Political Strategist : అభ్యర్థులు, పార్టీల విజయానికి ఎన్నికల వ్యూహకర్తలు ఏమేం చేస్తారు?

ఎన్నికల వ్యూహకర్తలు లేనిదే అడుగైనా కదపలేని స్థితికి రాజకీయ పార్టీలు చేరుకుంటున్నాయి. అందుకే పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ఎలక్షన్ స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 10:25 AM IST

ఎన్నికల వ్యూహకర్తలు లేనిదే అడుగైనా కదపలేని స్థితికి రాజకీయ పార్టీలు చేరుకుంటున్నాయి. అందుకే పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ఎలక్షన్ స్ట్రాటజిస్టులను నియమించుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరికీ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు లేనిదే గెలుపు సాధ్యం కాదు అన్న అభిప్రాయం వచ్చింది. ఇంతకీ ఆ ఎన్నికల వ్యూహకర్తలు ఎవరు? జనం ఎవరికి ఓట్లు వేయాలో వాళ్లు డిసైడ్ చేయించగలరా? ప్రజల అభిప్రాయాలను తారుమారు చేయగలరా? 2014లో మోదీని జాతీయస్థాయి నేతగా మార్చిన పీకేతోనే వాళ్లకు గుర్తింపు వచ్చింది. మరి అలాంటివాళ్లు ఫీల్డ్ లో ఎవరెవరు ఉన్నారు?

దేశ రాజకీయాల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు ఒకటే పేరు వినిపిస్తోంది. అది.. ప్రశాంత్ కిషోర్. ఒక ఎన్నికల వ్యూహకర్తకు అంత చరిష్మా ఎక్కడిది? 2014 లో భారతీయ జనతా పార్టీ పీకేపైనే ఎన్నికల వ్యూహాల కోసం ఆధారపడింది. తరువాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో డీఎంకే పార్టీ, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ.. అన్నీ ప్రశాంత్ కిషోర్ పైనే నమ్మకం పెట్టుకున్నాయి. మన దేశ రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్టులు కేవలం ఆయన ఒక్కరేనా? ఆయన శిష్యుడు సునీల్ కనుగోలుతోపాటు ఇంకా ఎంతమంది ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు? అసలు వాళ్లు ఏమేం చేస్తారు?

వ్యూహకర్తల చరిత్ర తిరగేస్తే చాలామంది ఉన్నారు. అపర చాణక్యుడికి మించిన ఆర్థిక, రాజకీయ వ్యూహకర్త ఎవరున్నారు? చాణక్యుడి తరువాత మన దేశంలో ఎంతోమంది వ్యూహకర్తలు వచ్చినా.. చాణక్యుడి పేరును కాని, పవర్ ని సంపాదించలేకపోయారు. మారుతున్న కాలాన్ని బట్టి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఇప్పుడు బాగా పెరిగింది. ప్రశాంత్ కిషోర్ కన్నా ముందు… చాలామంది ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. ఎంతోమంది అభ్యర్థులకు, పార్టీలకు విజయాలను అందించారు. అలాంటివారిలో 700 మంది అభ్యర్థులకు పైగా ఇలాంటి సేవలను అందించిన గౌరవ్ రాథోడ్, సౌరవ్ వ్యాస్ గురించీ చెప్పుకోవాలి. పొలిటికల్ ఎడ్జ్ అనే సంస్థను స్థాపించి 2011 నుంచీ వీళ్లు ఈ ఫీల్డ్ లో ఉన్నారు.

పీకే శిష్యుడు సునీల్ కనుగోలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కు సేవలు అందిస్తున్నారు. ఇక 2013లో చాణక్య సంస్థను స్థాపించిన ఆరిందమ్ మన్నా.. పార్థా ప్రతీమ్ దాస్ గురించీ తెలుసుకోవాల్సిందే. వీళ్లంతా మామూలోళ్లు కాదు. తిమ్మిని బమ్మిని చేసేస్తారు. అంటే ఒక అభ్యర్థి మీద కాని, ఒక పార్టీ మీద కాని స్థానిక ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని రోజులు, నెలల వ్యవధిలోనే మార్చేయగలరు. కానీ దానికోసం వీళ్లు చాలా కష్టపడతారు. బూత్ లెవల్ డేటాను కాచి వడబోస్తారు. వ్యూహాలను తయారుచేస్తారు.

