National Book Lovers Day 2023 – నేడు జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం

‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు పెద్దలు కందుకూరి

  • Written By:
  • Updated On - August 9, 2023 / 01:33 PM IST

 

ప్రపంచంలో ప్రతి రోజు ఏదొక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత గురించి మాట్లాడుకోవడం…చెప్పడం.. తెలుసుకోవడం చేస్తుంటాం. ఈరోజు (ఆగస్టు 09) కూడా చాల ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ఒకటి జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం (NATIONAL BOOK LOVERS DAY).

ప్రపంచవ్యాప్తంగా పుస్తక ప్రేమికుల దినోత్సవాన్ని ఎవరు ప్రారంభించారో, ఎందుకు ప్రారంభించారో తెలియదు కానీ పుస్తక ప్రేమికుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత మాత్రం పుస్తక పఠన అభ్యాసాన్ని గౌరవించడం, గొప్ప సాహిత్య రచనల వైపు దృష్టిని ఆకర్షించడం మరియు ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని చదవమని ప్రోత్సహించడం అనేది పుస్తక ప్రేమికుల దినోత్సవం లక్ష్యం.

పుస్తకానికి మనిషికి విడదీయరాని బంధం ఉంది..మనిషి ఆలోచనలను మార్చేది పుస్తకం..మనిషిలో తెలివిని బయటకు తీసేది పుస్తకం..సమాజంలోని మంచి, చెడులను చెప్పేది పుస్తకం..పురాణాల గురించి తెలిపేది పుస్తకం..మహానుభావుల పోరాటాలను తెలియజేసేది పుస్తకం..ఇంకా ఎన్నో వాటి గురించి పుస్తకాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. అందుకే ‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు పెద్దలు కందుకూరి వీరేశలింగం పంతులు.. అదీ పుస్తకం గొప్పతనం.

చాలామంది పుస్తక పిచ్చోళ్ళు ఉంటారు. వీరు నిత్యం ఏదొక పుస్తకం ముందేసుకుని చదువుతూనే ఉంటారు. ఆలా పుస్తకాలు చదవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని భావిచడమే కాదు అనేక పరి శోధనల ద్వారా తేటతెల్లమైంది. ఒంటరిగా ఉన్నప్పుడో..ఎటైనా ప్రయాణం చేసేటప్పుడో.. ఏమీ తోచనపుడో నీకు తోడుగా నేనున్నానంటూ నిలిచేది పుస్తకం. అందుకే ఒక మంచి పుస్తకం వందమంది నేస్తాలతో సమానం అని అంటారు.

పుస్తకాల చరిత్ర (National Book Lovers Day)  :

పుస్తకాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఆదిమానవులు.. గుహల్లోని రాళ్లపై రాతలు రాసి, బొమ్మలు వేసేవారు. తద్వారా అవి వారికి తరచూ కనిపిస్తూ విషయాల్ని గుర్తుచేసేవి. కాలక్రమంలో తాళపత్రాలు వచ్చాయి. తాటిచెట్టు ఆకులు, ఇతర ఆకుల్ని ఎండబెట్టి.. వాటిపై సిరాతో రాసేవాళ్లు. తర్వాత చెక్కలను సన్నగా చెక్కి… వాటిపై రాసేవాళ్లు. తర్వాత కాగితాల వాడకం వచ్చింది. ఇది తక్కువ ఖర్చుతో, ఎక్కువ సౌకర్యంతో ఉండటం వల్ల ప్రపంచం మొత్తం ముద్రణ మొదలైంది.

క్రీస్తు శకం 1436లో జర్మనీలో జొహన్నెస్ గుటెన్‌బెర్గ్ (Johannes Gutenberg).. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారు. బైబిల్స్ ముద్రణ కోసం దీన్ని కనిపెట్టినా… తర్వాతి కాలంలో వీటితోపైటూ టైప్ రైటర్లు, కంప్యూటర్లు అన్నీ.. రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి.

ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు..టీవీలు , ఆన్లైన్ గేమ్స్, యూట్యూబ్ మొదలగు వచ్చి పుస్తకాలను చదవడం తగ్గించాయి కానీ..ఒకప్పుడు ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పుస్తకాలను చదువుతారు అనేదాన్ని బట్టి అతని మేధాశక్తిని, ప్రతిభను అంచనా వేసేవారు. ఏ ఇంట్లో చూసిన పుస్తకాలే కనిపించేవి.. ఇంట్లో ఆడ, మగ తేడా లేకుండా కాస్త టైం దొరికిన ఏదొక పుస్తకం చదువుతూ ఉండేవారు. అది రామాయణ, భారత, భాగవతాల వంటి పురాణ ఇతిహాసాలు కావచ్చు, నవలలు, వారపత్రికలు, మాస పత్రికలు కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ప్రస్తుతం కూడా కొంతమంది పుస్తకాలు చదువుతున్నారు కాకపోతే పోటీ పరీక్షలకు సంబదించిన బుక్స్ ను మాత్రమే చదువుతున్నారు. పుస్తకాలు చదవం వల్ల అవగాహన పెరగడమే మాత్రమే కాదు, గొప్ప ఆనందాన్ని కూడా ఇస్తుంది. అందుకే పుస్తకాలు చదవడం అలవాటయినవాళ్లు ఒక వ్యసనం లాగ పుస్తకాలు చదువుతారు.

ఈరోజుల్లో పుస్తక పఠనం బాగా తగ్గించేశారు. మొబైల్స్ వచ్చాక.. వీడియోలు చూస్తూ… కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఎన్ని వీడియో లు చూసిన..పుస్తకాలు చూసి చదివినంత జ్ఞానం రాదు. స్వయంగా చదివినదానికీ, వీడియోలో చూసిన దానికీ చాలా తేడా ఉంటుంది. స్వయంగా చదివేటప్పుడు.. మనకు నచ్చినట్లుగా నెమ్మదిగా చదువుతాం. బ్రెయిన్ బాగా అర్థం చేసుకుంటుంది. ఆలోచిస్తుంది, విశ్లేషిస్తుంది, ప్రశ్నలు లేవనెత్తుతుంది.. ఈ ప్రక్రియ అంతా మన కంట్రోల్‌లో జరుగుతుంది. అదే వీడియోలతో సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే.. ఈ ప్రక్రియ జరగదు. అందుకే మనకు సబ్జెక్ట్ బాగా రావాలంటే.. పుస్తకాలు చదివి.. అర్థం చేసుకొని, విశ్లేషించుకోవడం మంచిది.

ఇక ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం కాబట్టి..మీ స్నేహితులకు ఏదైనా మంచి బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చి చదువుకొమ్మని చెప్పండి. ఎందుకంటే.. మీరు ఇచ్చే బుక్ వారితో ఎప్పటికీ ఉంటుంది. వీలు దొరికినప్పుడు దాన్ని చదువుతారు. అప్పుడు మీరు గుర్తొస్తారు. మీకు కాల్ చేసి మాట్లాడతారు. ఇలా బుక్స్ మనలో స్నేహభావాన్ని పెంచుతాయి. హ్యాపీ ‘NATIONAL BOOK LOVERS DAY’