Lady Singham: టెన్త్ పాసవ్వలేనిదానివి ఐపీఎస్ అవుతావా అన్నారు.. ఇప్పుడు ఆమె ముంబయి సింగం

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 09:37 AM IST

సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోని దిండుక్కల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తారు. 14 ఏళ్లకే పెళ్లయ్యింది. 18 ఏళ్లకే ఇద్దరు పిల్లలు. మరో మహిళ అయితే అక్కడితో తన కెరీర్ క్లోజ్ అనుకునేది. కానీ ఇక్కడున్నది అంబిక.

ఓరోజు భర్త టిఫిన్ చేయకుండానే పెరేడ్ కు వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో పిల్లలను తీసుకుని.. అంబిక కూడా అక్కడికి వెళ్లింది. అక్కడ తన భర్త.. ఆయనకన్నా చిన్నవయసులోవారికి సెల్యూట్ చేయడం గమనించింది. ఇంటికి వచ్చాక అడిగింది. వాళ్లంతా తన బాస్ లు కాబట్టి సెల్యూట్ చేయాలి అని చెప్పాడు. ఆ గౌరవం దక్కాలంటే ఏం చేయాలి అని అడిగితే సివిల్స్ రాయాలన్నాడు. అయినా పదో తరగతి కూడా నువ్వు పాసవ్వలేదు.. ఇక సివిల్స్ ఏం రాస్తావు.. ముందు టెన్త్ పాసవ్వు అన్నాడు. అదిగో అక్కడ తగిలింది అంబికాకు దెబ్బ.

తను సివిల్స్ రాస్తానని ఇంట్లో చెప్పింది. ముందు టెన్త్ క్లాస్ చదవడానికి ఒప్పించింది. ఇంటిపని, వంట పని చేస్తూ.. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చదవడం కష్టమే. అయినా సరే.. పట్టు వదల్లేదు. అందుకే టెన్త్ లో 500కి 477 మార్కులు వచ్చాయి. దీంతో ఇంట్లోవారికి నమ్మకం కలిగింది. తరువాత ప్రైవేటుగానే బీఏ చదివింది. ఆమె చదువంతా తమిళ మీడియంలోనే సాగింది. ఆమె ఉండే దిండుక్కల్ బస్టాండ్ కి దగ్గర్లో కలెక్టర్ బంగ్లాకు అధికారులు వచ్చేవారు. వాళ్ల సెల్యూట్లు, సైరన్ల మోతలు.. పై అధికారికి ఇచ్చే గౌరవాన్ని చూసి అలాంటి రెస్పెక్ట్ తనకీ కావాలనుకుంది. అందుకే సివిల్స్ రాయాలనుకుంది.

సివిల్స్ చదవడానికి చెన్నై వెళ్లమన్నాడు అంబిక భర్త. పిల్లలను తను చూసుకుంటా అన్నాడు. ఇక అప్పటి నుంచి అంబిక యుద్ధం మొదలుపెట్టింది. పుస్తకాలు, మ్యాగ్ జైన్లు, న్యూస్ పేపర్లు అన్నింటినీ చదివేది. కానీ తొలిసారి ప్రిలిమ్స్ లో ఫెయిల్. రెండోసారి మెయిన్స్ వరకు మాత్రమే వెళ్లగలిగింది. దీంతో ఇక ఆమె వల్ల కాదనుకుని భర్త వచ్చేయమన్నాడు. అయినా అంబిక పట్టు వదల్లేదు. ఆఖరి ఛాన్స్ ఇవ్వండని అడిగింది. లేకపోతే ఇంటికొచ్చి టీచర్ గా చేస్తానంది. ఆమె పట్టుదల చూసి అంబిక భర్త ఓకే చెప్పాడు.

భర్త తనపై ఉంచిన నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకుంది. సివిల్స్ పాసైంది. ఇంటర్వ్యూలోనూ సక్సెస్ అయ్యింది. 112 ర్యాంకును సాధించింది. నార్త్ ముంబై డీసీపీగా ఫస్ట్ పోస్టింగ్. తరువాత గంగనాపూర్ ప్రాంతంలో పిల్లల మిస్సింగ్ కేసులు ఛేదించడం, ఆ తరువాత చైన్ స్నాచింగ్ కేసులను పరిష్కరించడం.. ఇలా ఎన్నో మైలురాళ్లు. అందుకే ఆమెకు ముంబై సింగం అని పేరు వచ్చింది. ఒకప్పుడు తమిళం మాత్రమే వచ్చిన అంబికాకు.. ఇప్పుడు మరాఠీ, ఇంగ్లిష్ అన్నీ వచ్చు. ఆమె సేవలకు మెచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం.. లోకమత్ మహారాష్ట్రియన్ అవార్డ్ ను అందించింది.

ఏదైనా ఒకటి కావాలనుకుంటే దానిని సాధించాలన్న కసి ఉండాలి. ప్రణాళికతో శ్రమ పడాలి. అప్పుడు విజయం తల వంచుతుంది. వారిని వరిస్తుంది. దానికి ముంబయి సింగం అంబికాయే ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివాళ్లే నేటి యూత్ కు ఆదర్శం.