Isro Aditya L1 Mission : ఆదిత్య L1 కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఇస్రో.. సెప్టెంబర్ 2న ప్రయోగం

ఇప్పుడు సూర్యుడి(Sun)పై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో(ISRO). ఈ మేరకు ఇస్రో రూపొందించిన ఆదిత్య L1 ను సూర్యుడిపై ప్రయోగించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 07:29 PM IST

చంద్రుడి(Moon)పై పరిశోధనలు చేసేందుకు రెండుసార్లు విఫలమై.. మూడోసారి చంద్రయాన్-3 (Chandrayaan 3)ను ప్రయోగించి.. చరిత్ర సృష్టించిన ఇస్రో(Isro) యావత్ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సూర్యుడి(Sun)పై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో(ISRO). ఈ మేరకు ఇస్రో రూపొందించిన ఆదిత్య L1 ను సూర్యుడిపై ప్రయోగించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపింది. పీఎస్ఎల్ వీ- సీ 57 (PSLV -C57) రాకెట్ దీనిని నింగిలోకి మోసుకెళ్లనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేస్తున్న తొట్ట తొలి ప్రయోగమిదీ.

కరోనాగ్రఫీ అనే వస్తువు సహాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా శోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై ఇస్రో ఈ అధ్యయనాన్ని చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రయోగాన్ని సాధారణ ప్రజలు కూడా వీక్షించవచ్చని, అందుకు ఆగస్టు 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇస్రో అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

ఆదిత్య L1 గురించి మరిన్ని విశేషాలు..

పీఎస్ఎల్ వీ- సీ 57 (PSLV -C57) రాకెట్ మోసుకెళ్లే ఆదిత్య L1 శాటిలైట్ బరువు సుమారు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్ పాయింట్ 1(L1 ) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దీనిని ప్రవేశపెట్టనున్నారు. గ్రహణాలతో సంబంధం లేకుండా ఇది సూర్యుడిపై నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా ఉంటుంది.

ఆదిత్య L1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్లనుంది. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ ప్రధానమైనది. అలాగే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్ లను అమర్చనున్నారు.

ఈ పేలోడ్ లను సూర్యుడి నుంచి వెలువడే అతిశక్తివంతమైన కిరణాలను తట్టుకుని అధ్యయనం చేసేవిధంగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలో పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.

 

Also Read : ISRO First Solar Mission : సూర్యుడిపై రీసెర్చ్ కు ఇస్రో  శాటిలైట్..  ‘ఆదిత్య-ఎల్‌ 1’