Indian Air Force : చైనా స‌రిహ‌ద్దుల్లో భార‌త్ `ఫైట‌ర్ జెట్` ల గ‌స్తీ

వాస్తవాధీన రేఖ‌ను దాటుతోన్న చైనా సైన్యాన్ని నిలువ‌రించేందుకు భార‌త్ జెట్ ఫైట‌ర్ల‌(fighter jet)ను స‌రిహ‌ద్దుల‌పై మోహ‌రించింది.

  • Written By:
  • Publish Date - December 13, 2022 / 01:17 PM IST

వాస్తవాధీన రేఖ‌ను దాటుతోన్న చైనా సైన్యాన్ని నిలువ‌రించేందుకు భార‌త్ జెట్ ఫైట‌ర్ల‌(India fighter jet)ను స‌రిహ‌ద్దుల‌పై మోహ‌రించింది. అరుణాచ‌ల్ ప్రదేశ్ వెంబ‌డి ఉండే స‌రిహద్దు(border) ప్రాంతాల్లో గ‌స్తీని పెంచింది. చైనా ఉల్లంఘనలను నిరోధించడానికి ఫైటర్ జెట్‌(India fighter jet)లను గ‌త వారం రోజులుగా ప్ర‌యోగించిన‌ట్టు భార‌త ప్ర‌భుత్వం ధ్రువీక‌రించింది. స‌రిహ‌ద్దు(border) వెంబ‌డి చైనా వైమానిక కార్యకలాపాలను గ‌మ‌నించిన భారత వైమానిక దళం అరుణాచల్ ప్రదేశ్‌లో చురుకైన పోరాట గస్తీని ప్రారంభించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)కి వెంబడి చైనా జెట్‌లను భార‌త సైన్యం గుర్తించింది. ప్ర‌తిగా భార‌త వైమానిక దళం గస్తీ ని పెంచింది. డిసెంబర్ 9న LAC వద్ద భారత మరియు చైనా దళాలు ఘర్షణ పడిన విష‌యం ఆల‌స్యంగా వెలుగుచూసింది. పార్ల‌మెంట్ వేదిక‌గా ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వ‌ద్ద గ‌త వారం భార‌త్‌, చైనా సైన్యం మ‌ధ్య భౌతిక పోరు జ‌రిగింద‌ని ధ్రువీక‌రించారు. భారత సైనికులు స‌మ‌ర్థ‌వంతంగా చైనా సైనికులను తిరిగి వెళ్లమని హెచ్చ‌రించార‌ని తెలిపారు.ఈ ఘ‌ర్ష‌ణ‌లో “మా సైనికులు ఎవరూ మరణించలేదు లేదా తీవ్రంగా గాయపడలేదు” అని రక్షణ మంత్రి తన సంక్షిప్త ప్రకటనలో వెల్ల‌డించారు. అయితే, ఆయ‌న స్టేట్ మెంట్ కు సంతృప్తి చెంద‌ని ప్రతిపక్షం వాకౌట్ చేసింది.

భార‌త్, చైనా సైన్యం మ‌ధ్య

ముగ్గురు సైనికాధిపతులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో విడివిడిగా స‌మావేశ‌మైన త‌రువాత రాజ్ నాథ్ సింగ్ పార్ల‌మెంట్లో ఒక ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. ఆయ‌న ఇచ్చిన నివేదిక ప్ర‌కారం భార‌త్, చైనా సైన్యం మ‌ధ్య డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఘర్షణలు జ‌రిగింది. చైనా దళాలు LACని దాటాయి. దీంతో భారత సైనికులు దృఢంగా అడ్డుకుని వాళ్ల‌ను వెనక్కి నెట్టారు. రెండు వైపుల నుండి కొంతమంది సిబ్బందికి చిన్న గాయాలు అయ్యాయ‌ని చెప్పారు. ఇరు దేశాల‌ సైన్యం ఆ త‌రువాత రెండు వైపులా స‌రిహ‌ద్దు ప్రాంతం నుండి విడిచిపెట్టి వెళ్లారని తెలిపారు. సరిహద్దు గురించి విభిన్నమైన అవగాహనల న‌డుమ 2006 నుండి ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. “అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని LAC వెంబడి కొన్ని ప్రాంతాలలో భిన్నమైన అవగాహన ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, ఇందులో ఇరుపక్షాలు తమ క్లెయిమ్ లైన్ల వరకు ఆ ప్రాంతాన్ని పెట్రోలింగ్ చేస్తాయి” అని ప్ర‌భుత్వ వర్గాలు తెలిపాయి.

చైనాతో ఫ్లాగ్ మీటింగ్

ఈ ప్రాంతంలోని భారత కమాండర్ “శాంతి మరియు ప్రశాంతతను పునరుద్ధరించడానికి నిర్మాణాత్మక యంత్రాంగాలకు” అనుగుణంగా చైనాతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించాడని ప్రభుత్వం తెలిపింది.తూర్పు లడఖ్‌లో జరిగిన సంఘటనల తర్వాత చాలా కాలం తర్వాత ఘర్షణలు చెలరేగాయి. 2020 జూన్‌లో గాల్వాన్ లోయలో జరిగిన ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. ఇరు దేశాల సైనికులు ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇరు దేశాల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి, పాంగోంగ్ సరస్సు సౌత్ బ్యాంక్ వద్ద మిలిటరీ కమాండర్ల మధ్య పలు సమావేశాల తరువాత, లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్‌తో సహా కీలకమైన పాయింట్ల నుండి భారత మరియు చైనా దళాలు వెనక్కి తగ్గాయి. కానీ, ఇప్పుడు త‌వాంగ్ వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న ఇరు దేశాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉద్రిక్తత నెల‌కొంది. భార‌త సైన్యం జెట్ ఫైట‌ర్ల‌ను మోహ‌రించ‌డం ద్వారా చైనా సైన్యానికి ధీటైన స‌మాధానం ఇస్తోంది.