Price Hike: కన్నీళ్లు తెప్పించే నిజం.. ద్రవ్యోల్బణం దెబ్బకు భారీగా ఖర్చు తగ్గించుకుంటున్న భారతీయులు

ఎంత కష్టం వచ్చిందిరా బాబూ! ఇంతకుముందు పిల్లలు ఒక బిస్కెట్ తింటే..

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 01:08 PM IST

ఎంత కష్టం వచ్చిందిరా బాబూ! ఇంతకుముందు పిల్లలు ఒక బిస్కెట్ తింటే.. మరో బిస్కెట్ తిను కన్నా అనేవాళ్లు. ఒక గ్లాసు పాలు తాగితే ఇంకో గ్లాస్ తాగు నాన్న అని బతిమాలేవాళ్లు. కానీ ఇప్పుడు ఒక్క బిస్కెట్ తోనే ఆపేస్తున్నారు. అర గ్లాస్ పాలకే పరిమితమవుతున్నారు. కారణం.. ధరల పెరుగుదల. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఎక్కడో ఉక్రెయిన్-రష్యాలు యుద్ధం చేసుకుంటుంటే.. ఇక్కడ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో భారతీయులంతా నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. నెలకు నాలుగు సబ్బులు వాడాల్సిన చోట రెండు సబ్బులతోనే సరిపెట్టుకుంటున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలను కంపెనీలు భారీగా పెంచేశాయి. నూడుల్స్ నుంచి డిటర్జెంట్ల వరకు, బిస్కెట్ల నుంచి పాల వరకు దేనినీ విడిచిపెట్టలేదు. అదేమంటే.. ఈ వస్తువుల తయారీకి అయ్యే ముడిసరుకు ధర భారీగా పెరిగిందని చెబుతున్నాయి. దీంతో గత ఏడాదిన్నరగా చూస్తే.. ఎప్పుడూ లేనంతగా ఈ మార్చి నెలకు ద్రవ్యోల్బణం 6.95 శాతానికి పెరిగింది. దీంతో భారతీయ కుటుంబాలు నిత్యావసర వస్తువుల వినియోగాన్ని భారీగా తగ్గించుకుంటున్నాయి. ఇది కంపెనీల ఆదాయాలపై పెద్ద ప్రభావం చూపించింది. సేల్స్ తగ్గిపోవడం లేదా లాభంలో కోత పడడమో జరిగింది.

చాలా సంస్థలు తమ ఉత్పత్తుల రేట్లను దాదాపు 30 శాతం వరకు పెంచాయని ఓ అంచనా. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. బిజోమ్ అనే సంస్థ సర్వేలో తేలిన నిఖార్సయిన నిజాలివి. ఇది దాదాపు 70 లక్షల జనరల్ స్టోర్స్ డేటాను ఆధారంగా చేసుకుని చెప్పింది. దీని విశ్లేషణను బట్టి చూస్తే.. కేజీ సరుకు కొనాల్సిన చోట అరకేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. లేదా అంతకన్నా తక్కువ రేటుకు వచ్చేవాటివైపు మొగ్గుచూపుతున్నారు. ఇదంతా డబ్బును పొదుపు చేసుకోవడం కోసమే. అమెరికాలో అయితే ద్రవ్యోల్బణం 18 శాతం ఉంది. బ్రిటన్ లో అయితే వివిధ వస్తువుల ధరలు మార్చి నెలలో ఏడు శాతం మేర పెరిగాయి.

వచ్చే ఏడాది లోపు ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెరిగే ఛాన్స్ ఉందంటోంది రిజర్వ్ బ్యాంక్. దీనివల్ల ఆహార ఉత్పత్తుల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించింది. దీనివల్ల కుటుంబాలన్నీ తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఆహారం కోసమే ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నందున ఆన్ లైన్ గ్రాసరీ స్టోర్స్ కూడా రేట్లు పెంచేయవచ్చని ఇప్పటికే వినియోగాదురులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద సంస్థలే తమ ఉత్పత్తుల్లో టూత్ పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటివాటిలో సేల్స్ తగ్గడమో.. లేదా పెరగకపోవడమో జరిగిందంటున్నాయి. అదే సబ్బుల ఉత్పత్తిని చూస్తే.. మార్చి నెలలో 5 శాతం మేర తగ్గిందంటోంది బిజోమ్ సంస్థ.

