Trains Crash-Railway Board : కోరమాండల్ ఒక్కటే ప్రమాదానికి గురైంది : రైల్వే బోర్డు

ఒడిశా రైళ్ల ప్రమాదంపై.. రైల్వే బోర్డు(Trains Crash-Railway Board)  వివరణ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన కీలక  వివరాలను రైల్వే బోర్డు ఆపరేషన్స్ & బి.డి సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు.

  • Written By:
  • Updated On - June 4, 2023 / 03:42 PM IST

ఒడిశా రైళ్ల ప్రమాదంపై.. రైల్వే బోర్డు(Trains Crash-Railway Board)  వివరణ ఇచ్చింది. ఘటనకు సంబంధించిన కీలక  వివరాలను రైల్వే బోర్డు ఆపరేషన్స్ & బి.డి సభ్యురాలు జయ వర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు. కేవలం ఒక రైలు (కోరమాండల్ ఎక్స్‌ప్రెస్) మాత్రమే యాక్సిడెంట్ కు  గురైందని.. మూడు రైళ్లకు యాక్సిడెంట్ జరగలేదని  ఆమె స్పష్టం చేశారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడం వల్ల.. బెంగళూరు-హౌరా యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,  ఒక గూడ్స్ రైలుపై ఎఫెక్ట్ పడిందని వెల్లడించారు.    రైళ్ల ప్రమాదం జరిగిన ఒడిశాలోని  బాలాసోర్‌లో ఉన్న బహనాగ బజార్ నాలుగు లైన్ల రైల్వే స్టేషన్ అని.. మధ్యలో రెండు మెయిన్ రైల్వే లైన్లు, ఇరువైపులా రెండు లూప్ రైల్వే  లైన్లు ఉన్నాయని ఆమె తెలిపారు. రెండు లూప్ లైన్లలోనూ ఇనుప ఖనిజంతో కూడిన గూడ్స్ రైళ్లు నిలబడి ఉన్నాయని చెప్పారు.

Also read  : Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్  చెన్నై నుంచి హౌరాకు వెళ్తుండగా.. బెంగళూరు-హౌరా యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుంచి వస్తోందన్నారు. ఈ రెండు రైళ్లు వస్తున్నందున మధ్యలో ఉన్న 2 మెయిన్ లైన్లలో గ్రీన్  సిగ్నల్  ఇచ్చారని తెలిపారు. ఈ రెండు ట్రైన్ల స్పీడ్ గంటకు 128 కిలోమీటర్లు ఉందని జయ వర్మ సిన్హా తేల్చి చెప్పారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో వచ్చి పట్టాలు తప్పి..  ఇనుప ఖనిజంతో కూడిన రైలును ఢీకొట్టింది. “కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి  ఢీకొట్టిన  టైం లో గూడ్స్ రైలులో భారీ ఇనుప ఖనిజం లోడ్ ఉంది. దీంతో గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉన్నందున, దాని ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా పడింది . దానివల్లే భారీ సంఖ్యలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లో ఉన్న ప్రయాణికుల  మరణాలు సంభవించాయి” అని వివరించారు.  “పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు డౌన్‌లైన్‌పైకి వచ్చి, డౌన్‌లైన్‌ నుంచి గంటకు 126 కి.మీ వేగంతో వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి రెండు కోచ్‌లను ఢీకొన్నాయి. దీంతో ప్రాణనష్టం జరిగింది. రెండు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఉండటంతో అవి మంచి స్పీడ్ లో ఉండటం వల్ల .. వెంటనే రియాక్ట్ అయ్యి  సడెన్ గా బ్రేక్స్ చేసే అవకాశం లేకుండా పోయింది”  అని జయ వర్మ సిన్హా(Trains Crash-Railway Board)  తెలిపారు. సిగ్నలింగ్ సమస్య వల్లే ఈ రెండు ట్రైన్లకు ఒకే టైం లో గ్రీన్ సిగ్నల్ పడిందని తెలిపారు. అయితే మరింత దర్యాప్తు తర్వాతే దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందన్నారు.

కవచ్ ఉన్నా కాపాడేది కాదట.. ఎందుకంటే ?   

“ప్రమాదం జరిగిన ట్రైన్ రూట్ లో కవచ్ టెక్నాలజీ లేదని రైల్వే చెప్పింది.. ఒకవేళ ఆ టెక్నాలజీ ఉండి ఉంటే ప్రమాదం ఆగేదా ?” అని మీడియా అడిగిన ప్రశ్నకు రైల్వేబోర్డు అధికారి   జయ వర్మ సిన్హా ఇలా  బదులిచ్చారు.  “కవచ్ అనేది సాధారణ స్పీడ్ లో ఉన్న రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు 100 మీటర్ల దూరంలోనే వాటిని ఆపేస్తుంది.  గంటకు 130 కి.మీ వేగంతో కదులుతున్న రైళ్లకు కవచ్ టెక్నాలజీ తో బ్రేక్ వేయాలంటే.. ఆ రెండు రైళ్ల మధ్య కనీసం 600 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఒడిశాలో  రెండు రైళ్లు  అధిక స్పీడ్ తో వచ్చి ఢీకొన్న తరుణంలో.. ఒకవేళ ఆ రూట్ లో కవచ్ టెక్నాలజీ ఉన్నా ఆపలేకపోయేది. బ్రేక్స్ తో కంట్రోల్ చేయలేకపోయది ” అని  జయ వర్మ సిన్హా తేల్చి చెప్పారు.