ఎన్నికల వ్యూహకర్తల స్ట్రాటజీ ఎలా ఉంటుందో చెప్పాలంటే.. 2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో పఠాన్ కోట్ నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కడ కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు టిక్కెట్ పొందిన అభ్యర్థిని గెలిపించిన ఘనత ఇద్దరు వ్యూహకర్తలది. పైగా ఆయన రాజకీయ నాయకుడు కూడా కాదు. ఓ ఉద్యోగి. అలాంటప్పుడు ఈ విజయం కోసం వారు అనుసరించిన వ్యూహమేంటి? ఇక యువ ఓటర్లను, స్వింగ్ ఓట్లను వారు.. ఈ స్ట్రాటజిస్టులు తమ అభ్యర్థులకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు? వారి రోజువారీ పోల్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఇదంతా నిజంగా చాలా ఆసక్తికరంగ ఉంటుంది.

ఎన్నికల వ్యూహకర్తలకు ఒక్కోసారి నెలలకొద్దీ సమయం ఏమీ ఉండదు. రోజుల వ్యవధిలోనే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. గురుగావ్ లో ఉన్న పొలిటికల్ ఎడ్జ్ అనే ఎలక్షన్ స్ట్రాటజీలను తయారుచేసే సంస్థకు ఓ అసైన్ మెంట్ వచ్చింది. దీనిని స్థాపించినవారు గౌరవ్ రాథోడ్, సౌరవ్ వ్యాస్. ఓ ప్రముఖ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న 39 ఏళ్ల అమిత్ విజ్ కు.. పంజాబ్ లోని పఠాన్ కోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అది కూడా ఎన్నికలకు సరిగ్గా 21 రోజుల ముందు. ఆయనకు రాజకీయాలు కొత్త కాదు. ఎందుకంటే ఆయన తండ్రి అనిల్ విజ్ సీనియర్ కాంగ్రెస్ నేత. కాకపోతే అమిత్ కు పాలిటిక్స్ పై పట్టు లేదు. అమిత్ విత్ ప్రత్యర్థి.. బీజేపీ నేత అయిన అశ్వని కుమార్ శర్మ. 2012లో 19 శాతం మార్జిన్ తో ఆయన అక్కడ గెలిచారు. అయినా సరే.. విజ్ గెలుపును ఛాలెంజ్ గానే తీసుకుంది పొలిటికల్ ఎడ్జ్ సంస్థ.

అమిత్ విజ్ ప్రొఫైల్ ని స్టడీ చేశారు. తరువాత పఠాన్ కోట్ నియోజకవర్గం చరిత్ర చూశారు. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో సర్వే చేశారు. ఆపై మూడు అంశాలపై క్లారిటీకి వచ్చారు రాథోడ్, వ్యాస్. అవి.. యువతపై పూర్తిగా ఫోకస్ పెట్టమన్నారు. పరిశ్రమలు తెస్తానని చెప్పమన్నారు. ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేయమన్నారు. సభల్లో, ప్రెస్ మీట్లలో అమిత్ ను గౌరవంగా మాట్లాడమన్నారు. ఆ నియోజకవర్గంలో అమిత్ గురించి తెలిసినవారు తక్కువ. అందుకే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయమన్నారు. రోజూ 18 గంటల పాటు ఫీల్డ్ లోనే ఉండాలన్నారు. ఈ వ్యూహాల కోసం తొలిరోజు అంతా ఎన్నికల వ్యూహకర్తలు వార్ రూమ్ లోనే గడిపారు. ఏరోజుకారోజు క్యాంపైన్ స్ట్రాటజీ రిపోర్ట్స్ ను బట్టి తరువాతి రోజు వ్యూహాలను తయారుచేసేవారు. అలా పది రోజుల పాటు చేసిన తరువాత క్యాంపైన్ గాడిలో పడింది. అంటే 21 రోజుల్లో 10 రోజులు అలా గడిచిపోయాయి.

