Central Govt: పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్రం ఉక్కుపాదం

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 01:12 PM IST

Central Govt: అక్రమార్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బిల్లును ప్రవేశపెట్టడం ఆసక్తిగా మారింది. పరీక్షల్లో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పాఠశాల పరీక్షలు, కాలేజీల్లో ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలు, ఇలా వేటిలోనైనా సరే పేపర్ లీకేజిలు, తదితర మోసాలకు పాల్పడితే కఠినంగా శిక్షించడం కోసం ఈ బిల్లును రూపొందించింది.

కొత్త చట్టం ద్వారా ఇలాంటి నేరాలకు పాల్పడేవారు ఇకపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. 1 కోటి వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.కొత్త చట్టం ద్వారా నిందితులు లేదా అనుమానితులకు పోలీసులు ఎలాంటి వారంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఈ చట్టంలో పొందుపర్చిన అన్ని నేరాలను కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండబుల్‌గా పేర్కొన్నారు. అంటే ఈ నేరాలకు పాల్పడ్డవారు నేరుగా బెయిల్ పొందలేరు. అలాగే రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లేదు“పరీక్షలు అంటేనే విద్యార్థులు లేదా అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉద్దేశించినవి. అలాంటప్పుడు వారిలో కొందరు మోసపూరితంగా అడ్వాంటేజి తీసుకుంటే అతి దేశానికి, దేశాభివృద్ధికి మంచిది కాదు” అని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.

మోసపూరితంగా సదరు వ్యక్తులు టాప్ ర్యాంకులు సాధించవచ్చు. కానీ వారి వల్ల దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని సూత్రీకరించారు. అసమర్థులు పదవులు పొందితే దాని వల్ల సమాజానికి నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షల్లో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ శాఖ సహాయ మంత్రి చెబుతున్నారు. పరీక్షలు నిర్వహించే సంస్థల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు థర్డ్ పార్టీ ఏజెన్సీలు (డిజిటల్ ప్లాట్‌ఫాంలు, పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థలు) కూడా లీకేజిలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.కొత్త చట్టంలో తప్పు చేసినవారిని శిక్షించడం మాత్రమే కాదు, తప్పు జరగకుండా నియంత్రించేలా జాగ్రత్తలు కూడా పొందుపరిచి ఉన్నాయి.

పార్లమెంట్ ఉభయ సభల్లో పాసై, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఒక హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలను లోపభూయిష్టంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం జరుగుతుంది. అత్యంత భద్రతావ్యవస్థ కల్గిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం, లోపరహిత ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్, పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ నిఘా, పరీక్షా కేంద్రాల డిజిటల్, ఫిజికల్ మౌలిక వసతుల విషయంలో కనీస ప్రమాణాలపై ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది.కొత్త చట్టం పరిధిలో ప్రస్తుతం 5 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినప్పటికీ, భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని సంస్థలను చేర్చే వెసులుబాటు కూడా పొందుపరిచారు.

Follow us