CM KCR: రైతులను ఉగ్రవాదులతో పోల్చడం దుర్మార్గం: కేసీఆర్

రైతుల సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కరించబడట్లేవంటే రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే సాధ్యం.

  • Written By:
  • Updated On - April 2, 2023 / 09:48 AM IST

శనివారం నాడు తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మహారాష్ట్ర నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ( రైతు సంఘం ) నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు

‘‘ బీఆర్ఎస్ లో చేరిన మరాఠా నేతలకు స్వాగతం.  నా 50 ఏండ్ల రాజకీయ అనుభవం లో ఉద్యమాలను ఆందోళనలు, ఎన్నో సమస్యలు, ఆటుపోట్లను చూశాను. గెలిచాము. ఇప్పుడు నేను మరో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నాను. దేశంలోని రైతుల కష్టం చూసి  రైతుల పోరాటం న్యాయమైనదనే భావనతో నీను జాతీయ రైతుల సమస్యలను నేను తలకెత్తుకున్నా. చిత్తశుద్దితో ప్రయత్నం కొనసాగిస్తే అసంభవం అనేది ఉండదు. తలచుకుంటే ఏదైనా సాధ్యమే.   కచ్చితంగా మనం గెలిచి తీరతాం.

ప్రతి తాళానికీ తాళం చెవి వున్నట్టు ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.  ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉండాలి.  రైతు సమస్యల పరిష్కారానికి 1935 నుంచి పోరాటాలు సాగుతూనే వున్నాయి. సర్ చోటూరామ్,మహిందర్ సింగ్ టికాయత్, శరద్ జోషీ, చౌదరి చరణ్ సింగ్, దేవిలాల్ వంటి నేతలనుంచి నేటి గుర్నామ్ సింగ్ దాకా రైతు పోరాటాలు సాగుతూనే వున్నాయి. తమ హక్కుల సాధనకోసం నల్ల చట్టాలు ఎత్తేయాలని, 13 నెల్ల పాటు దేశ రైతులు రాజధాని ఢిల్లీ రోడ్లమీద ఆందోళన చేసిండ్రు. వారిని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు అని తీవ్రవాదులు అనీ ముద్రవేసింది. అయినా రైతులు చెక్కుచెదరకుండా పోరాడారు. రైతుల పోరాటం న్యాయబద్దమైంది.

వాళ్ల పరిస్థితి తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాను.  వారి కోసం ప్రధాని ఒక్క మాట కూడా మట్లాడలేదు. 750 మంది రైతులు అమరులైన తర్వాత ప్రధాని దిగివచ్చిండు.   రైతులకు క్షమాపణలు చెప్పిండు. పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసమే రైతులకు ప్రధాని తియ్యటి మాటలు చెప్పిండు. లేకుంటే చట్టాలను వెనక్కు తీసుకునే వాడు కాదు. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. గిట్టుబాటు ధరల కోసం రైతులు ఇంకెంత కాలం పోరాడాలి..?

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటు కాకముందు మహారాష్ట్ర కన్నా ఘోరంగా వుండేటివి తెలంగాణలో పరిస్థితులు. ఇక్కడ కూడా రైతుల ఆత్మహత్యలుండేటివి. కానీ రాష్ట్రం ఏర్పాటయినంక వొక దారి దొరికింది. నేడు రైతుల ఆత్మహత్యలు జీరోఅయినవని నీను గర్వంగా చెప్పగలను. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుంటే వొక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు వరి సాగవుతోంది. ఇవ్వాల తెలంగాణ వ్యాప్తంగా రిజర్వాయర్లల్లో నీల్లు ఎట్లా నిండుగా వున్నాయో చూస్తే మీకే అర్థమౌతుంది. వొకటి రెండు రోజులుండి తెలంగాణలో అభివృద్ధిని పరిశీలించి రండి. తెలంగాణలో ఏం చేశామో..ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు అమలువుతున్నాయో మీరంతా ఒకసారి చూసిరండి.  కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి.  ఏప్రిల్ నడి ఎండల్లో కూడా  తెలంగాణ చెరువులు, కాలువలు..నిండుగా నీల్లున్నయి.  ఎట్లున్నయి.?మరి తెలంగాణలో హిమాలయాలున్నయా మరీ నీల్లెక్కడినుంచి వచ్చినయి..? హిమాలయాలు లేవు కానీ, హిమాలయాలకన్నా ఎత్తయిన సంకల్పం వుంది  కాబట్టే తెలంగాణ లో నీల్లు వచ్చినయి.