పదిరోజుల పాటు క్యాంపైన్ అయ్యాక.. తరువాతి పది రోజుల్లో డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించుకుని ఆ పని చేశారు. దీంతోపాటు వలంటీర్ల సేవలు వినియోగించుకున్నారు. పార్టీ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. ఫీల్డ్ నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నారు. దీనిని బట్టి అమిత్ తన ప్రచారంలో ఏఏ అంశాలు ప్రస్తావించాలో, ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో డిసైడ్ చేశారు. సాధారణంగా ఇలాంటి క్యాంపైన్ లు చేయాలంటే నెలలకొద్దీ సమయం పడుతుంది. పైగా అభ్యర్థులను బట్టి స్ట్రాటజీ మార్చాల్సి వస్తుంది. అయినా పొలిటికల్ ఎడ్జ్ సంస్థ దీనిని 21 రోజుల వ్యవధిలోనే పూర్తి చేయగలిగింది. దీంతో అమిత్ విజ్ కు 56,383 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి అయిన బీజేపీ ఎమ్మెల్యేకి 45,213 ఓట్లు వచ్చాయి. అంటే అమిత్ విజ్ విజయం సాధించారు. ఎన్నికల వ్యూహకర్తలు ఒక అభ్యర్థిని గెలిపించడానికి ఏం చేస్తారో, ఎలా చేస్తారో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. ఇప్పుడైతే ప్రశాంత్ కిషోర్ కు ఫుల్ డిమాండ్ ఉంది. తరువాతి కాలంలో.. స్ట్రాటజిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అలాంటి పేరు ఇంకెవరికైనా రావచ్చు. పీకే లాంటి మరికొంతమంది సక్సెస్ ఫుల్ వ్యూహకర్తలు తయారుకావచ్చు.

ఎన్నికల వ్యూహకర్తలు గత పుష్కర కాలంలో దేశ రాజకీయాల్లో ఎలా అల్లుకుపోయారో, ఎలా పాతుకుపోయారో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మన దేశంలో ఎన్నికలంటే సైన్స్ కాదు ఒక ఆర్ట్. ఎందుకంటే ఎన్నికల్లో భావోద్వేగాలు ప్రజలను బాగా ప్రభావితం చేస్తాయి. 2019 సార్వత్రిక ఎన్నికలే దానికి ఉదాహరణ. ఐఐటీ చదివినవారు రాజకీయాలపై ఆసక్తితో ఇలా ఎన్నికల వ్యూహకర్తలుగా మారుతున్నారు. పైగా వీళ్లు ఏ అభ్యర్థినీ గెలిపిస్తామని మాట ఇవ్వరు. కానీ అంతకుముందు వచ్చిన ఓట్ల శాతం కన్నా 4 నుంచి ఆరు శాతం ఓట్లను ఎక్కువ తెప్పిస్తామని మాత్రం మాట ఇస్తారు. అదే పార్టీలకైతే.. ఐదు శాతం ఓట్ షేర్ మార్జిన్ పై హామీ ఇస్తారు. చెప్పుకోవడానికి ఐదు శాతమేనా అనుకోవచ్చు. కానీ అది ఏకంగా గెలుపోటములను శాసించగలదు. ప్రభుత్వాలను మార్చేయగలదు. అందుకే ఈ మార్జిన్ వచ్చినా చాలనే అభ్యర్థులు, పార్టీలు కూడా ఉన్నాయి.

ఈ మార్జిన్ లెక్క తెలియాలంటే.. మధ్యప్రదేశ్ లో 2018లో జరిగిన ఎన్నికలను పరిశీలించవచ్చు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 114 సీట్లు వచ్చాయి. బీజేపీ 109 సీట్లను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలైంది. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే.. ఆ రాష్ట్రంలో ఉన్న 1.2 శాతం జనాభా.. అంటే 5,42,295 మంది ఓటర్లు అదనంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో వారికి బీజేపీకన్నా ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి. అదే కాంగ్రెస్ కు అధికారాన్ని అందించింది. ఇక గుజరాత్ ఎన్నికలను చూస్తే.. 16 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 3000 ఓట్లకన్నా తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు. కానీ దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఇక్కడే ఉంటుంది. ఇలాంటి మార్జిన్ ఓట్లను వాళ్లు తమ వ్యూహాలతో అనుకున్న పార్టీకి వచ్చేలా చేయగలరు. అందుకే వీరికి భవిష్యత్తులోనూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.