LIC: అమ్మ‌కానికి బంగారు బాతు!

దేశంలో క్రోనీ క్యాపిట‌లిజాన్ని ప్రోత్స‌హిస్తున్న మోడీ ప్ర‌భుత్వం బంగారు గుడ్లు పెడుతున్న బాతును కోసుకు తినేయాల‌ని ఆరాట ప‌డుతోంది. స్వతంత్రం వ‌చ్చాక నెహ్రూ కాలం నుంచి దేశంలో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు నిర్మాణ‌మై, జాతి అభివృద్దిలో త‌మ వంతు పాత్ర పోషించాయి.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:36 PM IST

దేశంలో క్రోనీ క్యాపిట‌లిజాన్ని ప్రోత్స‌హిస్తున్న మోడీ ప్ర‌భుత్వం బంగారు గుడ్లు పెడుతున్న బాతును కోసుకు తినేయాల‌ని ఆరాట ప‌డుతోంది. స్వతంత్రం వ‌చ్చాక నెహ్రూ కాలం నుంచి దేశంలో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు నిర్మాణ‌మై, జాతి అభివృద్దిలో త‌మ వంతు పాత్ర పోషించాయి. ఆ సంస్థ‌లు ఇప్పుడూ ప్ర‌భుత్వాల‌ను పోషిస్తున్నాయి. అప్ప‌ట్లో దేశాభివృద్ధి కోసం 17 కీల‌క రంగాలు ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లోనే ఉండాల‌ని నాటి కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ నిర్ణ‌యంలో భాగంగానే, 1956లో దేశ‌వ్యాప్తంగా ఉన్న వంద‌లాది ప్ర‌యివేటు ఇన్స్యూరెన్స్ కంపెనీల‌న్నిటినీ క‌లిపేసి, 5 కోట్లు పెట్టుబ‌డి పెట్టుబ‌డితో ప్ర‌భుత్వ రంగంలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా పేరుతో జీవిత బీమా సంస్థ‌ను ఏర్పాటు చేశారు. 64,722 లక్ష‌ల కోట్ల బ్రాండ్ వ్యాల్యూతో ప్ర‌పంచంలోనే మూడో అతి గొప్ప బ్యాండ్ గా వెలుగొందుతున్న ఎల్ఐసీలో 5 నుంచి 10 శాతం వాటాల‌ను అమ్మేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌న్నిటికీ మంగ‌ళం పాడుతోంది. అందులో భాగంగానే మెల్ల మెల్ల‌గా ఒక్కోదాన్నీ అమ్మేస్తోంది. కొన్నిటినీ త‌న న‌మ్మిన‌బంట్ల‌కు అద్దెకివ్వాల‌ని నిర్న‌యించింది. ఎల్ఐసీ వంటి బంగారు బాతును ఒక్క‌సారిగా అమ్మేయ‌కుండా కొద్ది కొద్దిగా విక్ర‌యించేందుకు ప్లాన్ చేసింది. వ‌చ్చే మార్చిలో షేర్లు విక్ర‌యించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. దీని ద్వారా సుమారు ల‌క్ష కోట్లు వ‌స్తాయ‌ని మోడీ ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. పైగా ఇందులో 20 శాతం వ‌ర‌కు విదేశీ పెట్టుబ‌డిదారులు కొనేందుకు కూడా అనుమ‌తివ్వ‌బోతోంది. ఎల్ఐసీ పాల‌సీ హోల్డ‌ర్ల‌కు కూడా 10 శాతం వాటాల‌ను అమ్మేందుకు ఓకే చేసింది.