ఫిబ్రవరి 24న ఎప్పుడైతే ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి వివిధ వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పైగా 2014 తరువాత బ్యారెల్ చమురు ధర 100 డాలర్లను టచ్ చేయడంతో ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. క్రూడాయిల్ విషయంలో మన దేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడింది. క్రూడాయిల్ ధరలు 10 డాలర్లు కాని పెరిగితే.. రిటైల్ ద్రవ్యోల్బణం 50 నుంచి 60 బేస్ పాయింట్లు పెరుగుతాయి. బిజోమ్ సంస్థ డేటా ప్రకారం చూస్తే.. బెవరేజెస్ అన్నీ 2 శాతం, పర్సనల్ కేర్ ప్రోడక్టులు అన్నీ 4 శాతం, కమోడెటీలు అన్నీ 10 శాతం మేర ఈ ఏడాది జనవరి-మార్చి నెలల మధ్య పెరిగాయి. ఇలాంటి పరిస్థితిని డౌన్ ట్రేడింగ్ అంటారు.

మన దేశంలోని పెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థలన్నీ తమ ఉత్పత్తుల ధరలను దాదాపు 30 శాతం మేర పెంచాయి. దీనివల్ల సేల్స్ పెరుగుతుందా లేదా అంటే.. చాలామంది వినియోగదారులు తమ వినియోగాన్ని తగ్గించుకోవడమో లేదా తక్కువ ధర ఉన్న వస్తువులను కొనుగోలు చేయడమో జరుగుతోంది. కరోనా వల్ల దెబ్బతిన్న సప్లయ్ చైన్.. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల మరింత దారుణంగా దెబ్బతింది. ఉదాహరణకు చూస్తే.. మనం వినియోగించే సన్ ఫ్లవర్ నూనెలో దాదాపు 80 శాతం ఉక్రెయిన్ నుంచే వస్తోంది. ఇప్పుడు యుద్ధంతో ఆ సప్లయ్ చైన్ దెబ్బతినడంతో మొత్తం వ్యవస్థపై ప్రభావం పడింది.

సన్ ఫ్లవర్ నూనె సప్లయ్ తగ్గడంతో ఇప్పుడు చాలామంది పామాయిల్ మీద పడ్డారు. దీంతో ఆ నూనె ధరలు 22 శాతం మేర పెరిగాయి. పైగా అక్కడి నుంచి వచ్చే షిప్పులు కూడా యుద్ధం జరగని ప్రాంతాల మీదగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల కూడా ధరాభారం తప్పడం లేదు. ఈమధ్య నిర్వహించిన ఓ సర్వేలో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. నూటికి 24 శాతం మంది తమ వంట నూనె వినియోగాన్ని భారీగా తగ్గించుకున్నామని చెప్పారు. ఇప్పుడు నూనెకు తోడు స్టీల్ ధరలు కూడా పెరుగుతాయి. బొగ్గు, స్టీలు, ఐరన్ ఓర్ వంటివాటిని ప్రపంచానికి ఎక్కువగా ఎగుమతి చేసేవి రష్యా, ఉక్రెయిన్ దేశాలు. ఇప్పుడు అవి సప్లయ్ చేసే పరిస్థితి లేకపోవడంతో వాటి ధరలు కూడా పెరిగాయి. మొత్తానికి తేలింది ఏంటంటే.. ధరల పెరుగుదల వల్ల వినియోగదారులు తాము కొనే వస్తువుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు లేదా తక్కువ ధర ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తు్న్నారు.