20 ఏళ్ల ప్ర‌స్థానం – టీఆర్ ఎస్ పార్టీ గెలుపోట‌ముల క‌థ‌

ఎన్నో గెలుపోట‌ములు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు. ఏం చేయ‌గ‌ల‌రులే అనే ద‌గ్గ‌ర్నుంచి రాష్ట్రం సాధించే వ‌ర‌కు.. వ‌రుస‌గా రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర‌స‌మితి 20 ఏళ్ల ప్ర‌స్ధానాన్ని పూర్తిచేసుకోబోతోంది. ఈ నేప‌ధ్యంలో తెరాస పార్టీపై హ్యాష్‌టాగ్‌యూ ప్ర‌త్యేక క‌థ‌నం.

  • Written By:
  • Publish Date - October 24, 2021 / 08:00 AM IST

అది 2001, ఏప్రిల్ 27. అప్ప‌టి రాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న వెంట న‌డిచేవాళ్లు వేళ్ల‌మీద లెక్క‌బెట్ట‌గ‌లిగినంత‌మంది ఉన్న‌ప్ప‌టికీ కూడా ఒక సాహ‌సోపేత ఆలోచ‌న చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో మంచి ఊపుమీద ఉన్న స‌మ‌యంలో మ‌రో ప్రాంతీయ పార్టీకి పునాది వేశారు. అదే తెలంగాణ రాష్ట్ర స‌మితి.

ఒక‌టే ఆలోచ‌న‌. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి. ఇదే తెలంగాణ రాష్ట్ర‌స‌మితి జెండా, అజెండా. అనర్ఘళంగా గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడ‌టం, గ్రేట్ ఒరేట‌ర్‌గా పేరున్న కేసీఆర్‌.. నీళ్లు, నిధులు, నియామ‌కాల్లో తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని జ‌నంలోకి తీసుకెళ్లాల‌న్న ప్ర‌ధాన ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేశారు.

అప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుగులేని పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక‌వైపు, అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మ‌రోవైపు.. ఇలాంటి పొలిటిక‌ల్ సినేరియో ఉన్న రాష్ట్రంలో మ‌రొ కొత్త ప్రాంతీయ పార్టీ వ‌స్తుంద‌ని ఎవ‌రూ కూడా ఊహించ‌లేదు. కానీ.. కేసీఆర్ ఆలోచ‌న మ‌రో విధంగా ఉంది. ఆయ‌న ప్లాన్ వేరు. ప్రాంతీయ వాదాన్ని బ‌లంగా వినిపించి.. లీడ‌ర్ల‌ను త‌న‌వెంట న‌డిచేలా చేయ‌డంతోనే కేసీఆర్ మొద‌టి స‌క్సెస్ సాధించారు. ఆంధ్ర పాల‌కుల దౌర్జ‌న్యం అంటూ ఆయ‌న చేసిన స్పీచ్‌లు, ప్ర‌క‌ట‌న‌లు జ‌నాన్ని ఆలోచ‌న‌లో ప‌డేశాయి.

1956 పెద్ద‌మ‌నుషుల ఒప్పందాన్న ఉల్లంఘిస్తూ తెలంగాణేత‌రులు చేస్తున్న దౌర్జ‌న్యాల‌ను, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నిధులు, నీళ్లు, నియామ‌కాల్లో జ‌రుగుతున్న అన్యాయాలే ప్ర‌ధాన అజెండాగా మ‌రో ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్‌. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌లాంటి మేధావివ‌ర్గం స‌పోర్ట్‌తో తెలంగాణ ప్ర‌జ‌ల్లో మళ్లీ ఆశ‌లు చిగురించ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

2004లో కాంగ్రెస్‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీఆర్ ఎస్‌.. 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు గెల‌చుకుని తెలంగాణ రాజ‌కీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌త్యేక తెలంగాణ కోసం స్ధానికులు ఎంత‌గా ఎదురుచూపుల‌ను ఈ ఫ‌లితాలు ప్ర‌తిబింబించ‌డంతో రాష్ట్రపొలిటిక‌ల్ సినేరియో ఒక్క‌సారిగా మారిపోయింది. కేంద్రంలోని యూపీయే స‌ర్కార్‌లో కేసీఆర్‌కు కేంద్ర కార్మిక ఉపాధిశాఖ మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

అప్ప‌టికే టీఆర్ ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్ట‌డంతో టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ఎల‌య‌న్స్‌లో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. 2008లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుకున్నన్ని సీట్లు గెల‌వ‌లేక‌పోయింది.

