Diabetes In Women: మధుమేహ లక్షణాలు స్త్రీలలో భిన్నంగా ఉంటాయా..?

మధుమేహం ఒక లైఫ్ స్టైల్ డిసీజ్.

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 07:15 AM IST

మధుమేహం ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. మధుమేహంగా నిర్ధారించబడుతున్న మొత్తం కేసుల్లో 90-95 శాతం కేసులు టైప్ 2 డయాబెటిస్ కేసులే. టైప్ -2 డయాబెటిస్ కు మహిళలు, పిల్లలు సైతం అతీతం కాదని లెక్కలు చెబుతున్నాయి. ఊబకాయంతో ఎక్కువ శాతం మంది మహిళలు టైప్ 2 డయాబెటిస్‌ బారిన బాధపడుతున్నారు. టైప్-2 మధుమేహం పెరుగుదలకు ప్రధాన కారణం ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం, ఒళ్లు కదలకుండా కొనసాగించే జీవనశైలి అలవాట్లే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహం ఒక మహమ్మారిగా మారిన పరిస్థితుల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో టైప్ 1, టైప్ 2, గర్భస్థ మధుమేహం, ప్రీ-డయాబెటిస్ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

మూత్ర సంబంధిత వ్యాధులు

మధుమేహం ఉన్న స్త్రీలలో యోని ద్వారంలో ఇన్ఫెక్షన్ వల్ల దురద, తామరలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీరంలోని రోగనిరోధక సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మధుమేహం కారణంగా కొంతమంది మహిళలు తమ మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయలేరు. దీని కారణంగా వారిలో బ్యాక్టీరియా పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

క్రమరహిత పీరియడ్స్

మధుమేహం వ్యాధిగ్రస్థ మహిళల్లో సర్వసాధారణంగా కన్పించే లక్షణం క్రమరహిత పీరియడ్స్. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో మొదటి పీరియడ్స్ లో వ్యాధి ప్రభావం చూపకపోవచ్చు. కానీ, మొదటి పీరియడ్స్ తర్వాత నుంచి క్రమరహిత పీరియడ్స్ రావడం గమనించవచ్చు. మధుమేహం ఉన్న మహిళలందరికీ క్రమరహిత రుతుచక్రం ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది స్త్రీలు మధుమేహ అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి.

పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్

మధుమేహం ఉన్న పురుషులతో పోలిస్తే స్త్రీలు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇందులో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ ఒకటి. అనేక అధ్యయనాల ప్రకారం పిసిఓఎస్ ఉన్న మహిళల్లో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువ. గర్భస్థ మధుమేహం వల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గర్భస్థ మహిళ్లలో బిగ్ బేబీ సమస్య

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మొత్తం గర్భిణీ స్త్రీలలో 10 శాతం మంది మహిళలు గర్భస్థ మధుమేహం బారిన పడుతున్నారు. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది గర్భధారణ మధుమేహానికి దారితీస్తుంది. గర్భస్థ మధుమేహం సాధారణంగా లక్షణాలు లేకుండా ఉంటుంది. గర్భస్థ మధుమేహం అవగాహనలేమి కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు గర్భస్థ మధుమేహాన్ని పరీక్షించడానికి కొన్ని దశలలో గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలను చేయించుకోవాలి.

గర్భంలోని శిశువు సాధారణం కంటే అధిక బరువు పెరగడం గర్భస్థ మధుమేహానికి సంకేతం. యు.ఎస్.సి.డి.సి. ప్రకారం గర్భస్థ మధుమేహం ఉన్న తల్లులలో ప్రసవం తర్వాత 50 శాతం మందికి పైగా టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.

మహిళల్లో మధుమేహం – ఇతర సమస్యలు

మధుమేహ వ్యాధిగ్రస్థ మహిళలకు గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, డిప్రెషన్ కు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.ఇవి పురుషులతో పోల్చితే మహిళల్లో చాలా ఎక్కువ ప్రాణాంతకమని కూడా నిపుణులు చెబుతున్నారు.
రుతువిరతి (మెనోపాజ్)సమయంలో మహిళల శరీరంలో సంభవించే మార్పులు కారణంగా స్త్రీలకు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి రక్తంలో గ్లూకోజ్ పెరగడం, బరువు పెరగడం, నిద్రలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మరింత సంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.