Pokémon Pheromosa: కొత్త బొద్దింక జాతి గుర్తింపు.. “పోకీమాన్ ఫెరోమోసా” గా నామకరణం

ఒక కొత్త జాతి బొద్దింకను సింగపూర్ కు చెందిన కీటక శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి శాస్త్రవేత్తలు ఏ పేరు పెట్టారో మీరు ఊహించగలరా? ఆ బొద్దింక జాతికి...

ఒక కొత్త జాతి బొద్దింకను సింగపూర్ కు చెందిన కీటక శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి శాస్త్రవేత్తలు ఏ పేరు పెట్టారో మీరు ఊహించగలరా? ఆ బొద్దింక జాతికి “పోకీమాన్ ఫెరోమోసా” (Pokémon Pheromosa) అని పేరు పెట్టారు. సింగపూర్ లోని లీకాంగ్ చియాన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ లాస్ బానోస్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన కీటక శాస్త్రవేత్తలు ఫూ మాయోషెంగ్, క్రిస్టియన్ లుకానాస్ చాలా సంవత్సరాల పాటు విస్తృతమైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ బొద్దింక జాతిని కనుగొన్నారు.

పోకీమాన్ యానిమేషన్ సిరీస్‌ అంటే శాస్త్రవేత్త ఫూ మాయోషెంగ్ కు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఆ యానిమేషన్ సిరీస్ లోని “పోకీమాన్ ఫెరోమోసా” (Pokémon Pheromosa) అనే క్యారెక్టర్ పేరును కొత్త బొద్దింక జాతికి పెట్టాడు. ఈమేరకు వివరాలతో శాస్త్రవేత్త ఫూ మాయోషెంగ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ కు 123 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. టన్నుల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. ఇక పోకీమాన్ ప్రేమికులు ఈ ఆవిష్కరణకు పోకీమాన్ ఫెరోమోసా పేరు పెట్టినందుకు ప్రశంసలు కురిపించారు.

2016లో..

2016లో బుకిట్ తిమాహ్ నేచర్ రిజర్వ్‌లో నిర్వహించిన సర్వేలో ఈ కొత్త జాతి బొద్దింకను మొదటి సారిగా గుర్తించారు. దానికి సంబంధించిన కొన్ని నమూనాలను విడదీసి, ఇతర బొద్దింకలతో పోల్చి చూశారు. దీంతో ఆ బొద్దింక మునుపెన్నడూ గుర్తించబడలేదని తేలింది. కొత్త బొద్దింక జాతి, పోకీమాన్‌ల మధ్య “పొడవైన యాంటెన్నా కలిగి ఉండటం, హుడ్‌ను అనుకరించే రెక్కలు, పొడవాటి సన్నని కాళ్ళు” వంటి సారూప్యతలను తాము కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెప్పారు. అందుకే వాటికి ఆ పేరు పెట్టమన్నారు.ఈ స్టడీ రిపోర్ట్ ” ది జర్నల్ ఆఫ్ ఆసియా-పసిఫిక్ ఎంటమాలజీ”లో గత నెలలో పబ్లిష్ అయింది.

నన్ను బగ్ క్యాచర్ అంటారు..

ఫూ మాయోషెంగ్ మీడియాతో మాట్లాడుతూ.. “నాకు బగ్‌లు మరియు పోకీమాన్‌ల పట్ల ఉన్న ఉత్సాహం కారణంగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని సహచరులు నన్ను బగ్ క్యాచర్ అని పిలుస్తుంటారు” అని పేర్కొన్నాడు.

Also Read:  Kidney Stones: బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయంట..!