Site icon HashtagU Telugu

Economical Houses: రూ.2.34 లక్షలకే సొంతిల్లు.. ఎన్‌ఐఆర్‌డీలో నమూనా ఇల్లు నిర్మించిన ప్రభుత్వం

Model House

Model House

సొంతింటి కోసం చాలామంది ఎన్నో కలలు కంటారు. కానీ ఈ రోజుల్లో కేవలం ఇల్లు కట్టాలంటేనే ఎలా లేదన్నా తక్కువలో తక్కువ రూ.10 లక్షలైనా ఖర్చవుతుంది. అది కూడా సొంత స్థలం ఉంటేనే. కానీ ప్రభుత్వం మాత్రం రూ.2.34 లక్షలకే ఇంటిని నిర్మించింది. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీలోని రూరల్ టెక్నాలజీ పార్కులో దీనిని ప్రదర్శనకు ఉంచింది.

ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గ్రామీణ ప్రాంతాలవారికి కేంద్రం ఇచ్చే ఇళ్లు ఎలా ఉంటాయో చూపించడానికే ఈ మోడల్ హౌస్ ను సిద్ధం చేశారు. అందుకే ఇప్పుడు నగరాల్లో ఉంటున్న చాలామంది ఇలా తక్కువ ఖర్చుతో సొంతూళ్లలో, ఫామ్ హౌసుల్లో ఇళ్లను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈవిధంగా తక్కువ ఖర్చులో ఇంటిని నిర్మించడం కోసం జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ సంస్థలు చాలా పరిశోధనలు చేశాయి.

ఈ ఇంటిలో హాలు, బెడ్రూమ్, కిచెన్, బాత్ రూమ్ ఉంటాయి. పడకగది మాత్రం 342 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. గతంలో రాళ్లతో పునాదిని నిర్మించేవారు. దీనికి కూడా అలాంటి టెక్నాలజీనే వాడారు. స్థానికంగా దొరికే సామగ్రినే నిర్మాణంలో ఉపయోగించారు. ర్యాట్ ట్రాప్ బ్యాండ్ మోడల్ లో గోడలను నిర్మించారు. దీనివల్ల సిమెంటు, ఇసుక వినియోగం తగ్గి ఖర్చు కూడా తగ్గుతుంది.

మట్టి ఇటుకలకు బదులు.. ఫ్లైయాష్ ఇటుకలు వినియోగించారు. పెంకుల శ్లాబును.. అంటే ఫిల్లర్ స్లాబ్ రూఫ్ ను నిర్మించడం వల్ల వేసవిలోనూ ఇల్లు కూల్ గా ఉంటుంది. కేరళలో ఇలాంటి సాంకేతికతనే ఉపయోగిస్తారు. ఇంటి లోపలి గోడల ప్లాస్టరింగ్ అంతా మట్టితోనే చేశారు. ఇక నిర్మాణంలో ప్లైయాష్ ఇటుకల వినియోగం వల్ల ఇంటి బయటి గోడలకు ప్లాస్టరింగ్ అవసరం లేకుండా పోయింది. ఆవుపేడతో తయారుచేసిన పెయింట్ నే గోడలకు వేశారు.

తాండూరు బండలతోనే గచ్చులు చేశారు. వీటివల్ల ఫ్లోరింగ్ కు అందం పెరగడంతోపాటు మెయింటినెన్స్ కాస్ట్ బాగా తగ్గిపోతుంది. పైగా ఇవి రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటిపై 2 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల సగటున రోజూ 8 యూనిట్ల కరెంటు ఉత్పత్తవుతుంది. ఇలాంటి చిన్న ఇంటికి సగటున రోజుకు 4 యూనిట్ల కరెంటు సరిపోతుంది. అంటే ఇంటికి అవసరమైన కరెంటును కూడా సొంతంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ పవర్ తో ఇంట్లో ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు వేసుకోవచ్చు. సోలార్ స్టౌతో వండుకోవచ్చు. ఇవన్నీ రోజంతా ఉపయోగించినా 2 యూనిట్లకు మించి ఖర్చు కాదు. వేసవిలో కాస్త వినియోగం పెరగవచ్చు. రోజూ మిగిలిన కరెంటును గ్రిడ్ కు అనుసంధానించి.. అదనంగా ఆదాయాన్ని కూడా పొందొచ్చు. కాకపోతే ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు మాత్రం అదనంగా రూ.1.06 లక్షల ఖర్చయింది. మొత్తంగా ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.683 ఖర్చు అయ్యింది. అంటే మామూలు ఇంటికి ఇంటీరియర్ కోసం చేసే ఖర్చుతో.. వీళ్లు ఏకంగా ఇంటినే నిర్మించేశారు.

Exit mobile version