Droupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక బీజేపీ వ్యూహమిదీ..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును మంగళవారం సాయంత్రం ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 11:17 AM IST

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును మంగళవారం సాయంత్రం ప్రకటించారు. దీని వెనుక బీజేపీ వ్యూహం ఏమిటీ ? రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ను ప్రకటించిన విప క్షాలకు ఈ నిర్ణయం ఏవిధంగా పరిణ మించబోతోంది ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వివరాలను తెలుసుకోవడానికి ముందు.. ద్రౌపది ముర్ము నేపథ్యం గురించి తెలుసుకోవాలి.

ద్రౌపది ముర్ము ఎవరు ..

ఆమె ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మయూర్‌భంజ్‌లో గిరిజన సంతాల్‌ తెగలో 1958 జూన్‌ 20న జన్మించారు. డిగ్రీ పూర్తి చేసి .. పోటీ పరీక్షలు రాయడంతో ఒడిశాలోని నీటిపారుదల, విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. 1997లో రాయ్‌ రంగాపూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అంతకుముందు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో 2015లో ఆమె జార్ఖండ్‌ కు తొలి మహిళా గవర్నర్‌ అయ్యారు.

జూలై 18న ఏం జరగబోతోంది?

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఇప్పుడు దీనిపైనే యావత్ దేశం దృష్టి ఉంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఇందులో లోక్ సభ , రాజ్యసభ ఎంపీలు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ఈ
ఎలక్టోరల్ కాలేజ్ లో బీజేపీ కి 49 శాతానికిపైగా ఓట్లు ఉన్నాయి. గిరిజన ఆదివాసీ జనాభా అత్యధికంగా ఉన్న.. యూపీఏ మిత్ర పక్షాలు పాలించే రాష్ట్రాలు కూడా ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపుతాయని బీజేపీ భావిస్తోంది.ముర్ము ఒడిశా వాస్తవ్యురాలు. 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ముర్ము స్నేహశీలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ మద్దతు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. జార్ఖండ్‌ కు తొలి మహిళా గవర్నర్‌ గా చక్కటి సేవలు అందించిన నేపథ్యం వల్ల.. ఆ రాష్ట్రంలోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం కూడా ముర్ము కు సపోర్ట్ చేయొచ్చని అంటున్నారు. 2017లో జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం “ల్యాండ్ టేనాన్సీ యాక్ట్”లో సవరణలు చేసేందుకు యోచించింది.అయితే అప్పుడు గవర్నర్ గా ఉన్న ద్రౌపది ముర్ము .. ఆ సవరణ బిల్లును ఆమోదించకుండా తిప్పి పంపేశారు. దీంతో జార్ఖండ్ లో అత్యధిక సంఖ్యలో ఉండే ఆదివాసీ, గిరిజన జనాభాలో ముర్ముకు మంచి పేరు ఉంది. రాబోయే రోజుల్లో ఒడిశా, జార్ఖండ్ లలో బీజేపీ బలోపేతానికి ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వం బాటలు వేస్తుందని బీజేపీ భావిస్తోంది. త్వరలోనే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జనాభాలో 14 శాతం మంది గిరిజనులే.

గిరిజన జనాభా రాష్ట్రాల వారీగా..

మిజోరాం (94%), నాగాలాండ్ (86.5%), మేఘాలయ (86.1%), అరుణాచల్ ప్రదేశ్ (68.8%), మణిపూర్(35.1%), సిక్కిం (33.8%), త్రిపుర (31.8%), ఛత్తీస్ ఘడ్(30.6%), జార్ఖండ్ (26.2%), ఒడిశా (22.8%), మధ్యప్రదేశ్(21.1%), గుజరాత్(14.8%), రాజస్థాన్(13.5 %), కశ్మీర్(11.9%) .. ఈవిధంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన జనాభా నిర్ణయాత్మక స్థాయిలో ఉంది.ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్ లో కలిసి వస్తుందనే ఆశలో బీజేపీ అధినాయకత్వం ఉంది. ఈ లెక్కలన్నీ చూసుకున్నాకే రాష్ట్రపతి అభ్యర్థిత్వం పై బీజేపీ తుది నిర్ణయం తీసుకుందని అంటున్నారు.