Site icon HashtagU Telugu

Raksha Bandhan 2023 : వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే బంధమే ‘రక్షా బంధన్’

raksha bandhan 2023

raksha bandhan 2023

అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఎంతో ప్రేమగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న రక్షా బంధన్ (రాఖీ పండగ)​ వచ్చేసింది. కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు… రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు అందిస్తారు. ఇది అన్నా-చెల్లెల పండుగ. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ.. కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసానిచ్చే పండేగే ఈ రాఖీ (Raksha Bandhan). ఈ పండగ కోసం దేశం మొత్తం సిద్ధమైంది.

అసలు రాఖీ అంటే ఏంటి..?

రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షా బంధన్ లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం(రక్షా బంధన్) కడతారు. తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ.. వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి, వారి నుదుట వీర తిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను ఇస్తుంటారు.

అసలు రక్షాబంధన్ (Raksha Bandhan) అనేది ఎలా మొదలైంది..?

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

Read Also : Britain: చిలుకను చంపివేసినందుకు 25 నెలలు జైలు శిక్ష

రాఖీ ఎలా కట్టాలి..?

రాఖీ రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్లాలి. ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితి. రాఖీ కట్టే ముందు యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదీస్తూ అక్షింతలు వేయాలి. రాఖీ కట్టిన తర్వాత సోదరీ హారతి ఇవ్వాలి.అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి.

Raksha Bandhan పండగకు కులమత భేదాల్లేవ్..

ఈ పండుగ కు కులమత భేదాల్లేవ్.. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారు ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పవచ్చు. మనదేశంలో సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మానవ సంబంధాల మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది.

మార్కెట్లో రకరకాల రాఖీలు లభ్యం (Raksha Bandhan) ..

రాఖీ పండగా అంటే చాలు మార్కెట్ లో రకరకాల రాఖీలు దర్శనం ఇస్తాయి. డోరేమాన్, వినాయక, కొత్త కొత్త పూసలులు ఇలా ఎన్నో రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ లో రాఖీలు 10 రూపాయలు నుండి 100 రూపాయిల ఫై వరకు వున్నాయి. రాఖీల తయారీకి పేరుగాంచిన ధూల్‌పేట్ లో రకరకాల రాఖీలను రూపొందిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందరికీ నచ్చేలా నూతన డిజైన్లలో రాఖీలను ఇక్కడ తయారుచేస్తుంటారు. ప్రస్తుత కాలంలో నూతనంగా, వెరైటీగా ఉండాలనే యువత ఆలోచనలకు అనుగుణంగా వీటిని సిద్ధం చేసారు.

సో.. మీరంతా ఈ రాఖీ పండగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మా Hashtag U టీం కోరుకుంటూ.. మరోసారి మీ అందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు.

Read Also : Raghava Lawrence : నా ట్రస్ట్‌కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. ఎందుకంటే రాఘవ లారెన్స్