మత్తూర్, కర్నాటక- కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం

ఈ కాలంలో సంస్కృత భాష ఎక్కడుంది ఒక్క పుస్తకాల్లో తప్ప అనుకునే వాళ్లకి.. నేనున్నాను అంటూ సవాల్ విసురుతోంది కర్నాటక షిమోగా జిల్లాల్లోని మత్తూర్ గ్రామం. ఇక్కడికి వెళ్లిన వాళ్లు స్థానికులతో మాట్లాడాలంటే కచ్చితంగా సంస్కృతం నేర్చుకుని ఉండాలి.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:46 AM IST

ఈ కాలంలో సంస్కృత భాష ఎక్కడుంది ఒక్క పుస్తకాల్లో తప్ప అనుకునే వాళ్లకి.. నేనున్నాను అంటూ సవాల్ విసురుతోంది కర్నాటక షిమోగా జిల్లాల్లోని మత్తూర్ గ్రామం. ఇక్కడికి వెళ్లిన వాళ్లు స్థానికులతో మాట్లాడాలంటే కచ్చితంగా సంస్కృతం నేర్చుకుని ఉండాలి. లేదంటే, మీ పక్కన తర్జుమా చేసే వాళ్లుండాలి. దేశంలో కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం బహుశా ఇదేనేమో. ఇక్కడి స్థానికులంతా సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు.

ఎలా మొదలైంది

ఓ 40 ఏళ్ల క్రితం.. అంటే 1981లో సంస్కృత భాషను ప్రోత్సహించడానికి సంస్కృత భారతి అనే సంస్థ ప్రతినిధి వచ్చాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోలాగే మత్తూరులో కూడా సంస్కృత భాష గొప్పతనం గురించి చెప్పారు. మొత్తం పది రోజుల పాటు జరిగిన వర్క్ షాప్‌లో ఎక్కడెక్కడి నుంచో జనం ఉత్సాహంగా వచ్చారు. ఉడిపిలోని పెజవార్ మఠం నుంచి కూడా ఈ వర్క్ షాప్‌కు హాజరయ్యారు. ఆ క్లాసులు విన్న తరువాత మత్తూరు ప్రజలకు ఇంత గొప్ప సంస్కృత భాషను బతికించుకోవాలన్న తపన, ఉత్సాహం కలిగింది. అప్పటి నుంచి సంస్కృత భాషను జీవనంలో భాగంగా మార్చుకున్నారు.

మత్తూరు ప్రజల జీవన విధానం

మత్తూరు గ్రామానికి, ఇక్కడి ప్రజలకు ఓ విశిష్టత ఉంది. ఈ గ్రామంలో ఉండే వాళ్లంతా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వాళ్లే. పైగా సనాతన బ్రాహ్మణత్వాన్ని కొనసాగిస్తున్న వాళ్లు. కేరళ నుంచి దాదాపు 600 సంవత్సరాల క్రితమే మత్తూరుకు వలస వచ్చారు. ఇక్కడే సంప్రదాయబద్దంగా ఓ పాఠశాల నిర్మించుకున్నారు. ఈ పాఠశాలలో సంస్కృత భాషనే ప్రధానంగా నేర్పిస్తారు. పైగా ఇక్కడ ఉండేది మొత్తం బ్రాహ్మణ వర్గమే కాబట్టి పదేళ్ల వయసు వచ్చిన వారందరికీ వేదాలు కూడా నేర్పిస్తుంటారు. ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయమే. వరి, పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు. మత్తూరు ప్రజలకు సంస్కృతం మాట్లాడడమే కాదు.. చివరికి ఇక్కడి గోడలపై కూడా సంస్కృతంలోనే రాసి ఉంటుంది. అదీ ఇక్కడి గొప్పదనం.

మత్తూరు గ్రామ విశేషాలు

మత్తూరు ఓ పల్లెటూరు మాత్రమే. పర్యాటకంగా ఎలాంటి ప్రశస్తి లేదిక్కడ. ఈ ఊరికి వచ్చే వారికి రామాలయం, శివాలయం తప్ప చూసేందుకు మరే ప్రత్యేకమైన కట్టడాలు కనిపించవు. కాని, మత్తూరు వచ్చే వాళ్లు దీన్ని ఆనుకుని ఉన్న హోసహళ్లి అనే గ్రామాన్ని చూసి వెళ్తారు. ఇది తుంగ నది ఒడ్డున ఉన్న ఓ అందమైన ఊరు. మత్తూరులో చూడ్డానికి ఏం లేదే అని బాధపడే వారికి హోసహళ్లి గ్రామం కాస్తంత ఊరటనిస్తుంది.

మత్తూర్, హోసహళ్లి
మత్తూరు, హోసహళ్లి గ్రామాలే అయినప్పటికీ.. ఇప్పటికీ ఇక్కడ సంస్కృతాన్ని బతికిస్తున్నారు. దీంతో పాటే గమకం అనే కళను కూడా ఇప్పటికీ సజీవంగానే ఉంచారు. గమకం అనేది పాటలోని ఓ ప్రక్రియ. కథలు చెప్పడానికి కర్నాటక ప్రజలు వాడే ఓ సాధనం లాంటిది ఈ గమకం. నిజానికి కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడతారని మత్తూరుకు ఎలా పేరుందో.. హోసహళ్లికి కూడా అదే పేరుంది. ఇక్కడి వాళ్లు కూడా కేవలం సంస్కృత భాషనే మాట్లాడతారు. మాటే కాదు శ్వాస, ధ్యాస, జీవనం మొత్తం సంస్కృతమే.