Russian cruiser Moskva :మాస్క్ వా మునకపై భారత నేవీ అధ్యయనం..వెల్ల‌డైన ఆశ్చర్యకర నిజాలు

ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధంలో తొలిసారిగా రష్యా తీవ్ర ఆవేదనకు గురైన ఘటన ఏది ? అంటే.. యుద్ధ నౌక 'మాస్క్ వా' ను ఏప్రిల్ 14న ఉక్రెయిన్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు పేల్చినప్పుడు.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

  • Written By:
  • Updated On - April 21, 2022 / 11:32 PM IST

‘ మాస్క్ వా’ మునకపై.. భారత నేవీ అధ్యయనం
– మన యుద్ధ నౌకలకు అలాంటి ఇబ్బంది రాకుండా వ్యూహరచన
– యాంటీ షిప్ మిస్సైళ్లను తిప్పికొట్టే పరిజ్ఞానం అభివృద్ధిపై కసరత్తు

ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధంలో తొలిసారిగా రష్యా తీవ్ర ఆవేదనకు గురైన ఘటన ఏది ? అంటే.. యుద్ధ నౌక ‘మాస్క్ వా’ ను ఏప్రిల్ 14న ఉక్రెయిన్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు పేల్చినప్పుడు.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎంతటి మహా శక్తిశాలి సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికైనా ఇలాంటి ఒక ఘటన చాలు !! అందుకే రష్యాకు ఎదురైన చేదు అనుభవం నుంచి పాఠాలు నేర్చుకునేందుకు భారత నేవీ సిద్ధమైంది. మన దేశ యుద్ధ నౌకలకు అలాంటి దుస్థితి ఎదురుకాకుండా ఏం చేయాలి ? యుద్ధ నౌకల వైపు దూసుకొచ్చే మిస్సైళ్ల ను ఎలా గుర్తించాలి ? ఏవిధంగా తప్పించుకోవాలి ? యాంటీషిప్, బాలిస్టిక్ మిస్సైళ్ల కంట్లో పడకుండా ఏ పద్ధతిలో తప్పించుకోవాలి ? అనే అంశాలపై భారత సైన్యం మేధోమథనం ప్రారంభించింది. వచ్చేవారం జరగనున్న ‘ నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ‘ లోనూ ఇదే అంశంపై ప్రధాన చర్చ జరగనుంది.

వారెవా .. డీఆర్డీఓ ‘చాఫ్’ టెక్నాలజీ

యుద్ధ నౌకల లొకేషన్ శత్రు దేశాల మిసైళ్లకు తెలియకుండా చేసే, యుద్ధ నౌకల వైపు దూసుకొచ్చే మిసైళ్లను ముందస్తుగా గుర్తించేందుకు దోహదం చేసే పరిజ్ఞానం అభివృద్ధిపై గతకొన్ని దశాబ్దాలుగా భారత సైన్యం పరిశోధనలు చేస్తోందని భారత నేవీ మాజీ అడ్మిరల్ ఒకరు తెలిపారు. ఈ అన్వేషణ చేస్తున్న క్రమంలోనే 2021 సంవత్సరంలో ‘ఐఎన్ఎస్ ధృవ్’ అనే బాలిస్టిక్ మిసైల్ ట్రాకింగ్ షిప్ ను నౌకాదళంలోకి చేర్చినట్లు చెప్పారు. సముద్ర మార్గాల మీదుగా భారత్ వైపు దూసుకొచ్చే మిసైళ్లను ముందస్తుగా గుర్తించే పనిని ‘ఐఎన్ఎస్ ధృవ్’ చేస్తుందన్నారు. ఇక రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( డీ ఆర్ డీ ఓ) మరో అడుగు ముందుకు వేసి.. యుద్ధ నౌకల రక్షణ కోసం ‘ chafs ‘ వ్యవస్థను ఆవిష్కరించింది.’ chafs ‘ వ్యవస్థ కలిగిన యుద్ధ నౌకలు.. తమవైపు దూసుకొచ్చే యాంటీ షిప్ మిస్సైళ్లను గుర్తించి అప్రమత్తం అవుతాయి. యుద్ధ నౌకకు దూరంగా మెటాలిక్ మేఘాలను సృష్టిస్తాయి. దూసుకొస్తున్న యాంటీ షిప్ మిస్సైళ్లు .. మెటాలిక్ మేఘాలను చూసి వాటినే యుద్ధ నౌకలని భావించి, అటువైపుగానే వెళ్లి దారి తప్పుతాయి. దీంతో యుద్ధ నౌకలు గండం నుంచి గట్టెక్కుతాయి.