Site icon HashtagU Telugu

Gender Equality : లింగ సమానత్వంలో దిగజారిన భారత్ ర్యాంక్.. పాక్ ఎక్కడుందంటే..

Gender Equality India Ranking

Gender Equality India Ranking

Gender Equality :  స్త్రీ, పురుష సమానత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈవిషయంలో మన దేశం ఇంకా వెనుకబడే ఉంది.  ఆందోళనకరమైన అప్‌డేట్ ఏమిటంటే.. ఈవిషయంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో భారత్ ర్యాంకింగ్ మరో రెండు అంకెలు పడిపోయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌‌లో ఈవివరాలను ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలతో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌‌‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రూపొందించింది. ఇందులో భారత్‌కు ఈసారి 129వ ర్యాంకు వచ్చింది. గత ఏడాది ఈ ఇండెక్సులో మన దేశం 127వ ర్యాంకులో నిలిచింది. ఈ లిస్టులో ప్రపంచంలోనే నంబర్ 1 ప్లేసులో  ఐస్‌‌లాండ్ దేశం నిలిచింది. అంటే ఆ దేశంలో అత్యంత మెరుగైన స్థితిలో లింగ సమానత్వం ఉంది. అక్కడ స్త్రీ, పురుషులను సరిసమానంగా చూస్తున్నారు.  గత 14 ఏళ్లుగా ఈ ఇండెక్సులో ఐస్‌లాండ్ దేశం మొదటి ప్లేసులోనే కొనసాగుతుండటం విశేషం. లింగ సమానత్వంలో(Gender Equality) ఐస్‌‌లాండ్ తర్వాతి స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ఉన్నాయి.

Also Read : Delhi Water Crisis : ‘‘నీళ్లన్నీ ఏమవుతున్నాయి ?’’ : ఢిల్లీ సర్కారుకు ‘సుప్రీం’ ప్రశ్న

ఇక లింగ సమానత్వం ఇండెక్సులో పాకిస్తాన్ ర్యాంకు గత ఏడాది కంటే మూడు స్థానాలు దిగజారి 145కు పడిపోయింది. దక్షిణాసియా దేశాల పరంగా చూస్తే.. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత ఐదో స్థానంలో భారత్ నిలిచింది. భారత్‌కు 129వ ర్యాంకు వచ్చింది. పాకిస్తాన్ 145వ ర్యాంకుతో దక్షిణాసియా దేశాల్లో  ఆరో స్థానంలో నిలిచింది.  లింగ సమానత్వం విషయంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత చివరి స్థానంలో సూడాన్ దేశం ఉంది. స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వం విషయంలో బంగ్లాదేశ్, సూడాన్, ఇరాన్, పాకిస్తాన్, మొరాకోలు అధ్వానంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈవిషయంలో భారత్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

భారత్ ఆ విషయాల్లో భేష్

సెకండరీ తరగతుల్లో స్త్రీ, పురుష విద్యార్థుల నమోదు విషయంలో భారత్ అత్యుత్తమ లింగ సమానత్వాన్ని చూపిందని ఈ నివేదిక ప్రశంసించింది.   రాజకీయాల్లో మహిళల సాధికారత పరంగా ప్రపంచంలో భారత్ 65వ స్థానంలో నిలిచింది. భారత్‌లో మహిళలకు కేవలం 6.9 శాతం మంత్రి పదవులను కేటాయిస్తున్నారని నివేదిక చెప్పింది. భారత పార్లమెంట్‌లో 17.2 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. 140 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్న భారత్ 2024లో 64.1 శాతం మేర లింగ అసమానతలను తగ్గించిందని నివేదిక కొనియాడింది. ఇక ఇదే సమయంలో యావత్ ప్రపంచంలో సగటున 68.5 శాతం మేర లింగ అసమానతలు తగ్గాయని వెల్లడించింది. ప్రస్తుత వేగంతో పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా లింగ అసమానతలు తొలగించాలంటే ఇంకో 134 సంవత్సరాలు పడుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యయన  నివేదిక స్పష్టం చేసింది. 134 సంవత్సరాలు అంటే ఐదు తరాలకు సమానమని తెలిపింది.