మన దేశంలో సహజ సంపదలకు  కొదువలేదు.  అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సింగపూర్ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది?   ఏ వనరులూ లేని సింగపూర్ అంత గొప్పగా అభివృద్ధి చెందినప్పుడు..  అన్ని వనరులు ఉన్న భారతదేశం ఎందుకు వెనకబడింది ? 14 మంది ప్రధానులు మారినా మన దేశ తలరాత ఎందుకు మారలేదు ? ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎట్లా  ముందుకు పోతది?  వాహనాల వేగం ప్రపంచంలో ఎలా ఉంది? మన దగ్గర ఎలా ఉంది?  ఈ దేశంలో 83 కోట్ల ఎకరాల భూమివుంటే అందులో41 కోట్ల ఎకరాలు మాత్రమే సాగుచేసుకుంటున్నం. ఈ దేశంలో మామిడి పండుతుంది అదే సమయంలో ఆపిల్ పండుతుంది. ఇక్కడి వాతావారణం చాలా గొప్పది. నీరు కూడా అవసరానికన్నా ఎక్కువగా వుంది. 70 వేల టిఎమ్సీ నీటిలో కేవలం 19 వేలు మాత్రమే వాడుకుంటున్నం. 50 వేల టిఎంసీలు వృథాగా సముద్రాల పాలవుతున్నది. అంతేకాకుండా 140 కోట్ల మంది ప్రజలున్నారు. మరిన్ని వుండగా మన పిల్లలు పిజ్జాలు బర్గర్లు ఎందుకు తింటున్నారు.? మెక్ డోనాల్డ్ ను మించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ దేశంలో ఎందుకు నెలకొల్పలేక పోతున్నరు..? ఈ విషయాలన్నింటిని మనం ఆలోచించాలె.

రైతుల సమస్యలు ఇంకా ఎందుకు పరిష్కరించబడట్లేవంటే రైతుల బాధలు తెలిసిన వారు నేతలైతేనే సాధ్యం. రైతుల సమస్యలను కేవలం రైతులే పరిష్కరించుకోగలరు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు. తెలంగాణ బడ్జెట్ కన్నా మహారాష్ట్ర బడ్జెట్ పెద్దది మరి ఆ రాష్ట్ర సర్కార్ ఎందుకు రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తలేదు…అంటే…దాల్ మే కుచ్ కాలా హై..అని అర్థమౌతుంది.

తెలంగాణ తలసరి ఆదాయం లో నెంబర్ వన్ లో వున్నదని పార్లమెంటులో కేంద్రమే ప్రకటించింది. తెలంగాణ లో ఆదాయ వనరులను పెంచుకుందానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నది. రాష్ట్రం రాకముందు పదేండ్ల కాలంలో ఇసుక నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం 40 కోట్లు కానీ (శేరీ సుభాష్ రెడ్డి చైర్మన్  గా అంటూ చూయించారు) తెలంగాణ వచ్చినంక 5,500 కోట్ల రూపాయలకు పెరిగింది. రైతుబంధు,రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు తదితర అన్ని రకాలుగా రైతుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న మొత్తం ఖర్చు 4.5 లక్షల కోట్లు అనేది వాస్తవం. ఇంతగా రైతు పనిచేస్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేయదు..? కేంద్ర ప్రభుత్వం ఎందుకు రైతు కోసం పనిచేయదు.? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నీకేం పని మహారాష్ట్రాలో అంటున్నాడు…నీను ఏమంటున్ననంటే…తెలంగాణ మోడల్ రైతు సంక్షేమాన్ని మహారాష్ట్రలో అమలు చేసి చూయిస్తే నీనెందుకు వస్తా..? నీను రావద్దు అంటే చేసి చూయించండి అని స్పష్టం చేశిన. మోడీ రాకముందు ఎఫ్ సి ఐ గోదాములు నిర్మిస్తుండే…కానీ మోడీ వచ్చినంక వొక్క గోదాము కట్టట్లేదు. అన్నీ అదానీకి గుత్తకిచ్చింది కేంద్రం. కరెంటు చార్జీలు పెంచుతున్నరు. రైతుల మోటర్లకు మీటర్లు పెడుతం మంటున్రు. పెట్టండి మీకు రైతులు మీటర్లు పెట్టడం ఖాయం అని మనం అంటున్నం.

