Site icon HashtagU Telugu

Afghanistan Floods : ఆఫ్ఘనిస్తాన్‌లో పోటెత్తిన వరదలు.. 60 మంది మృతి

Afghanistan Floods

Afghanistan Floods

Afghanistan Floods : అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్తాన్‌ను భూకంపాలు, వరదలు వణికిస్తున్నాయి. గత నెలలో భారీ వర్షాలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 70 మంది చనిపోగా.. తాజాగా బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలకు మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో  భారీ ఆస్తి నష్టం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join

అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల వరదలు(Afghanistan Floods) పోటెత్తాయని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వరదలతో బాగ్లాన్ ప్రావిన్స్‌లోని ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. 150 మందికిపైగా ప్రజలు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయన్నారు.

Also Read : Election Effect : ఓటు కోసం సొంతూళ్లకు.. హైదరాబాద్​ – విజయవాడ హైవేపైకి పోటెత్తిన వాహనాలు

రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సహాయక చర్యల కోసం రాజధాని కాబూల్‌ నుంచి బాగ్లాన్‌కు హెలికాప్టర్లను పంపామని వెల్లడించారు. వరదలతో నిరాశ్రయులైన వారికి  టెంట్లు, దుప్పట్లు, ఆహారం పంపిణీ చేసినట్లు  అధికారులు చెప్పారు. ఈ వరదల కారణంగా రాజధాని కాబూల్‌ను ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌‌తో కలిపే ప్రధాన రహదారి మూతపడిందన్నారు. గత నెలలో దేశంలో సంభవించిన వరదల వల్ల దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉంది. దశాబ్దాల యుద్ధం కారణంగా ఈ దేశం బాగా దెబ్బతింది.  2000 సంవత్సరం నుంచి 2021 వరకు ఇక్కడ అమెరికా ఆర్మీ స్థావరం ఉండేది. 2021 అమెరికా ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టారు.