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తివ్వాల‌న్న ఒకే ఒక్క ష‌ర‌త్తుతో త‌ర్వాత సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి పోటీ చేసిన టీఆర్ ఎస్, కాంగ్రెస్‌ను పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేసింది. అయితే, అనూహ్యంగా కేవ‌లం 10 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌స‌భ సీట్లు మాత్ర‌మే గెలుచుకోవ‌డంతో టీడీపీ టీఆర్ ఎస్ కూట‌మి ఓట‌మి పాలైంది. ఈ ఓట‌మే మ‌లి తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసింద‌ని చెప్పుకోవ‌చ్చు. విద్యార్ధులు, యూనియ‌న్ నేత‌లు, సాధార‌ణ ప్ర‌జానీకాన్ని కూడ‌గ‌ట్ట‌డంలో స‌క్సెస్ అయిన టీఆర్ ఎస్ .. యూపీఏ 2పై ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగ‌ని పోరాటాన్ని మొద‌లుపెట్టింది. కేసీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌తో ఉద్య‌మం మ‌రింత‌గా తీవ్ర‌మైంది.

రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు తీవ్ర‌మ‌వ‌డంతో యూపీయే 2 ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వ‌చ్చింది. విద్యార్ధులే ముందుండి న‌డిపించిన ఈ ఉద్య‌మంతో దిగివ‌చ్చిన కేంద్ర‌ప్ర‌భుత్వం 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వ‌డానికి అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను రెండు ముక్క‌లుగా విభ‌జించి.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ఏర్పాటుకు బిల్లు, 2014 ఫిబ్ర‌వ‌రి 14న పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందింది. నాలుగు నెల‌ల త‌ర్వాత జూన్ 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింది. ఆ త‌ర్వాత జ‌రిగిన మొట్ట‌మొద‌టి ఎన్నిక‌ల్లో 119 అసెంబ్లీ స్ధానాల‌కు గాను 63 స్ధానాలు గెలుచుకున్న టీఆర్ ఎస్‌.. తిరుగులేని శ‌క్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

రాష్ట్రంలో వ్య‌వ‌సాయం, విద్యుత్‌పై ఫోక‌స్ పెట్టిన టీఆర్ ఎస్‌.. వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డంలోస‌క్సెస్ అయింది. ఆ త‌ర్వాత ఏడాది ర‌బీ పంట‌లో ఏకంగా కోటి ట‌న్నుల ధాన్యం పండించి.. స‌త్తా చాటింది న‌వ తెలంగాణ . అయితే, టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు టీఆర్ ఎస్ అవ‌లంబించిన విధానాల‌పై అప్ప‌ట్లో కాస్త వ్య‌తిరేక‌త వ‌చ్చింది. రెండో అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి ఇత‌ర పార్టీల‌కు చెందిన ఏకంగా 20మంది ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలోకి తీసుకువ‌చ్చి అస‌లు రాష్ట్రంలో అపోజిష‌నే లేకుండా చేశారు కేసీఆర్‌.

మ‌రోవైపు, తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వాయిస్‌లు కూడా అంతే క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ వ‌చ్చాయి. ధ‌ర్నాచౌక్‌ను మూసివేసిన తెలంగాణ స‌ర్కార్‌పై ప్ర‌జాసంఘాలు పెద్ద ఎత్తున పోరాట‌మే చేశాయి.

20 ఏళ్ల ప్ర‌స్ధానంలో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర‌స‌మితి ఆర్ధికంగా, రాజ‌కీయంగా ఎన్నో ఆటుపోట్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ త‌న శ‌క్తుల‌న్నీ ఒడ్డుతుంటే. . పూర్వ‌వైభ‌వం కోసం కాంగ్రెస్ పార్టీ నానా క‌ష్టాలూ ప‌డుతోంది.

అతిత్వ‌ర‌లో త‌న త‌న‌యుడు కేటీఆర్‌కు ప‌గ్గాలు అప్ప‌జెప్ప‌డానికి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా పావులు క‌దుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఇన్నాళ్లూ ఎదురులేని శ‌క్తిగా ఉన్న టీఆర్ ఎస్‌కు ఈ ఎన్నిక‌లు మాత్రం క‌త్తిమీద సామే! మ‌రి కేసీఆర్ వీటిని ఎదుర్కోంటారో వేచి చూడాల్సిందే!