ గుర్తుచేసుకున్నాడు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద గుహ నిర్మాణాలు ఖాజాగూడలో కనిపిస్తాయి.

2009లో, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జోనింగ్ రెగ్యులేషన్స్, 1981లోని రెగ్యులేషన్ 13 ప్రకారం ఖాజాగూడలోని 15 రాక్ ఫార్మేషన్‌లు ‘హెరిటేజ్ ప్రాంగణాలు’గా గుర్తించబడ్డాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వం రెగ్యులేషన్‌ను రద్దు చేయడంతో 2017లో ఈ హోదా రద్దు చేయబడింది. దీంతో విధ్వంసానికి అవకాశం కల్పించినట్టయింది. హైదరాబాద్‌కు చెందిన ‘సొసైటీ టు సేవ్ ది రాక్స్’ అనే సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తదుపరి రాళ్లను కూల్చివేయకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రెండింటినీ ఆదేశిస్తూ కోర్టు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. అయినా కూడా ఇక్కడ తవ్వకాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. పర్యావరణ ప్రేమికులు, ట్రెక్కర్స్, వాకర్స్ ఈ ప్రాంతాన్ని రక్షించాలని వేడుకుంటున్నారు.