Site icon HashtagU Telugu

New Criminal Laws : కొత్త క్రిమినల్ చ‌ట్టాల అమలుకు డేట్ ఫిక్స్

New Criminal Laws

New Criminal Laws : బ్రిటీష్ పాలకుల కాలం నాటి చట్టాల స్థానంలో పార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి  వస్తాయి.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారతీయ శిక్షాస్మృతి 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత – 2023, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ -1973 స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023,  ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు అమల్లోకి రానున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

అయితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106లో ఉన్న సబ్ సెక్షన్ (2) అమలును కేంద్ర సర్కారు తాత్కాలికంగా నిలిపివేసింది. అతివేగంగా, నిర్లక్ష్యంతో వాహనం నడపడం కారణంగా వ్యక్తి  మరణం సంభవిస్తే భారతీయ న్యాయ సంహితలోని(New Criminal Laws) సెక్షన్ 106లో ఉన్న సబ్ సెక్షన్ (2) వర్తిస్తుంది. ఈ నిబంధనకు వ్యతిరేకంగానే ట్రక్కర్లు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ మూడు చట్టాలను 2023 డిసెంబర్ 21న పార్లమెంటు ఆమోదించింది. 2023 డిసెంబర్ 25న  ఈ చట్టాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 

Also Read : Janasena Candidates List : జనసేన కు 24 స్థానాలు ఇవ్వడం ఫై వర్మ సెటైర్లు..

కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలు ఉగ్రవాదం, హత్యలు, జాతీయ భద్రతకు హాని కలిగించే నేరాలకు శిక్షలను మరింత కఠినతరం చేయనున్నాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, IPCలో ఉన్న 19 నిబంధనలు తొలగించబడ్డాయి. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా శిక్షను పెంచారు, 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా ప్రవేశపెట్టారు.

భారతీయ సాక్ష్యలో ఏముంది ?

భారతీయ సాక్ష్య ప్రకారం.. పోలీసు కేసుల్లో సాక్ష్యాలకు సంబంధించిన ఫైళ్లలో ఎలక్ట్రానిక్‌ రికార్డులను కూడా జోడిస్తారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాల స్టోరేజీ, కస్టడీ, ప్రసారం వంటి అంశాల సమర్థ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు.  సెకండరీ సాక్ష్యం నోటిమాటగా, లిఖితపూర్వకంగా సేకరణకు అవకాశం కల్పిస్తారు. న్యాయపరంగా ఆమోదించేలా ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డులను నిర్వహిస్తారు. భార్యాభర్తల కేసుల్లో కాంపిటెంట్‌ సాక్ష్యం సేకరణకు అవకాశం కల్పించారు.

భారతీయ న్యాయ సంహితలో ఏముంది ?

భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలోని 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నేరాల్లో జరిమానాలను పెంచారు. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను విధించాలని నిర్ణయించారు. కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవను శిక్షగా విధించనున్నారు. జెండర్‌లో ట్రాన్స్‌జెండర్లను చేర్చారు. దస్త్రాలుగా ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రికార్డుల పరిగణనకు అవకాశం కల్పించారు. ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని నేర జాబితా నుంచి తొలగించారు. భిక్షాటన, మానవ అక్రమ రవాణా నేరంగా పరిగణించనున్నారు. రూ.5వేల లోపు దొంగతనాలకు సమాజ సేవను శిక్షగా విధిస్తారు. బ్రిటీష్‌ క్యాలెండర్‌, క్వీన్‌, బ్రిటీష్‌ ఇండియా, శాంతి కోసం న్యాయం వంటి పదాలను తొలగించారు.

భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలో ఏముంది ?

భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలో.. మేజిస్ట్రేట్‌ విధించే జరిమానా పరిమితిని పెంచారు. మూడేళ్ల లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్‌ పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. మొదటి 40 నుంచి 60 రోజుల రిమాండులో 15 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తారు. అయితే బెయిలు ఇవ్వడానికి ఇది అడ్డంకి కాదు.  దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నారు. మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ప్రాథమిక విచారణకు అనుమతి ఇచ్చారు. తీవ్రమైన నేరాల్లో డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తారు. మొదటి కేసు నిందితుల సత్వర బెయిలుకు అవకాశం కల్పిస్తారు. తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే నిబంధనలు ఉన్నాయి. 35 నేరాల్లో ఆడియో, వీడియో రికార్డింగ్‌‌లను చేర్చారు. 35 నేరాల్లో సత్వర న్యాయానికి నిర్దిష్ట సమయాన్ని  నిర్దేశించారు.

Exit mobile version