Mother’s Day: అమ్మంటే అనుబంధం.. ఆ పిలుపే అమృతం

ఆకలేస్తే పిలిచే మొదటి పిలుపు... అమ్మ. దెబ్బ తగిలితే నోరు పలికే తొలి పిలుపు... అమ్మ. నొప్పి కలిగితే అప్రయత్నంగా వచ్చే పిలుపు.. అమ్మ. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ప్రేమ కలిగినా.. ఇలా ఏం చేసినా.. తోడు నీడగా వెన్నంటి నిలిచేది.. అనుక్షణం కనిపెట్టుకుని ఉండేది.. అమ్మ.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 11:07 AM IST

ఆకలేస్తే పిలిచే మొదటి పిలుపు… అమ్మ. దెబ్బ తగిలితే నోరు పలికే తొలి పిలుపు… అమ్మ. నొప్పి కలిగితే అప్రయత్నంగా వచ్చే పిలుపు.. అమ్మ. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ప్రేమ కలిగినా.. ఇలా ఏం చేసినా.. తోడు నీడగా వెన్నంటి నిలిచేది.. అనుక్షణం కనిపెట్టుకుని ఉండేది.. అమ్మ. నిజం చెప్పాలంటే అమ్మ అనే పిలుపే అమృతం. అలాంటి అమ్మ జీవితంలో ప్రతీక్షణం బిడ్డల కోసమే కేటాయిస్తుంది. తన ఇష్టాయిష్టాలన్నింటినీ
వారితోనే పంచుకుంటుంది. తన భవిష్యత్తునూ వారిలోనే చూసుకుంటుంది. అలాంటి అమ్మకోసం ఏడాదిలో ఒక్క రోజైనా కేటాయించలేమా? అందుకే మదర్స్ డే వచ్చింది. అమ్మకోసం.. అమ్మకు ప్రేమను పంచివ్వడం కోసం ఏర్పాటు చేసిందే మదర్స్ డే.

పిల్లలపై తల్లి ప్రభావం ఎంతగానో ఉంటుంది. బిడ్డలకు తొలి గురువు ఆమ్మనే. యవ్వనంలో ఆమెనే మార్గదర్శకురాలు. మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్ కూడా. సంస్కారం నేర్పిస్తుంది. మన సంప్రదాయాలు భావి తరాలకు అందించేలా బిడ్డలకు వాటిని ఒంటబట్టిస్తుంది. అందుకే ఎన్ని వేల సంవత్సరాలైనా మన సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం అమ్మనే. బిడ్డల్లో ఆత్మవిశ్వాసం నూరిపోస్తుంది. ఎలాంటి
పరిస్థితుల్లోనైనా చలించకూడదంటూ ధైర్యాన్ని చెబుతుంది. ఏ చిన్న కష్టం వచ్చినా కుంగిపోకుండా అండగా నిలబడి ముందుకు నడిపిస్తుంది.

అమ్మ అంటే వ్యక్తిత్వ వికాసం, టైం మేనేజ్ మెంట్ గురువు కూడా. ఉదయం నిద్రలేచింది మొదలు… రాత్రి నిద్రపోయేవరకు ప్రతిక్షణం ఆమె కష్టపడుతూనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడంతో ఆమె పని మొదలవుతుంది. ఎవరికి ఏం ఇష్టమో అవన్నీ రెడీ చేసి ఆకలి తీరుస్తుంది. పిల్లలను స్కూలుకు పంపడం… తిరిగి ఇంటికి తీసుకురావడం వంటివన్నీ ఆమె తన బాధ్యతగా భావిస్తుంది. అంతేగాని బరువు అని అస్సలు
ఫీలవ్వదు. ఆమె రోజూ చేసే పనులను నిశితంగా గమనిస్తే… ఆమెను మించిన టైం మేనేజ్ మెంట్ గురువు లేరనిపిస్తుంది. జస్ట్ ఒక రోజు అమ్మ చేసే పనులను గమనిస్తే… ఆటోమేటిగ్గా టైం మేనేజ్ మెంట్ అలవడుతుంది. దటీజ్ అమ్మ.

పైసా వేతనం తీసుకోకుండా జీవితాంతం పనిచేసే గొప్ప త్యాగశీలి అమ్మ. ఆదివారం ఉద్యోగులందరికీ సెలవు ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆమెకు సెలవులేకపోగా… ఆ రోజున పనిభారం మరింత పెరుగుతుంది. ఎందుకంటే భర్త, పిల్లలు ఇంటి వద్దే ఉంటారు. వారంతా సెలవు తీసుకుంటే… ఆమె మాత్రం వారికి సేవలు చేస్తూ అదనంగా పనిచేస్తుంది. అయినా పనిభారాన్ని. అలసటను ముఖంలో కనిపించనివ్వదు.

మాతృదేవోభవ అంటూ అమ్మకు అగ్ర తాంబూలం ఇచ్చిన సంస్కృతి మనది. అలాంటి మన దేశంలో కొందరు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవల్సిందిపోయి వారి కంట కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మాతృదేవో భవః పితృదేవో భవః అంటాం. అంటే కనిపెంచిన తల్లిదండ్రులు దైవంతో సమానం. కానీ ఆస్తుల ముందు అనుబంధాల అర్థం మారుతోంది. వాటి కోసమే కన్నవారిని కడతేర్చడానికి వెనుకాడడం లేదు కొందరు పుత్ర
రత్నాలు.

ఈ ప్రపంచ మాతృదినోత్సవానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. గ్రీస్లో షరియా అనే దేవతను మదర్ ఆఫ్ గాడ్స్గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. జూలియవర్డ్ హోవే అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించారు. మేరీ జర్విస్ అనే మహిళ మదర్స్ ఫ్రెండ్షిప్ డే జరిపించేందుకు ఎంతో శ్రమించింది. దురదృష్టావశాత్తు ఆమె 1905 మే 9న మృతిచెందారు. ఆమె కుమార్తె మిస్ జెర్విస్ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఆమె కృషివల్ల 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవాన్ని జరపడం మొదలైంది. ఫలితంగా 1914 నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. క్రమంగా అది ప్రపంచమంతా విస్తరించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.