KKR Beat RCB : బెంగళూరును తిప్పేశారు.. కోల్ కతాకు తొలి విజయం

RCB Beats KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

  • Written By:
  • Publish Date - April 6, 2023 / 11:20 PM IST

RCB Beats KKR: ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్ లో శార్థూల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్స్ తో ఆదుకుంటే.. బౌలింగ్ లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తిప్పేశారు.

89 పరుగులకు 5 వికెట్లు.. ఇదీ ఒక దశలో కోల్ కతా నైట్ రైడర్స్ పరిస్థితి. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒకవైపు క్రీజులో ఉన్న వికెట్ కీపర్ గుర్బాజ్ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచుతున్న…మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. వెంకటేశ్ అయ్యర్ 3 , నితీశ్ రాణా 1 పరుగుకే ఔటవగా.. మణ్ దీప్ , రస్సెల్ డకౌటయ్యారు. ఆండ్రూ రస్సెల్ డకౌటైన తర్వాత కోల్ కతా స్కోర్ కనీసం 150 కూడా దాటించేలా కనిపించ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జట్టును శార్థూల్ ఠాకూర్ ఆదుకున్నాడు. భారీ షాట్లతో చెలరేగిపోయాడు. ఎటాకింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టిన శార్థూల్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రధాన బ్యాటర్ లా ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రింకూ సింగ్ కూడా మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో రింకూ సింగ్ ఔటవ్వడంతో ఆరో వికెట్ కు నమోదైన 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి ఓవర్‌లో సిరాజ్ 12 పరుగులివ్వడంతో కేకేఆర్ 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. శార్థూల్ 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేయగా…రింకూ సింగ్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 రన్స్ చేశాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ, డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్యఛేదనలో బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 4.5 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో బెంగళూరు ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఒకవైపు నరైన్, మరోవైపు వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ తో తిప్పేశారు. కోహ్లీ, డుప్లెసిస్ , మాక్స్ వెల్, హర్షల్ పటేల్ , షాబాద్ అహ్మద్, బ్రేస్ వెల్ ఇలా వరుసగా కీలక వికెట్లను పడగొట్టేశారు. కోల్ కతా స్పిన్ ను ఏ మాత్రం ఆడలేకపోయిన బెంగళూరు కేవలం 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. తర్వాత టెయిలెండర్లు కాసేపు క్రీజులో నిలవడంతో స్కోర్ 100 దాటగలిగింది. కోహ్లీ 23 , డుప్లెసిస్ 21 పరుగులు చేయగా.. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. దీంతో కోల్ కత్తా 123 పరుగులకు కుప్పకూలింది.
కోల్ కతా స్పిన్నర్ 19 ఏళ్ళ సుయూష్ శర్మ కూడా తన స్పిన్ మ్యాజిక్ చూపించి 3 వికెట్లు పడగొట్టాడు. నరైన్ 2 , వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్ లో కోల్ కతాకు ఇదే తొలి విజయం.