డీఎస్ ఘ‌ర్ వాప‌సీ షురూ? మ‌రో తెల్ల ఏనుగు అంటోన్న వ్య‌తిరేకులు

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 03:17 PM IST

సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చే అవ‌కాశం ఉందా? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ ఆయ‌న‌తో ఎందుకు క‌లిశారు? సుదీర్ఘ రాజ‌కీయ చ‌ర్చ ఆ ముగ్గురి మ‌ధ్యా జ‌ర‌గ‌డం వెనుక ఏముంది? ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ పార్టీలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా శ్రీనివాస్ ఉన్నాడు. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు ఆ ప‌ద‌వీకాలం ఉంది. ఆ లోపుగానే కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టాల‌ని ఆయ‌న యోచిస్తున్నార‌ని వినికిడి. నాలుగు రోజుల క్రితం రేవంత్, కుసుమ‌కుమార్, డీ శ్రీనివాస్ భేటీ త‌రువాత ఘ‌ర్ వాప‌సీ వ్య‌వ‌హారం కాంగ్రెస్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.
కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన త‌రువాత డీఎస్ 2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చాడు. ఆ మేర‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా తొలుత ప‌ద‌విని కేసీఆర్ అప్ప‌గించారు. ఆ త‌రువాత 2016లో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏనాడూపార్టీ అంత‌ర్గ‌త విష‌యాల్లోకి డీఎస్ ను రానివ్వ‌లేదు. పార్టీ సంస్థాగ‌త విష‌యాల్లో కీల‌కం కావాల‌ని డీఎస్ భావించారు. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో మిన‌హా ఎక్క‌డా డీఎస్ తో ప్ర‌ధాన‌మైన వేదిక‌ను కేసీఆర్ పంచుకోలేదు. దీంతో క్ర‌మంగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు డీఎస్ దూరంగా ఉంటూ వ‌చ్చారు. 2018 ఎన్నిక‌ల నుంచి జ‌రిగిన ప‌రిణామాలు కేసీఆర్, డీఎస్ కు మ‌ధ్య అంత‌రాన్ని మ‌రింత పెంచాయి.

నిజామాబాద్ కేంద్రంగా తొలి నుంచి డీఎస్ రాజ‌కీయంగా ఎదిగారు. అక్క‌డి టీఆర్ఎస్ నేత‌ల‌కు డీఎస్ కు మ‌ధ్య పొస‌గ‌లేదు. పైగా డీఎస్ కుమారుల జోక్యాన్ని ఏమాత్రం టీఆర్ ఎస్ పార్టీలోని లీడ‌ర్లు సంహించ‌లేదు. ఒకానొక స‌మ‌యంలో డీఎస్ పెద్ద కుమారుడ్ని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అరెస్ట్ చేసింది. ఆనాటి నుంచి డీఎస్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి మ‌ధ్య అగాధం ఏర్ప‌డింది. చిన్న‌కుమారుడు అర‌వింద్ 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేసి కేసీఆర్ కుమార్తె క‌విత పై విజ‌యం సాధించారు. ఇటీవ‌ల చిన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక ఇప్పుడు డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వ‌స్తాడ‌ని టాక్ బ‌లంగా న‌డుస్తోంది.

ఉమ్మ‌డి ఏపీసీసీ చీఫ్ గా రెండు ప‌ర్యాయాలు డీఎస్ ప‌నిచేశాడు. పార్టీని అధికారంలోకి తీసుకు రాగ‌లిగాడు. మంత్రిగా వైఎస్ క్యాబినెట్ లో ప‌నిచేశాడు. 1989, 1999, 2004లో వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009, 2010,2012, 2014 ఎన్నిక‌ల‌లో వ‌రుస‌గా ఓడిపోయాడు. తొలుత 1989-94 మ‌ధ్య మంత్రిగా చేశాడు. ఆ త‌రువాత 2004లో వైఎస్ క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌విని నిర్వ‌హించాడు. సుదీర్ఘ‌ రాజ‌కీయ ప్ర‌యాణం కాంగ్రెస్ పార్టీలో చేసిన డీఎస్ కు నేరుగా సోనియాతో స‌న్నిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోని పెద్ద‌లు అంద‌రూ ఆయ‌న్ను ఆద‌రిస్తారు. పూర్వం ప‌ర‌చ‌యాల‌తో ఈజీగా కాంగ్రెస్ పార్టీలోకి రావ‌చ్చ‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు. ఘ‌ర్ వాప‌సీ చేసిన త‌రువాత కీల‌క ప‌ద‌విని ఆయ‌న ఆశిస్తున్నాడు. కానీ, నిజామాబాద్ లోని డీఎస్ వ్య‌తిరేక వ‌ర్గీయులు మ‌ళ్లీ కాంగ్రెస్ కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డంలేదు. ఆయ‌న అవ‌స‌రం ఇప్పుడు పార్టీకి లేద‌నే వాద‌న వినిపిస్తున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మీద కూడా డీఎస్ తో భేటీ ప‌ట్ల కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న సీనియ‌ర్ల‌తోనే పార్టీ గంద‌ర‌గోళంగా ఉంది. మ‌ళ్లీ డీఎస్ ను కాంగ్రెస్ లోకి తీసుకొస్తే మ‌రో తెల్ల ఏనుగు అవుతాడ‌ని నిజామాబాద్ కాంగ్రెస్ లోని కొంద‌రు భావిస్తున్నారు. కేవ‌లం ఆయ‌న‌కు స్వ‌ల్ప ఫ్యాక్చ‌ర్ అయిన కార‌ణంగా ప‌లుక‌రించ‌డానికి రేవంత్‌, కుసుమ వెళ్లారు మిన‌హా ఎలాంటి ఘ‌ర్ వాప‌సీ వ్య‌వ‌హారం లేద‌ని కొంద‌రు అంటున్నారు. మొత్తం మీద డీఎస్ ఘ‌ర్ వాప‌సీ వ్య‌వ‌హారం అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.