Site icon HashtagU Telugu

Medaram: ఆరోజే మేడారంలో తొలి మరో ఘట్టం.. సమ్మక్క ఆగమనం కోసం భారీ ఏర్పాట్లు

Medaram Jatara 2024

Medaram Jatara 2024

Medaram: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం తో… భక్తులకు కలిగే అద్భుత అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెరలు) ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకొస్తారు. గిరిజన సంప్రదాయక వాయిద్యాలతో సమ్మక్క, సారక్కలను తీసుకొచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది.

మేడారంలో తొలి మరో ఘట్టం కన్నెపల్లి నుండి సారలమ్మ రావడం. మేడారానికి ఏడెనిమి కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మ మేడారం గద్దెలవద్దకు రావడం, ప్రధానంగా కన్నెపల్లి గుడి నుండి కోయ పూజారులు సారలమ్మను బయటికి తెచ్చే విధానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. లక్షలాది భక్తుల తన్మయత్వం నడుమ, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ నుండి వచ్చే ఆదివాసీలు, గుత్తి కోయల నృత్యాల మధ్య సారలమ్మ రావడం ఒక అద్భుత దృశ్యం. జిల్లా జాయింట్ కలెక్టర్ (ఇప్పటి అడిషల్ కలెక్టర్ ) సారలమ్మ అమ్మవారికి స్వయంగా స్వాగతం పలుకుతారు. పోలీసు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ సందర్బంగా హాజరవుతారు.

కన్నెపల్లి లో సారలమ్మ వెళ్లే మార్గంలో వందలాది మంది మార్గ పొడుగునా పడుకొని ఉండడం (దీనినే వరాలు పట్టడం అంటారు), తమపై నుండి సారలమ్మ వెళితే తమ కస్టాలు, అనారోగ్య సమస్యలు తీరుతాయని నమ్మకం. ఇక్కడ కోయలు వాయించే డోళ్ళ సప్పుడు ప్రత్యేకత గా చెప్పవచ్చు. సారలమ్మ రాక కు ఒక గంట ముందు నుండే వాయించే డోలు వాయిద్యాలు హోరు, అక్కడి వాతావరణాన్ని ఒక తన్మయంలోకి తీసుకెళ్లేవిధంగా ఉంటుంది. శిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండే ఆ మహిళలు, వారిని పట్టుకోలేక ఆశక్తులవుతూండే పురుషులు, ఇక, గుడి వెలుపల ఛత్తీస్ గఢ్ గుత్తి కోయలు తమదైన ప్రత్యేకమైన అలంకారాలు, వేష దారణలతో చేసే నృత్యాలు, చూస్తేనే కానీ వాటిని వివరించలేం.