M.S.Subbulakshmi : సామాన్య కుటుంబం నుంచి సంగీత సామ్రాజ్ఞి దాకా ఎదిగిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

M.S.Subbulakshmi : ఆమె ఆలపించిన శ్రీ వేంకటేశ్వర “సుప్రభాతం” మధురామృతం.. “జ్యో అచ్యుతానంద” అంటూ స్వామివారిని భక్తిపారవశ్య ప్రేమతో నిద్రపుచ్చే కీర్తన కూడా ఆమె పాడిందే..

  • Written By:
  • Updated On - September 16, 2023 / 07:18 AM IST

M.S.Subbulakshmi : ఆమె ఆలపించిన శ్రీ వేంకటేశ్వర “సుప్రభాతం” మధురామృతం.. “జ్యో అచ్యుతానంద” అంటూ స్వామివారిని భక్తిపారవశ్య ప్రేమతో నిద్రపుచ్చే కీర్తన కూడా ఆమె పాడిందే..ఇలాంటి ఎన్నెన్నో కీర్తనలను అందించిన సంగీత ఝరి, వీణావాద్య విద్యాంసురాలు  ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.ఇవాళ (సెప్టెంబరు 16) ఆమె జయంతి. మరే గాయకులకూ సాధ్యం కానన్ని పేరు ప్రతిష్ఠలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి వచ్చాయి. ఇది రాత్రికి రాత్రి జరగలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించిన తర్వాత  ఈవిజయం వచ్చింది. ‘నువ్వు పలికే తెలుగు పదాల్లో ఉచ్ఛారణ దోషాలున్నాయి’ అని బెంగుళూరు నాగరత్నమ్మ ఒక కార్యక్రమంలో సుబ్బులక్ష్మికి చెప్పారు.  ఈ మాట విన్న తర్వాత సుబ్బులక్ష్మికి పట్టుదల పెరిగింది. ఎంతో సాధన చేసి ఆ లోపాన్ని ఆమె అధిగమించారు. ఐదేళ్ళ తర్వాత అదే బెంగుళూరు నాగరత్నమ్మ నుంచి ప్రశంసలు అందుకున్నారు. వేంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామ స్తోత్రం ..ఇంకా ఎన్నో ఎన్నెన్నో సుబ్బులక్ష్మి గొంతు నుంచి జాలువారినవే. సుబ్బులక్ష్మి 72 ఏళ్ళ వయసులోనూ నిత్యవిద్యార్థిలా 72 మేళకర్త రాగమాలికను నేర్చుకుని రికార్డును క్రియేట్ చేశారు.నిద్ర, తిండి లాంటి కనీస అవసరాలకు సమయం కేటాయిచడం తప్ప.. రోజంతా ఆమె సంగీత సాధన చేసిన సందర్భాలెన్నోఉన్నాయట.

Also read : New Parliament House: కొత్త పార్లమెంట్‌ భవనంలో మంత్రులకు గదులు కేటాయింపు..!

తమిళనాడు మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న సుబ్బులక్ష్మి జన్మించారు. సుబ్బులక్ష్మిని ఆమె తల్లి ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. ఆమెకు సంగీతంలో ఆది గురువు అమ్మే. పదేళ్ళ వయస్సులోనే సుబ్బులక్ష్మి సంగీత ప్రస్థానం (M.S.Subbulakshmi) ప్రారంభమైంది. ఏ కారణం లేకుండా తనను టీచరు కొట్టడంతో సుబ్బులక్ష్మికి కోపం వచ్చింది. దీంతో బడి మానేశారు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో ఆమె తొలి సంగీత ప్రదర్శన ప్రారంభమైంది.

నెహ్రూ ప్రశంసలు

భారత సాంస్కతిక రాయబారిగా లండన్‌, న్యూయార్క్‌, కెనెడా, తూర్పుతీర దేశాల్లో సుబ్బులక్ష్మి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1997లో భర్త సదాశివం మరణం తరువాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మానేశారు. సుబ్బలక్ష్మి గాత్ర మాధ్యుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా, ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ సుస్వర లక్ష్మిగా కొనియాడారు. నుదుటిపై కుంకుమతో, తలలో ఎప్పుడూ మల్లెపూలతో గొంతెత్తి పాడుతున్న ఆమె ఆహార్యం భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంది. 2004 డిసెంబర్ 11న చెన్నైలో  సుబ్బులక్ష్మి కన్నుమూశారు.