మీ సంక్షేమం మా బాధ్య‌త అనే నినాదంతో 65 సంవ‌త్స‌రాలుగా ఎల్ఐసీ దేశంలో ఒక బ్రాండ్ గా మారింది. ప్ర‌స్తుతం 25 కోట్ల మంది పాల‌సీదారుల విశ్వాసంతో వారి పెట్టుబ‌డుల‌తో దేశ నిర్మాణంలో కీల‌క‌పాత్ర పోషిస్తోంది ఎల్ఐసీ. ప్ర‌యివేటు ఇన్స్యూరెన్స్ కంపెనీలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్నా దేశంలోని మూడింట రెండు వంతుల మంది పాల‌సీదారులు ఇప్ప‌టికీ ఎల్ఐసీనే విశ్వ‌సిస్తున్నారు. త‌న‌ను న‌మ్మి పాల‌సీలు తీసుకుంటున్న ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పెంచుకునే విధంగా వారి పెట్టుబ‌డుల‌ను సుర‌క్షితంగా వృద్ధి చేస్తూ లాభాల‌ను పంచుతోంది. త‌న‌కు వ‌చ్చే లాభాల్లో 95 శాతాన్ని పాల‌సీదారుల‌కు, 5 శాతాన్ని య‌జ‌మాని అయిన కేంద్ర ప్ర‌భుత్వానికి ఏటా ఇస్తోంది. 353 ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు సంస్థ‌ల్లో ఎల్ఐసీ పెట్టుబ‌డులున్నాయి. ముఖ్యంగా 68 కీల‌క‌ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో, కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర ఎల్ఐసీ పెట్టుబ‌డులున్నాయి. ఎక్క‌డి నుంచి వ‌స్తున్న ఆదాయాన్ని అక్క‌డే అన్న‌ట్లుగా ఆయా రాష్ట్రాల అభివృద్ధికి రుణాల రూపంలో ఎల్ఐసీ ఇస్తోంది. ప్ర‌భుత్వాలు లేదా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లోనే 25 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు పెట్టింది. 5 ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కు ప్ర‌యివేటు రంగంలో పెట్టింది. మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్ర‌భుత్వ రంగంలో పెట్టుబ‌డుల శాతం చాలా వేగంగా పెరిగింది. ప్ర‌భుత్వ రంగంలో ఎల్ఐసీ పెట్టుబ‌డులు ఏటా 15 శాతం పెరుగుతోంది. కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని చుట్టుముట్టిన స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా బీమా వ్యాపారం మంద‌గించింది. 2021లో ప్ర‌పంచ బీమా విలువ 6 శాతం క్షీణించింది. కాని మ‌న‌దేశంలో ఎల్ఐసీ వ్యాపార విలువ 6.8 శాతం పెరిగింది. అందుకే ప్ర‌పంచంలోని 500 అత్యుత్త‌మ బ్రాండ్ల‌లో ఎల్ఐసీ స్థానం 238 నుంచి 206కు చేరింది. 2022లో ఎల్ఐసీ మార్కెట్ విలువ 43.40 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 18 వేల కోట్ల రూపాయ‌ల‌తో అతి పెద్ద ప‌బ్లిక ఇష్యూ జారీ చేసిన సంస్థ‌గా పేటీఎం మాతృసంస్థ రికార్డు కొన‌సాగుతోంది. ఆ త‌ర్వాత 15 వేల కోట్ల‌తో కోల్ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. కాని ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ ల‌క్ష కోట్ల‌తో రికార్డు సృష్టించ‌బోతోంది. కేంద్ర ప్ర‌భుత్వ కార్పొరేష‌న్ గా కొన‌సాగుతున్న ఎల్ఐసీ ప్ర‌భుత్వ కంపెనీగా రూపాంత‌రం చెంది, నియ‌మ నిబంధ‌న‌లన్నీ పూర్తి చేసుకుని సెబీ అనుమ‌తి పొందాక ప‌బ్లిక్ ఇష్యూ జారీ చేయ‌బోతోంది. ఈ ప్ర‌క్రియ‌ను స‌జావుగా పూర్తి చేయ‌డానికి ప‌ది ఆర్థిక రంగ దిగ్గ‌జాల‌ను నియ‌మించుకుంది. అంటే ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూ ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. గ‌త ఏడాది ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ 2021-22 బ‌డ్జెట్ పార్ల‌మెంట్లో ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ల‌క్షా 75 వేల కోట్ల‌ను పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా సంపాదించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే కోవిడ్ కార‌ణంగా ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 12,300 కోట్లు మాత్ర‌మే సాధించ‌గ‌లిగారు. మార్చిలోగా ఎల్ఐసీ ద్వారా లక్ష కోట్లు సంపాదించి మూడింటి రెండు వంతుల టార్గెట్ అయినా సాధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ గట్టిగా నిర్ణ‌యించుకుంది. అందుకే అత్యంత వేగంగా ఎల్ఐసీ ప‌బ్లిక్ ఇష్యూకి సంబంధించిన ప‌నులు సాగుతున్నాయి.

ఒక‌ప్పుడు న‌ష్టాలు వ‌స్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మాల‌ని నిర్ణ‌యించారు. త‌ర్వాత న‌ష్టాల‌తో నిమిత్తం లేకుండా ప్ర‌భుత్వ రంగాన్ని మొత్తంగా అమ్మేయ‌డానికి మోడీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అందుకే రైళ్ళు, రైల్వే స్టేష‌న్లు, రోడ్లు, విమానాశ్ర‌యాలు, పెట్రోపైప్ లైన్లు, పెట్రోలియం కంపెనీలు, స్టీల్ కంపెనీలు అదీ ఇదీ అని లేకుండా అమ్మ‌డ‌మా లేదా అద్దెకివ్వ‌డ‌మా చేయాల‌ని నిర్ణ‌యించుకుని ముందుకు సాగుతోంది. వ్యాపారం చేయ‌డం ప్ర‌భుత్వం ప‌ని కాద‌ని, అందుకు ప్ర‌యివేటు సంస్థ‌లున్నాయ‌ని అంటోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ ప్ర‌భుత్వ‌మూ వ్యాపారం చేయ‌ద‌ని, కేవ‌లం ఫెసిలిటేట‌ర్ పాత్ర మాత్ర‌మే పోషిస్తుంద‌ని చెబుతోంది. మ‌న‌దేశం అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేరింద‌ని మోడీ స‌ర్కార్ భ్ర‌మ‌ప‌డుతోంది. ఉపాధి పోయి, ఉద్యోగాలు రాక‌, అప్పుల‌పాలై, పంట‌లు చేతికంద‌క కుటుంబాలకు కుటుంబాలే ఏటా ల‌క్ష‌ల సంఖ్య‌లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న దేశం మ‌న‌ది. క‌రోనా కాలంలో హ‌ఠాత్తుగా లాక్ డౌన్ విధిస్తే వంద‌ల కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న సొంతూళ్ళ‌కు చేరుకున్న ల‌క్ష‌లాది అభాగ్యుల్లో అనేక వంద‌ల మంది దారిలోనే పిట్ట‌ల్లా రాలిపోయారు. క‌రోనా వైద్యం అంద‌క‌, ఖ‌రీదైన వైద్యం చేయించుకోలేక ల‌క్ష‌లాది మంది ప్రాణాలు విడిచారు. ఇప్ప‌టికీ అనేక మౌలిక రంగాల్లో మ‌న పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ కంటే వెనుక‌బ‌డి ఉన్న భార‌త్ లో దేశాభివృద్ధిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌భుత్వ రంగాన్ని తెగ‌న‌ర‌క‌డం క‌రెక్టేనా?