USA Vs Pak : పాక్‌కు షాక్.. ఎన్నికలపై దర్యాప్తు కోరుతూ అమెరికా తీర్మానం

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చే కీలక పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది.

  • Written By:
  • Updated On - June 27, 2024 / 01:00 PM IST

USA Vs Pak : పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చే కీలక పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై  సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇటీవలే జరిగిన  ఎన్నికలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్ల నడుమ నలుగుతూ బిక్కుబిక్కుమని జీవిస్తున్న పాకిస్తానీల భవిష్యత్తును పరిరక్షించాలనే ఏకైక సంకల్పంతోనే ఈ తీర్మానాన్ని ఆమోదించామని అమెరికాలోని కీలకమైన రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీల నేతలు(USA Vs Pak) తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

అమెరికా ప్రతినిధుల సభ చేసిన ఈ తీర్మానంలో పలు సంచలన అంశాలను ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల టైంలో చాలా అన్యాయాలు, అవకతవకలు జరిగాయి.  ఎన్నికల్లో ప్రజలు పాల్గొనకుండా బెదిరించారు. హింసకు పాల్పడ్డారు. చాలామందిని నిర్బంధించారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు.వీటిని ఎవరూ అంగీకరించలేరు’’ అని తీర్మానంలో అమెరికా రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చాలా అవసరమని తెలిపాయి. పాకిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు కోసం చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు పేర్కొన్నాయి.

Also Read :Telugu – US: గుడ్ న్యూస్.. అమెరికాలో తెలుగుభాషకు 11వ ర్యాంక్

అమెరికా ప్రతినిధుల సభ చేసిన ఈ  తీర్మానంపై పాకిస్తాన్ మండిపడింది. పాకిస్తాన్‌ పరిస్థితులపై, స్థానిక రాజకీయాలపై అమెరికాకు, అక్కడి రాజకీయ పార్టీలకు అవగాహన లేదని పేర్కొంది. అవగాహన లేకుండా చేసిన తీర్మానాలను తాము పట్టించుకోమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికాతో తాము సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని.. ఇలాంటి మంచి తరుణంలో ప్రతికూలంగా తీర్మానాలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, చట్టబద్ధ పాలనకు పాకిస్తాన్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది. కాగా, ఇటీవలే పాకిస్తాన్ ఎన్నికల టైంలో ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో నిర్బంధించారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా.. దాన్ని రద్దు చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. వీరికే మెజారిటీ స్థానాలు వచ్చాయి. అయితే వీరు ఇండిపెండెంట్లు కావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కలేదు. ఇదే అదునుగా నవాజ్ షరీఫ్ రాజకీయ పార్టీ, ఆసిఫ్ అలీ జర్దారీ రాజకీయ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Also Read :Owaisi – Jai Palestine : ఒవైసీపై అనర్హత వేటు వేయండి.. రాష్ట్రపతికి న్యాయవాది ఫిర్యాదు