దేశ రైతాంగానికి సాగునీల్లు లేవు కరెంటు లేదు పెట్టుబడి సాయం లేదు…అందుకే మనం…అబ్ కీ బార్ కిసాన్ సర్కార్….అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నం.రైతు సమస్యల పరిష్కారానికి రైతుల్లో ఐక్యత రావాలె. ‘‘ అప్నా డంగ్ చాహియే…అప్నా రంగ్ చాహియే…అప్నా జంగ్ చాహియే’’. ఈ దేశంలో రైతులు ఇంకా 75 ఏండ్లు ఆందోళనలు పోరాటాలు చేసినా ఈ పాలకులకు ఉలుకురాదు. మన పరిస్తితి ఇట్లనే వుంటది. మనం చేయాల్సిందల్లా మన చేతిలో వున్న పవర్ ఫుల్ వోటు ను వినియోగించుకుని రైతు రాజ్యాన్ని తెచ్చుకోవాలె. మన చేతిలో వోటు అనే అస్త్రం వుండగా  రోడ్ల మీద ఆందోళనలు పోరాటాలు అక్కెర లేదు. లాఠీ దెబ్బులు తూటాలు తినాల్సిన అవసరం లేదు. నిమ్మలంగా మన ఆయుధమైన వోటును వాడుకుంటే సరిపోద్ది. మనం వోటు మనం వేసుకుంటే రైతు రాజ్యం వస్తది. మనల్ని మనం బాగుచేసుకుంటం. ఇందుకు గట్టి సంకల్పం, శుద్ది బుద్ధి కావాలి. గతంలో ‘షెట్కారీ కామ్ గారీ పార్టీ ’ పోటీ చేసి మహారాష్ట్రలో 76 సీట్లు గెలిచింది. మనం ఇప్పుడు 200 సీట్లు గెలుస్తం. అందుకు గట్టి సంకల్పం కావాలె…’’ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా  సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నేతలతో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సిఎం కేసీఆర్ సమాధానాలిచ్చారు. వారి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వొక రైతు సంఘం నేత లేచి వొక ప్రశ్న అడిగారు. మనం ప్రజల వద్దకు పోయి రైతుల కోసం ఇంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చి ఖర్చు చేస్తరు అని అడిగితే మీం ఏం చెప్పాలి అని అడిగారు. అందుకు సమాధానంగా…మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ దేశంలో పాలక వర్గాలకు రైతులకోసం ఖర్చు చేయాలనే సోయి 75 ఏండ్ల స్వాతంత్రం తర్వాత కూడా రాకపోవడం శోచనీయం. వ్యవసాయ భారత దేశంలో రైతు సంక్షేమానికన్నా మించిన ప్రభుత్వ ప్రాధాన్యత ఏముంటది.? ఇన్నాల్లూ ఇక్కడి రాజకీయ నాయకులకు గానీ అధికారులకు కానీ అభివృద్ధి పేర ఆపేరుతో ఈ పేరుతో ప్రాధాన్యతాంశాలు వేరు గా వున్నాయి. రైతుకు వ్యవసాయానికి అన్నప్పుడు నిధులు కేటాయించాలంటే అనేక కొర్రీలు పెట్టుకుంటూ అప్రధాన్యతగా భావిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు రైతులు వ్యవసాయమే మన బిఆర్ఎస్  ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. బడ్జెట్ లో మొదట వీటికే కేటాయింపులు చేస్తాం. మన దేశానికి రాష్ట్రాలకు వచ్చిన సంపదనుంచి మొదట రైతుకు వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ సాగునీరు పెట్టుబడి తదితర అంశాలనే ప్రాధాన్యతంశాలుగా ఎంచుకుంటుంది.’’  అని సిఎం స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సిఎం వివరించారు.