రక్షణ సిబ్బంది ఫోన్లలో ఐఎస్ఐ మాల్ వేర్ .. రంగంలోకి NIA!!

నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా ? '' ఇదీ ఎవరో అమ్మాయి చేసిన మెసేజ్ కాదు.. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన ఏజెంట్లు ఫేస్ బుక్ చాట్ లో పంపిన సందేశం. హనీ ట్రాప్ లో భాగంగా దీన్ని మన దేశానికి చెందిన పలువురు రక్షణ శాఖ సిబ్బందికి పంపారు.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 06:00 AM IST

” హలో .. నా పేరు శాంతి పటేల్ ..
ఎలా ఉన్నారు ?
నాతో ఫ్రెండ్ షిప్ చేస్తారా ? ” ఇదీ ఎవరో అమ్మాయి చేసిన మెసేజ్ కాదు.. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన ఏజెంట్లు ఫేస్ బుక్ చాట్ లో పంపిన సందేశం. హనీ ట్రాప్ లో భాగంగా దీన్ని మన దేశానికి చెందిన పలువురు రక్షణ శాఖ సిబ్బందికి పంపారు. ఎంతోమంది అటువైపు నుంచి మాట్లాడుతున్నది ఒక మహిళ.. ఒక భారతీయురాలే అనుకోని తప్పులో కాలేశారు. చాలా రోజుల ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ తర్వాత.. అటువైపు నుంచి ఆ అమ్మాయి తన అందమైన ఫోటోలతో ఒక ఫోల్డర్ ను పంపించింది. వాటిని చూసే ఆత్రంలో.. ఫోల్డర్ ను క్లిక్ చేయగానే అందులోని మాల్ వేర్ ఫోన్లు, కంప్యూటర్లలో డౌన్ లోడ్ అయిపోయింది.

వాటిలోని కీలక సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లు తస్కరించి ఉండొచ్చని భారతదేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. బాధితుల జాబితాలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, వాటికి అనుబంధ డిపార్ట్‌మెంట్లలో పని చేసే సిబ్బంది ఉన్నారు. దీనిపై ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ప్రారంభమైంది. fb.com/shaanti.patel.89737 పేరు కలిగిన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ తతంగం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. వాస్తవానికి ఈ వ్యవహారం గురించి తొలుత 2020 జూన్‌లో మొదటిసారి ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దాదాపు 11 మంది యువ నేవీ అధికారులు పాక్ ఐఎస్ఐ హనీ ట్రాప్ కు చిక్కారని అప్పట్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో 2020 జూలై 9న భారత సైన్యం తన అధికారులు, సిబ్బందికి కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా 89 సోషల్ నెట్‌వర్కింగ్, మైక్రోబ్లాగింగ్, గేమింగ్ యాప్‌లను తమ డివైసెస్ నుంచి తొలగించాలని ఆదేశించింది. దీని ప్రాతిపదికనే ఇకపై NIA దర్యాప్తు కొనసాగనుంది.