Aurangzeb : ఆ చక్రవర్తి అసలు పేరు ఔరంగజేబ్ కాదు.. ఈ పేరు వెనుక ఉన్న కథ గురించి తెలుసా ?

ఆయన పొగ ఎందుకు రావట్లేదని ఆరా తీసిన చోట ఒక చిన్నగుడి ఉంది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు నివసిస్తూ.. ప్రతిరోజూ భిక్షాటన చేసుకుని జీవిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 06:00 AM IST

Aurangzeb : ఔరంగజేబు.. ఈ పేరును చిన్నప్పటి నుంచీ వినే ఉంటారు. కాదు..కాదు.. చదువుకుని ఉంటారు. కానీ నిజానికి ఆ మొఘల్ చక్రవర్తి పేరు ఔరంగజేబు కాదు. అసలు పేరు ముజఫర్ మొహియొద్దీన్ అలంఘీర్. మరి ఈ ఔరంగజేబు అనే పేరు ఎలా వచ్చింది ? అసలు పేరు ఎందుకు మరుగున పడిపోయింది ? తెలియాలంటే ఒక్కసారి మన చరిత్రలోకి వెళ్లాలి.

దక్కన్ దండయాత్రకు తరలివచ్చిన మొఘల్ చక్రవర్తి.. నేడు మనం ఔరంగాబాద్ అని పిలుచుకుంటున్న ప్రాంతంలో ఉండేవాడు. చక్రవర్తి నివసించే మహల్.. అక్కడి షాహీ మసీదు పక్కనే ఉండేది. రాత్రివేళ, ఉదయం పూట కాస్త చల్లగాలికి పైన తిరిగే చక్రవర్తికి అల్లంత దూరంలో పొగలు పైకిలేస్తూ కనిపించేవి. ఆ పొగలేంటని ఆరా తీయగా కొందరు అక్కడ వంట చేసుకుంటున్నారని భటుల ద్వారా తెలిసింది. అయితే.. అదే వరుసలో కొన్ని ఇళ్లు ఉండగా అక్కడి నుంచి పొగరాకపోవడంతో.. వాళ్లు వంట చేసుకోరా ? అని వాకబు చేశాడు.

ఆయన పొగ ఎందుకు రావట్లేదని ఆరా తీసిన చోట ఒక చిన్నగుడి ఉంది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు నివసిస్తూ.. ప్రతిరోజూ భిక్షాటన చేసుకుని జీవిస్తుంటారు. కాబట్టి వారు వంట చేసుకోరు అని భటులు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి మనసు చిన్నపోయింది. మహల్ కు కూతవేటు దూరంలోనే ఇంత దారిద్య్రం ఉందని తెలిసి బాధపడ్డాడు. వెంటనే వారందరికీ భోజనశాల ఏర్పాటు చేయించి.. వారే ఆహారం వండుకునే ఏర్పాట్లు చేయించాడు. దాంతో అక్కడ ఉంటున్న బ్రాహ్మణులంతా సంతోషించారు. తాము నివాసం ఉండే ప్రాంతంనుంచీ పొగ రాకపోవడాన్ని గమనించి.. తమ ఆకలి బాధలను తెలుసుకున్న చక్రవర్తి ఔదార్యానికి కృతజ్ఞతా భావం చూపించాలనుకున్నారు.

తాము చేసే భిక్షాటన, పౌరోహిత్యంతో.. తాము ఆర్జించే సంపాదనంతా పోగుచేసి ఆయనకు ఒక బహుమతివ్వాలని నిర్ణయించారు. చక్రవర్తి హోదాకు తగిన సింహాసనాన్ని చేయించాలని నిర్ణయించారు. ఆ సింహాసనం నిండా రంగురంగుల మెరిసే రాళ్లను పొదిగారు. తిరంగ్, నవరంగ్.. ఇలా లెక్కకు మించిన రాళ్లను పొదిగితే ఔరంగ్ అంటారు. జేబ్ అంటే.. పొందినవాడు అని అర్థం. అలా ఆ మొఘల్ చక్రవర్తిపేరు క్రమేణా ఔరంగజేబ్ అయింది. తన తర్వాత ఆ సింహాసనంపై ఎవరు కూర్చుని రాజ్యమేలినా వారు ఔరంగజేబ్ అని పిలువబడతారని చక్రవర్తి అలంఘీర్ ప్రకటించాడు. ఇదన్నమాట ఔరంగజేబ్ అనే పేరు వెనుక ఉన్న అసలు కథ.