Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిషన్‌ వెనుక హైదరాబాద్ శాస్త్రవేత్త షీనా రాణి

Agni V - Hyderabad : ఒకేసారి ఒకటికి మించి వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ‘అగ్ని-5’ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్ కావడంతో భారత్ పేరు యావత్ ప్రపంచంలో మార్మోగుతోంది.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 09:24 AM IST

Agni V – Hyderabad : ఒకేసారి ఒకటికి మించి వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ‘అగ్ని-5’ మిస్సైల్‌ పరీక్ష సక్సెస్ కావడంతో భారత్ పేరు యావత్ ప్రపంచంలో మార్మోగుతోంది. భారత రక్షణ శాఖ చేపట్టిన ‘మిషన్‌ దివ్యాస్త్ర’ ప్రాజెక్టులో భాగంగా అగ్ని-5 క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి గత శనివారం భారత్ విజయవంతంగా పరీక్షించింది.  ఈ మిస్సైల్ తయారీలో కీలక పాత్ర పోషించిన  రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) శాస్త్రవేత్తలను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును హైదరాబాద్‌లోని డీఆర్డీఓకు చెందిన శాస్త్రవేత్త షీనా రాణి ముందుండి నడిపారు. డీఆర్డీఓకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.

పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత..

ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆమెకు.. కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రావీణ్యం ఉంది.ఎనిమిదేళ్లు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌ (VSSC)లో శాస్త్రవేత్తగా పనిచేసిన షీనా.. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత 1999లో హైదరాబాద్ డీఆర్డీఓలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ‘అగ్ని’ రకం క్షిపణులకు సంబంధించి అన్ని శ్రేణుల లాంచ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌పై పనిచేస్తున్నారు. ‘మన దేశ సరిహద్దులను క్షిపణులు రక్షిస్తున్నాయి. అందుకే అగ్ని క్షిపణి కార్యక్రమంలో భాగమైనందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను’ అని షీనా అంటున్నారు. అగ్ని-5 మిస్సైల్(Agni V – Hyderabad) ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మిస్సైల్‌ మహిళ టెస్సీ థామస్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, డీఆర్‌డీఓ మాజీ చీఫ్ డాక్టర్ అవినాష్‌ చందర్‌ల నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

  • షీనా రాణి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు.
  • ఆమె పదేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణలో పెరిగారు.
  • తాను ఈ స్థితికి చేరడానికి తన తల్లే కారణమని షీనా గర్వంగా చెబుతారు. ‘నాతో పాటు నా సోదరి జీవితానికి మా అమ్మే బలమైన స్తంభం’ అని అంటారు.
  • ‘అగ్ని’ రకం  క్షిపణులలో ఉండే  వివిధ ఉపవ్యవస్థలను అభివృద్ధి చేయడంలో షీనా రాణి పనిచేస్తున్నారు.
  • ప్రయోగానికి ముందు ‘అగ్ని’ క్షిపణులలో ఉండే ఉప వ్యవస్థలను షీనా రాణి  తనిఖీ చేసి.. వాటి తాాజా స్థితిని నిర్ధారిస్తారు.
  • షీనా భర్త పీఎస్‌ఆర్‌ఎస్‌ శాస్త్రి కూడా డీఆర్‌డీఓ మిస్సైల్‌ ప్రోగ్రామ్‌తో పాటు ఇస్రోలోనూ కలిసి పనిచేశారు.
  • షీనా 2016లో సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు.

Also Read : TS -TG : ఇకపై ‘టీఎస్‌’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్‌ విడుదల

మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో తొలిసారిగా అగ్ని-5ను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు పరీక్షించారు. దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌‌ల సరసన భారత్‌ నిలిచింది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు.