Moon Secret: చంద్రుడికి మరో ముఖం .. డార్క్ సీక్రెట్ బట్టబయలు!!

"చందమామ లాంటి ముఖం" అనే పదాన్ని అందానికి సంబంధించిన వర్ణనల కోసం వాడుతుంటారు. అంతటి అందమైన చంద్రుడి పైనే నల్లటి మచ్చలు కనిపిస్తాయి. మరి.. చంద్రుడి వెనుక భాగంలో కూడా ఇలాంటి నల్ల మచ్చలు ఉంటాయా ? అంటే ..

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 01:10 PM IST

“చందమామ లాంటి ముఖం” అనే పదాన్ని అందానికి సంబంధించిన వర్ణనల కోసం వాడుతుంటారు. అంతటి అందమైన చంద్రుడి పైనే నల్లటి మచ్చలు కనిపిస్తాయి. మరి.. చంద్రుడి వెనుక భాగంలో కూడా ఇలాంటి నల్ల మచ్చలు ఉంటాయా ? అంటే .. అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం లో “ఉండవు” అని వెల్లడైంది. చంద్రుడి అందానికి వంక పెట్టడానికి కారణమైన ఆ మచ్చలు ఎలా ఏర్పడ్డాయి ? ఎందుకు ఏర్పడ్డాయి ? అనే ఆసక్తికర వివరాలను పరిశోధకులు గుర్తించారు. వివరాలు ఇవీ..

వెనుక విభిన్నం..

మన ముఖానికి ముందు, వెనుక భాగాలలాగా.. చందమామ ముఖానికి కూడా ముందు, వెనుకలు ఉన్నాయా ? చందమామ ముందు భాగాన్ని మనం చూడగలుగుతాం.. మనం చూడలేని చందమామ వెనుక భాగం ఎలా ఉంటుంది ? అనే ప్రశ్న కు అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం లో ఒక స్పష్టత వచ్చింది. చంద్రుడి ముందు భాగంతో పోలిస్తే.. వెనుక భాగం విభిన్నంగా ఉంటుందని వారు గుర్తించారు. చంద్రుడి ముందు భాగంలో మనకు మచ్చలు కనిపిస్తుంటాయి. ఈ మచ్చలు వెనుక భాగంలో అస్సలు ఉండవని పరిశోధకులు వెల్లడించారు. చంద్రుడి రెండు ముఖాల్లో ఈ తేడా ఎందుకు వచ్చింది ? ఎలా వచ్చింది ? అనేది తెలుసుకునేందుకు పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేశారు. దీంతో ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

4.3 బిలియన్ ఏళ్ల క్రితం..

1 బిలియన్ సంవత్సరాలు అంటే 100 కోట్ల ఏళ్ళు. దాదాపు 4.3 బిలియన్ ఏళ్ల క్రితం ఒక గ్రహ శకలం చంద్రుడిని ఢీకొట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. దీనివల్లే మనకు కనిపించే చంద్రుడి ముఖంలో పెద్ద పెద్ద నల్ల మచ్చలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఆ గ్రహ శకలం ఢీకొట్టడంతో చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో “సౌత్ పోల్-ఏట్కెన్ బేసిన్ ” అనే లోతైన కందకం ఏర్పడింది. ఇది దాదాపు 2,500 కిలోమీటర్ల వ్యాసం, 12 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఈ భారీ కందకం ఏర్పడే క్రమంలోనే చంద్రుడి ఉపరితలం పై మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రహ శకలం ఢీకొట్టగానే.. ఏర్పడిన భారీ ఉష్ణ కెరటం చంద్రుడి ని చుట్టుముట్టి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. మనకు అందరికీ కనిపించే చంద్రుడి ముఖం భాగంలో పొటాషియం, టైటానియం, థోరియం, ఫాస్ఫరస్ వంటి మూలకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఉష్ణ కెరటం ఉధృతి కారణంగా చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి ముందు ముఖంపైకి ఎన్నో లవణాలు చేరాయని విశ్లేషించారు. ఈ లవణాలు.. చంద్రుడి ముందు భాగంలోని టైటానియం, థోరియం వంటి మూలకాలతో రసాయన చర్య జరిపి.. లావా ప్రవాహాలను సృష్టించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఆనాడు ఏర్పడిన లావా ప్రవాహాలు ఘనీభవించిన ప్రాంతాలే..ఇప్పుడు మనకు చంద్రుడి పై కనిపిస్తున్న నల్లటి మచ్చలు అని చెప్పారు. చంద్రుడి వెనుక భాగంలో టైటానియం, థోరియం వంటి మూలకాలు లేకపోవడంతో ఆ ప్రాంతంలో లావా ప్రవాహాలు ఏర్పడి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.బ్రౌన్ యూనివర్సిటీతో పాటు.. ప్రూడ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆరిజోనాలోని లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ లేబరేటరీ, నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి.