Site icon HashtagU Telugu

EIL Explained : ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌.. ఎంతో పర్ఫెక్ట్.. మరేమైంది ?

Biggest Train Accidents

Biggest Train Accidents

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ(EIL Explained)లో మార్పులు జరిగినందు వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తుది నివేదిక వచ్చాక కారణం తెలుస్తుందని రైల్వే మంత్రి చెప్పారు. ఇంతకీ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రాకుండా..

ఏకకాలంలో ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రాకుండా కచ్చితమైన  సిగ్నలింగ్ ద్వారా ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ(EIL Explained) పహారా కాస్తుంది. ట్రైన్ వెళ్లే ట్రాక్ మార్గం పూర్తిగా క్లియర్ గా ఉందని తనిఖీల్లో తేలేవరకు.. ఇది రైలుకు సిగ్నల్స్‌ ఇవ్వకుండా ఆపి ఉంచుతుంది. ట్రైన్స్ కు ఇచ్చే సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటం ఈ వ్యవస్థ ప్రాథమిక విధి. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన తర్వాతే రైళ్లు ఢీకొనడాలు, ప్రమాదాలు బాగా తగ్గాయి. రైళ్ల కదలికల పర్యవేక్షణ, నియంత్రణకు ఈ వ్యవస్థ కంప్యూటర్లను వినియోగించుకొంటుంది. అంతకుముందు ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ మాన్యూవల్‌ గా ఉంటుంది. గతంలో రాడ్లు, స్విచ్‌లతో సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసేవారు.

Also read : Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతులకు ఊరట కల్పించిన ఎల్ఐసి.. ఆ సర్టిఫికెట్లు అవసరం లేదంటూ?

సెన్సర్లు, ఫీడ్‌ బ్యాకింగ్‌ పరికరాలతో.. 

ట్రాక్‌పై రైళ్ల లొకేషన్లను గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌ బ్యాకింగ్‌ పరికరాలను ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వినియోగించుకుంటుంది. ట్రైన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, సిగ్నల్స్‌, పాయింట్స్‌, ట్రాక్‌ సర్క్యూట్స్‌ వంటి వాటితో అనుసంధానమై ఇది పనిచేస్తుంది. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఒకే రైల్వే ట్రాక్ పైకి రెండు రైళ్లు రాకుండా చూస్తుంది. రూట్‌ సెట్టింగ్‌, రూట్‌ రిలీజ్‌, పాయింట్‌ ఆపరేషన్స్‌, ట్రాక్‌ ఆక్యూపెన్సీ మానిటరింగ్‌, ఓవర్‌లాప్‌ ప్రొటెక్షన్‌, క్రాంక్‌ హ్యాండిల్‌ ఆపరేషన్స్‌, లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌ ఇంటర్‌లాకింగ్‌, ప్రొవిజన్‌ ఫర్‌ బ్లాక్‌ వర్కింగ్‌ వంటి పనులన్నీ కూడా ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ పరిధిలోనే జరుగుతాయి.

ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ లో ప్రాబ్లం వస్తే.. ఓన్లీ రెడ్ సిగ్నల్

ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి వైరింగ్ ను ముట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఈజీగా దానిలో మార్పులు చేయొచ్చు. ఈ సిస్టం సాధారణంగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఏదైనా రైల్వే స్టేషన్ పరిధిలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ లో ప్రాబ్లం వస్తే.. రెడ్ సిగ్నల్ వస్తుంది. అంతే తప్ప గ్రీన్ సిగ్నల్ వచ్చే ఛాన్స్ ఉండదు. కేవలం మానవ తప్పిదం లేదా మానవ జోక్యంతో మాత్రమే రైలుకు రాంగ్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. “శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్ వద్ద లూప్ లైన్ లో అప్పటికే గూడ్స్ రైలు ఒకటి పార్క్ చేసి ఉంది. అయితే అదే లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వెళ్లేలా ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ తప్పుడు సిగ్నల్ ఇవ్వడం అసాధ్యం. మానవ జోక్యం లేదా మానవ తప్పిదం వల్లే ఆ లూప్ లైన్ లో గ్రీన్ సిగ్నల్ పడి ఉంటుంది. దాని పర్యవసానంగానే మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది” రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కేబుల్స్ తెగినా.. షార్ట్ సర్క్యూట్ జరిగినా.. ఓన్లీ రెడ్ సిగ్నల్

” ఘోర రైలు ప్రమాదం జరిగిన బహనాగ రైల్వే స్టేషన్ దగ్గర్లో లెవల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన ప్రాంతంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థకు సంబంధించిన కేబుల్ ఏదైనా తెగిపోయిందా ? కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ కు గురయ్యాయా ? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ ఆ కేబుల్స్ లో ఫాల్ట్ ఏర్పడినా.. ప్రాబ్లమ్ ఏర్పడినా సిగ్నల్ రెడ్ లోకి మాత్రమే మారుతుంది. రాంగ్ సిగ్నల్ మాత్రం రాదు. అదే ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ ప్రత్యేకత. రెడ్ సిగ్నల్ కాకుండా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే అది మానవ జోక్యం లేదా మానవ తప్పిదం వల్లే కావచ్చు” అని రైల్వే అధికార  వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version