Site icon HashtagU Telugu

Kurnool City : నాటి కందనవోలు.. నేటి కర్నూల్ గా ఎలా మారింది ?

kurnool kondareddy buruju

kurnool kondareddy buruju

Kurnool City : కర్నూల్.. రాయలసీమలో ఉన్న ప్రధాన నగరాల్లో ఇది కూడా ఒకటి. ఈ నగరానికి కొన్నివేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందట. సుమారు 2303 సంవత్సరాల చరిత్ర కలిగిన కర్నూల్ నగరం అసలు పేరు.. కందనవోలు. కాలక్రమేణా అదే కర్నూల్ అయింది. బాదామి చాళక్యులు, తెలుగు చోళులు, కాకతీయుల పాలనలో ఉన్న ఈ పట్టణం.. ఆ తర్వాత విజయనగర పాలకుల హస్తగతమైంది.

1565వ సంవత్సరంలో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం.. గోల్కొండ కుతుబ్ షాహీ నవాబులు కర్నూల్ ను ఆక్రమించుకున్నారు. వారి తర్వాత బీజాపూర్ సుల్తాన్ కర్నూల్ ను తన చేతిలోకి తీసుకోగా.. 1687లో ఔరంగజేబు కృష్ణానదీ తీరాన్ని దాటి దండయాత్ర చేసి.. ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తన మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్ కు కందనవోలును జాగీరుగా బహూకరించాడు.

1733లో దావూద్ ఖాన్ చనిపోగా.. ఆయన తర్వాత పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ తొలి కర్నూల్ నవాబుగా పాలకవంశాన్ని ప్రారంభించాడు. అప్పట్లో జరిగిన బ్రిటీష్ – ఫ్రెంచ్ యుద్ధాల్లో హిమాయత్ ఖాన్ పాల్గొన్నాడు. అప్పుడే కర్నూల్ ప్రకృతి వైపరీత్యాలకు గురై.. కోట దెబ్బతింది. 1741లో మరాఠాల చేతికి వచ్చిన ఈ పట్టణాన్ని.. 1751లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ ఫిరంగులతో కోటను పగులగొట్టి కర్నూల్ ను ముట్టడించి స్వాధీనం చేసుకోగా.. 1755లో మైసూర్ కు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంశాన్ని జయించాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పుసుల్తాన్ మరణించగా.. ఆనాడు ఈ జిల్లా మొత్తాన్నీ హైదరాబాద్ నవాబు తన సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత 1800లో పాలించిన నిజాం.. బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్ నవాబులు గోల్కొండమీదికి దండెత్తకుండా ఉండేందుకు సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు. ఆ ఒప్పందం ప్రకారం.. హైదరాబాద్ మీదికి ఎవరు దండెత్తి వచ్చినా.. వారిని నిజాం సేనలు, బ్రిటీష్ సేనలు కలిసి ఎదుర్కోవాలి. బదులుగా నిజాం నవాబు నేటి రాయలసీమను బ్రిటీష్ వారికి దత్తత ఇచ్చాడు. ఇప్పుడున్న నాలుగు జిల్లాల రాయలసీమను నాడు బ్రిటీషర్లు సీడెడ్ జిల్లాలు అని పిలిచారు. 1823 – 1839 సమయంలో బ్రిటీషర్లు నియమించిన రసూల్ ఖాన్ కోటపై ఉన్న మక్కువతో దీనికి మరమ్మతు చేయించాడు. ఆ తర్వాత 1947 వరకూ.. ఈస్ట్ ఇండియా కంపెనీ రసూల్ ఖాన్ ను తొలగించి ఆ కోటను తమ ఆధీనంలోనే ఉంచుకుంది.

1947 తర్వాత.. కర్నూల్ ఉమ్మడి మద్రాసులో భాగమై.. 1953లో ఆంధ్రరాష్ట్ర రాజధానిగా ఉంటూ.. 1956లో ఏర్పడిన ఏపీలో భాగమయింది. 1830లో ఏనుగుల వీరాస్వామయ్య చెన్నై నుంచి కాశీకి యాత్ర చేస్తుండగా .. తన ప్రయాణంలో కర్నూల్ ప్రాంత విశేషాలను యాత్రాచరిత్రలో నమోదు చేశాడు. ఆవులపాలను కేవలం దూడలకే వదిలే వారనీ, ఒక్క చుక్క కూడా మనుషులు తాగేవారు కాదని వివరించారు.

కడప దాటాక.. కర్నూల్ దాటి.. శ్రీశైలం చేరిన తర్వాతే ఆవుపాలు తాగానని, కర్నూల్ లో పశుపోషణ చాలా గొప్పదని ప్రశంసించారు. విజయనగర పాలకుడైన అచ్యుతరాయలు కర్నూల్ కోటను నిర్మించాడు. కోటకు నాలుగువైపులా నిర్మించిన బురుజులలో మూడు శిథిలం కాగా.. మిగిలిన నాలుగవ బురుజే నేటి మన కొండారెడ్డి బురుజు. ఇదీ మన కర్నూల్ చరిత్ర.

 

 

Exit mobile version